ఆసియా బ్యాంకు అప్పుతో ఆరగింపు సేవ

1 Oct, 2018 04:05 IST|Sakshi

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఏఐఐబీ నుంచి రూ.4,234 కోట్ల రుణం  

తొలి దశలో రూ.3,575 కోట్ల పనులకు టెండర్లు 

భారీగా కమీషన్లు కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దల ప్లాన్‌ 

అస్మదీయ కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా నిబంధనలు 

అంచనా ఎంతైనా పెంచుకోవచ్చంటూ వెసులుబాటు 

2,440 పనులను 50 ప్యాకేజీలుగా వర్గీకరణ 

టెండర్లు దాఖలు చేసిన 47 మంది కాంట్రాక్టర్లు 

ఖజానాపై రూ.500 కోట్ల అదనపు భారం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పట్టపగలే ‘దారి’ దోపిడీ కొనసాగుతుంది. రూ.వేల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణం పనుల టెండర్లను ప్రభుత్వ పెద్దలు తమకు కావాల్సిన కాంట్రాక్టర్లకే కట్టబెట్టి, అంచనా వ్యయాలు పెంచేసి, భారీ ఎత్తున కమీషన్లు కొల్లగొడుతున్నారు. కేవలం రూ.50 లక్షల విలువైన పనికి కూడా రూ.40 కోట్ల విలువైన రోడ్ల పనులు చేసిన అనుభవం ఉండాలంటూ టెండర్‌ నిబంధనలు విధించడం వెనుక లోగుట్టు ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం పిలిచే టెండర్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే 5 శాతానికి మించి(ఎక్సెస్‌) ధరను కోట్‌ చేసే అవకాశం కాంట్రాక్టర్‌కు ఉండదు. ప్రభుత్వ పెద్దలు స్వలాభం కోసం ఈ నిబంధనను పక్కనపెట్టారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎంతైనా అధికంగా కోట్‌ చేసుకోవచ్చంటూ అస్మదీయ కాంట్రాక్టర్లకు వెసులుబాటు ఇచ్చేశారు. రాష్ట్ర ఖజానాపై రూ.వందల కోట్ల అదనపు భారం మోపుతున్నారు. 

15 నుంచి 30 శాతం ఎక్సెస్‌కు టెండర్లు 
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు(ఏఐఐబీ) నుంచి రూ.4,234 కోట్ల అప్పు తీసుకొస్తోంది. తొలుత రూ.3,575 కోట్ల విలువైన రహదారుల నిర్మాణం పనులకు టెండర్లు పిలిచారు. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన పనులకు సింగిల్‌ టెండర్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం నిర్ధారించిన ధర కంటే ఎంతైనా ఎక్సెస్‌ కోట్‌ చేయొచ్చంటూ వెసులుబాటు కల్పించడంతో కాంట్రాక్టర్లు పండగ చేసుకున్నారు. 15 నుంచి 30 శాతం అధిక ధరలను కోట్‌ చేశారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై దాదాపు రూ.500 కోట్ల అదనపు భారం పడుతోంది. ఈ సొమ్మంతా చివరకు ఎవరి జేబుల్లోకి చేరుతుందో సులభంగా అర్థం చేసుకోవచ్చు. 

ప్యాకేజీల మాయ 
ఒక్కొక్క పనికి వేర్వేరుగా టెండర్లు పిలవాల్సి ఉండగా, ప్రభుత్వ పెద్దలు మాత్రం 200–300 పనులను కలిపి ఒక ప్యాకేజీగా మార్చేశారు. మొత్తం 2,440 పనులను 50 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. శ్రీకాకుళం జిల్లాలో రూ.360 కోట్లతో 493 కిలోమీటర్ల మేర 315 రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. మొత్తం 315 పనులను 4 ప్యాకేజీలుగా వర్గీకరించారు. విజయనగరం జిల్లాలో 156 పనులను 4 ప్యాకేజీలుగా, విశాఖ జిల్లాలో 73 పనులను 3 ప్యాకేజీలుగా, తూర్పు గోదావరి జిల్లాలో 109 పనులను 3 ప్యాకేజీలుగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 57 పనులను 3 ప్యాకేజీలుగా, కృష్ణా జిల్లాలో 58 పనులు 2 ప్యాకేజీలుగా, గుంటూరు జిల్లాలో 71 పనులు 2 ప్యాకేజీలుగా, ప్రకాశం జిల్లాలో 203 పనులను 4 ప్యాకేజీలుగా, నెల్లూరు జిల్లాలో 196 పనులను 3 ప్యాకేజీలుగా, చిత్తూరు జిల్లాలో 585 పనులను 8 ప్యాకేజీలుగా, వైఎస్సార్‌ జిల్లాలో 144 పనులను 3 ప్యాకేజీలుగా, కర్నూలు జిల్లాలో 139 పనులను 5 ప్యాకేజీలుగా, అనంతపురం జిల్లాలో 334 పనులను 6 ప్యాకేజీలుగా విభజించి, టెండర్లు పిలిచారు. ఈ టెండర్లను పది రోజుల క్రితం అధికారులు తెరిచారు. ఇందులో 18 ప్యాకేజీలకు మాత్రమే ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లు పోటీ పడ్డారని, 24 ప్యాకేజీలకు సింగిల్‌ టెండర్లు, 8 ప్యాకేజీలకు అసలు టెండర్లు దాఖలు కాలేదని అధికారులు చెబుతున్నారు. కేవలం ఒక్క ప్యాకేజీ మాత్రమే గరిష్టంగా ఐదు టెండర్లు దాఖలయ్యాయి. మొత్తంగా 47 మంది కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేసినట్లు సమాచారం. ఇప్పటిదాకా కేవలం టెక్నికల్‌ బిడ్‌లను మాత్రమే తెరిచారు. ప్రైస్‌ బిడ్‌లను తెరవాల్సి ఉంది. 

ముందే బహిర్గతం చేసిన ‘సాక్షి’ 
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టడానికి ముందే ఈ దోపిడీ తంతును ‘సాక్షి’ బట్టబయలు చేసింది. ‘అసియా బ్యాంకు అప్పు ఆరగింపునకే’ శీర్షికన ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అయినా అదంతా అబద్ధమని ప్రభుత్వ పెద్దలు బుకాయించారు. అధికారులతో ఖండన ప్రకటనలు ఇప్పించారు. ఈ పనులను ప్యాకేజీలుగా కాకుండా ఒక్కొక్క పనికి వేర్వేరుగా టెండర్లు నిర్వహించాలని కాంట్రాక్టర్లు కోరినా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. 

రూ.63 లక్షల పనిలో రూ.20 లక్షల కమీషన్లు 
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని బంటుపల్లి మండలం నారాయణపురం గ్రామం నుంచి అక్కడికి సమీపంలో ఆర్‌అండ్‌బీ రహదారి వరకు 600 మీటర్ల పొడవున రూ.63 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సాధారణంగా ఈ పని చేయడానికి  పంచాయతీరాజ్‌ శాఖలో కాంట్రాక్టరుగా నమోదు చేసుకున్న వారందరికీ అర ్హత ఉంటుంది. కానీ, ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే కాంట్రాక్టర్‌కు ఒక ఏడాదిలో రూ.40 కోట్ల విలువైన పని చేసిన అనుభవం ఉండాలని ప్రభుత్వం టెండర్‌ నిబంధనల్లో పేర్కొంది. దాంతో కేవలం ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లకే ఈ పని చేసేందుకు అర్హత దక్కింది. ఈ రోడ్డు నిర్మాణం పనికి అర్హత సాధించిన ఇద్దరు ముగ్గురు కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటును ఉపయోగించుకుని 30 శాతం దాకా అధిక ధరను కోట్‌ చేశారు. అంటే రూ.63 లక్షల అంచనా వ్యయాన్ని రూ.80 లక్షల నుంచి 85 లక్షల దాకా పెంచేయనున్నారు. పెంచేసిన అంచనా వ్యయం రూ.20 లక్షలు ముఖ్యనేత, స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కమీషన్లుగా దక్కనున్నాయి.  

మరిన్ని వార్తలు