కిడారి కారులో రూ.3 కోట్లు? 

2 Oct, 2018 05:29 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్యోదంతం కొత్తమలువు తిరుగుతోంది. ఘటన జరిగిన రోజు కిడారి ప్రయాణిస్తున్న కారులో రూ.3 కోట్ల నగదు ఉన్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. ఈ ఘటన జరిగిన తర్వాత చెలరేగిన హింసాకాండను అదుపుచేయడంలో విఫలమయ్యారంటూ ఇప్పటికే డుంబ్రిగుడ ఎస్సైని సస్పెండ్‌ చేసిన ఉన్నతాధికారులు తాజాగా ఏపీఎస్పీ ఆఫీస్‌ కమాండర్, ఆర్‌ఐలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అరకు సీఐని వీఆర్‌లో పెడుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డుంబ్రిగుడ మండలం లివిటిపుట్టు వద్ద గత నెల 23న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను మావోలు మట్టుబెట్టడం, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు వేగవంతం చేసింది.

సిట్‌ చీఫ్‌ ఫకీరప్ప ఏజెన్సీలోనే మకాం వేసి దర్యాప్తును మమ్మరం చేశారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కర్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోల ఉచ్చులో పడేలా చేసినట్టుగా భావిస్తున్న వారి అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డుంబ్రిగుడ మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ వై.సుబ్బారావుతో పాటు టీడీపీకే చెందిన మాజీ ఎంపీపీ ధనీరావు, కొండబాబు, త్రినాథరావు, ఆంత్రిగూడ గ్రామానికి చెందిన శోభన్, కొర్రా కమల, పాంగి దాసు, లివిటిపుట్టు పరిసర గ్రామాలకు చెందిన 10 మందిని సిట్‌ బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. సుబ్బారావు పాత్ర ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చిన సిట్‌ బృందం మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ఆయన్ని పాడేరు తీసుకెళ్లినట్టు తెలిసింది. మరో వైపు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాంగి రాజారావు, అతని అనుచరగణం ఘటన తర్వాత మన్యంలో కన్పించక పోవడంతో ఈ ఘటనలో వారి హస్తం ఏమైనా ఉందా? అని సిట్‌ బృందం ఆరాతీస్తోంది. 

ఆ మూడు కోట్లు ఏమైనట్టు? 
కిడారి కారులో ఉన్నట్టుగా భావిస్తున్న రూ.3 కోట్లను ఏదైనా సెటిల్‌మెంట్‌ కోసం పట్టుకెళ్తున్నారా? లేక మావోలకు ఇచ్చేందుకు పట్టుకెళ్తున్నారా? అనే విషయాలపై సిట్‌ దర్యాప్తు బృందాలు ఆరా తీస్తున్నాయి. సర్రాయి వద్ద మైనింగ్‌ సెటిల్‌మెంట్‌ కోసం ఆ డబ్బులు పట్టుకెళ్తున్నారన్న మరో వాదన కూడా బలంగా విన్పిస్తోంది. కాగా ఘటన జరిగిన తర్వాత ఆ సొమ్ము కారు నుంచి మాయమైనట్టు సమాచారం.   

మరిన్ని వార్తలు