రహదార్ల మరమ్మతులకు రూ.450 కోట్లు 

3 Dec, 2019 05:42 IST|Sakshi

రహదార్ల రెన్యువల్‌కు మరో రూ.700 కోట్లు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రహదారుల మరమ్మతులకు రూ.450 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్ర రహదారులు (స్టేట్‌ హైవేస్‌), జిల్లా ప్రధాన రహదారుల (ఎండీఆర్‌)పై అన్ని రకాల మరమ్మతులకు కలిపి రూ.625 కోట్లతో రహదారులు, భవనాల శాఖ ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. అయితే రూ.450 కోట్లు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అందులో రాష్ట్ర రహదారులకు రూ.250 కోట్ల, జిల్లా ప్రధాన రహదారులకు రూ.200 కోట్లు కేటాయించారు. ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాల్లో రహదార్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో స్టేట్‌ హైవేస్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీగా ట్రాఫిక్‌ ఉండే పాలకొల్లు–పూలపల్లి, నర్సాపూర్‌–అశ్వారావుపేట, బూర్గంపాడు–అశ్వారావుపేట, మార్టేరు–ప్రక్కిలంక రహదార్లు అధ్వానంగా ఉన్నాయి.

తూర్పుగోదావరిలో సోమేశ్వరం–రాజానగరం, కాట్రేనికోన–చల్లపల్లి, కరప–చింతపల్లి, రాజమండ్రి–చినకొండేపూడి తదితర రహదార్లను వెంటనే మరమ్మతులు చేసేందుకు నిధుల్ని ఖర్చు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోనూ రోడ్లు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో వీటి మరమ్మతులకు, ట్రాఫిక్, జనసాంద్రత ఎక్కువగా ఉండే రహదారులపై గుంతల్ని సరిజేయడానికి నిధుల్ని ఖర్చు చేయనున్నారు. కాగా గతంలో చేసిన జాతీయ రహదార్ల మరమ్మతుల పనులకు సంబంధించి పెండింగ్‌ బిల్లులున్నాయి. వీటికోసం రూ.27 కోట్లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మొత్తం రూ.293 కోట్ల వరకు పెండింగ్‌ బిల్లులుండగా క్లియర్‌ చేసేందుకు ఆర్‌ అండ్‌ బీ అధికారులు కసరత్తు ప్రారంభించారు.  

రహదార్ల రెన్యువల్‌కు రూ.700 కోట్లు 
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో దీర్ఘకాలిక పనితీరు ఆధారిత నిర్వహణ కాంట్రాక్టు కింద రెండు వేల కిలోమీటర్ల రహదారులను బాగు చేయనున్నారు. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులకు ఆదేశాలు జారీఅయ్యాయి. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.700 కోట్లకు అనుమతులొచ్చాయి. సాధారణంగా ప్రతి ఏడాది రహదార్లను రెన్యువల్‌ (దెబ్బతిన్న మేర కొత్తగా లేయర్‌ వేయడం) చేస్తారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా