తుఫాన్‌ మృతులకు రూ.4లక్షల ఎక్స్‌గ్రేషియా

12 Oct, 2018 08:34 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి కళావెంకటరావు. పక్కనే జేసీ చక్రధరభాబు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: తిత్లీ తుఫాన్‌ ప్రభావంతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని రాష్ట్ర విద్యుత్‌శాఖా మంత్రి కళావెంకట్రావు ప్రకటించారు. గురువారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 12 మండలాలు, 196 గ్రామాలపై తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. 1.39 లక్షల హెక్టార్లలో వ్యవసాయ భూమి దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారని పేర్కొన్నారు. 300 కిలోమీటర్ల పైనే రహదారులు దెబ్బతిన్నట్లు గుర్తించినట్లు తెలిపారు.  హుదూద్‌ తర్వాత ఎక్కువగా ఈసారి తుఫాను ప్రభావం జిల్లాపై పడిందని చెప్పారు. 

ఇప్పటికే పునరావాస చర్యలు ప్రారంభించామన్నారు. టెక్కలి డివిజన్‌కు పూర్తిగా కమ్యూనికేషన్‌ దెబ్బతిందన్నారు. పలాస, ఉద్దానం ప్రాంతంలో నష్టం ఎక్కువగా సంభవించిందన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఇతర అధికారులు పూర్తి స్థాయిలో ప్రజలకు సహాయం చేస్తున్నాయని చెప్పారు. అధికారులతో పాటు రాజకీయ పార్టీలు కూడా పునరావాస చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తాగునీరు, నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులో ఉంచామన్నారు. సివిల్‌సప్లయ్‌ విభాగం ద్వారా ఒక్కో కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని తెలిపారు. జిల్లా అంతటా రెండురోజుల్లో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరిస్తామని చెప్పారు. 

శ్రీకాకుళం నగరంలో గురువారం రాత్రికే పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ దొర, సలహాదారు రంగనాథం జిల్లాలో ఉండి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. స్థానికులతో పాటు పక్క జిల్లాల నుంచి రెండు వేల మంది  సిబ్బందిని తీసుకువచ్చామన్నారు. ఈయనతోపాటు జాయింట్‌ కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధరబాబు తదితరులు ఉన్నారు.  

>
మరిన్ని వార్తలు