ప్రాజెక్టులు నత్తనడక

21 May, 2014 02:28 IST|Sakshi

సాక్షి, నెల్లూరు: మహానేత డాక్టర్ వైఎస్సార్ హయాంలో జిల్లాలో సుమారు రూ.2 వేల కోట్లతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. వైఎస్సార్ మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన  వారు ఆ పనులను పూర్తిగా విస్మరించారు. కొన్ని పనులకు నామమాత్రంగా నిధులు మంజూరు కావడంతో పనులు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో జలయజ్ఞం కింద చేపట్టిన రూ.944 కోట్ల విలువైన పనులు 60 శాతం కూడా పూర్తికాలేదు. వైఎస్సార్ ఉన్నప్పుడు 50 శాతం పనులు పూర్తికాగా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 10 శాతం పనులను కూడా పూర్తిచేసిన పాపాన పోలేదు.  దీంతో జిల్లాలో సోమశిల పరిధిలో ఏటికేటికీ సాగువిస్తీర్ణం తగ్గిపోతోంది. మహానేత వైఎస్సార్ ఆశయానికి తూట్లు పడుతున్నాయి. పనుల ప్రగతిలో నెలకొన్న ప్రతిష్టంభనపై రైతుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 పెండింగ్‌లో పనులు
 2008-09లో 33వ ప్యాకేజీ కింద రూ.122.50 కోట్లతో సంగం బ్యారేజీ పనులను వైఎస్సార్ ప్రభుత్వం చేపట్టింది. రెండున్నరేళ్లలో పూర్తి కావాల్సిన పనులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ప్యాకేజీ 6 కింద రూ.126.70 కోట్లతో పనులు చేపట్టారు. ఇప్పటికీ రూ.20 కోట్ల మేర మాత్రమే పనులు పూర్తయ్యాయి. పెన్నాడెల్టా ఆధునికీకరణకు సంబంధించి 2008లో ప్యాకేజీ 34 కింద రూ.76.89 కోట్లతో సదరన్, ఈస్ట్రన్ ఛానల్ లైనింగ్‌తోపాటు తూముల మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికీ రూ.5.24 కోట్ల మేర మాత్రమే పనులు జరిగాయి. ప్యాకేజీ కేసీడీ-1 కింద 2009లో కనుపూరు కాలువ ఆధునికీకరణను రూ.29.50 కోట్లతో ప్రారంభిస్తే రూ.20కోట్ల మేర కూడా పనులు జరగలేదు. ప్యాకేజీ-4 కింద 2008లో రూ.71.64 కోట్లతో కనుపూరు కాలువ ఆధునికీకరణ పనులు చేపట్టగా కేవలం రూ.20 కోట్ల మేర మాత్రమే పనులు
 
 జరిగాయి. ప్యాకేజీ 39 కింద 2007-08లో రూ.34.44 కోట్లతో దువ్వూరు కాలువ, దగదర్తి, అల్లూరు ట్యాంక్ సప్లై ఛానల్ ఆధునికీకరణ పనులు చేపట్టగా రూ. 5కోట్ల పనులు కూడా పూర్తికాలేదు. ప్యాకేజీ 35 కింద 2009లో రూ.80.40 కోట్లతో సర్వేపల్లి, కృష్ణపట్నం, ఈదగాలి కాలువ లైనింగ్ పనులు చేపట్టగా రూ.60కోట్లు పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఈదూరు, కోడూరు చెరువుల మరమ్మతులు, కాలువ లైనింగ్ పనులను 2007లో రూ5.85 కోట్లతో పనులు చేపట్టగా రూ. 3కోట్ల మేర మాత్రమే జరిగాయి. ప్యాకేజీ 40 కింద 2008లో రూ.46.25 కోట్లతో చేపట్టిన జాఫర్‌సాహెబ్, గంగపట్నం, వరిగొండ కాలువల లైనింగ్‌లో రూ.26కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి, ప్యాకేజీ 1 కింద 2009లో రూ.321 కోట్లతో సదరన్ ఛానల్, జాఫర్ కెనాల్, సర్వేపల్లి కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఇప్పటివరకు కేవలం రూ.200ల కోట్ల మేర మాత్రమే పనులు జరిగాయి.
 
  వీటితో పాటు కండలేరు కాళంగి, స్వర్ణముఖి, పెన్నా, పొర్లుకట్టల ఆధునికీకరణలతోపాటు సోమశిల ఆధునికీకరణ పనులు వైఎస్ హయాంలో చేపట్టారు. ఆయన మరణంతో పనులు ఆగాయి. ఆ తర్వాత సీఎంలుగా వ్యవహరించిన రోశయ్య, కిరణ్ జలయజ్ఞం పనులను పూర్తిగా విస్మరించారు. దీంతొ జిల్లాలో సోమశిల పరిధిలో పెన్నాడెల్టా కింద సదరన్, ఈస్ట్రన్ ఛానల్స్, కనిగిరి రిజర్వాయర్, సర్వేపల్లి కాలువ, జాఫర్ సాహెబ్ కాలువ కింద 3 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద 70వేల ఎకరాలు, కావలి కాలువ కింద 1.5 లక్ష ఎకరాలు, నార్త్‌ఫీడర్ కింద 50వేల ఎకరాలు, సౌత్‌ఫీడర్ కింద 50వేల ఎకరాలు, మొత్తం 6.65 లక్షల ఎకరాలు ఉండగా చెరువులు కింద ఆయుకట్టుతో కలిపి 7.5 లక్షల వరకు మొదటి పంట కిందనే సాగవుతోంది. కాలువల ఆధారంగా మెట్ట పంటలు మరో 2లక్షల ఎకరాలతో కలిపి దాదాపు 10లక్షల ఎకరాలు సాగవుతుంది. ఇక కండలేరు పరిధిలో 2.5లక్షల ఎకరాలు వరిపంట సాగువుతోంది. నీళ్లు సక్రమంగా అందితే జిల్లాలో రెండు పంటలకు కలిపి 15లక్షల ఎకరాలకు పైగా ఆయుకట్టు సాగువుతుంది. కానీ సాగునీటి పనులు పూర్తికాక పోవడంతో 5 లక్షల ఎకరాల ఆయకట్టుకు కూడా నీరందే పరిస్థితి లేకుండా పోతోంది.
 

మరిన్ని వార్తలు