అన్నీ ఒకరికేనా?!

15 Jul, 2018 11:07 IST|Sakshi

రూ.48 కోట్ల నీరు–చెట్టు పనులు ఒకే కాంట్రాక్టర్‌కు.. 

అధికార పార్టీ ఇన్‌చార్జ్‌పై మండిపడుతున్న ‘తమ్ముళ్లు’ 

8 శాతం కమీషన్‌ తీసుకున్న వైనం 

ఇంకా పనులు ప్రారంభించని కాంట్రాక్టర్‌ 

 చెరువుల కోసం శోధన

సాక్షి ప్రతినిధి, కర్నూలు:  నీరు–చెట్టు పనులను అప్పగించడంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల వ్యవహార శైలి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకే మింగుడు పడటం లేదు. నియోజకవర్గానికి వచ్చిన పనులన్నీ గంపగుత్తగా ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగిస్తున్న తీరుపై మండిపడుతున్నారు. తాజాగా అధికార పార్టీ ముఖ్యనేత సోదరుడి నియోజకవర్గంలో ఏకంగా రూ.48 కోట్ల పనులను ఒకే కాంట్రాక్టర్‌కు అప్పగించారు.  8 శాతం కమీషన్‌ తీసుకుని ఈ పనులను కట్టబెట్టినట్టు సమాచారం. అంటే రూ.48 కోట్ల పనులకు గాను ఏకంగా రూ.3.84 కోట్ల కమీషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కార్యకర్తలు, నాయకులు మండిపడుతున్నారు. పార్టీని, నేతను నమ్ముకుని ఉంటే తమకు మాత్రం పనులు ఇవ్వడం లేదని వారు వాపోతున్నారు. అయితే, ఈ నియోజకవర్గంలో నీరు–చెట్టు పథకం కింద చెక్‌డ్యాంల నిర్మాణ పనులే అధికంగా మంజూరయ్యాయి. దీంతో సదరు కాంట్రాక్టర్‌ ఇంకా పనులు ప్రారంభించలేదని తెలుస్తోంది. చెక్‌డ్యాం పనుల్లో భారీగా ఆదాయం ఉండకపోవడమే ఇందుకు కారణమని సమాచారం.  

కమీషన్‌ ఇంతేనా? 
నీరు–చెట్టు పథకం కింద జిల్లావ్యాప్తంగా భారీగా పనులు మంజూరవుతున్నాయి. ఈ నాలుగేళ్ల కాలంలో రూ.868 కోట్ల పనులు మంజూరయ్యాయి. ఇందులో అధికభాగం నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోనే ఉండడం గమనార్హం. ఈ పనులన్నింటిలోనూ 12 నుంచి 22 శాతం వరకు అధికార పార్టీ నేతలు కమీషన్లు దండుకున్నారు. ఇక్కడ ప్రధానంగా పూడికతీత పనులు కావడంతో భారీగా కమీషన్లు వస్తున్నాయి. అయితే.. ముఖ్యనేత సోదరుడి నియోజకవర్గంలో చెక్‌డ్యాంల నిర్మాణ పనులు మంజూరు కావడంతో అంతగా ఆదాయం ఉండదనేది కాంట్రాక్టర్ల భావన. దీనికితోడు పనులు కచ్చితంగా చేయాల్సి ఉంటుంది. పూడికతీత పనుల్లో ఇందుకు భిన్నం. కొన్నిచోట్ల గతంలో ఉపాధి హామీ కింద చేసిన పనులనే చూపి.. మరికొన్ని చోట్ల నామమాత్రంగా చేపట్టి మొత్తం బిల్లు తీసేసుకుంటున్నారు. దీంతో ఏకంగా 22 శాతం వరకూ కమీషన్లు అక్కడి అధికార పార్టీ నేతలకు ముట్టజెప్పారు. అయితే, తనకు కేవలం 8 శాతం కమీషన్‌ కావడంపై సదరు నేత మదనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో ఎక్కడైనా చిన్న చిన్న చెరువులు ఉన్నాయేమోనని శోధించే పనిలో పడినట్టు తెలుస్తోంది.  

ఎక్కడైనా చెరువులున్నాయా? 
నీరు–చెట్టు కింద నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఆళ్లగడ్డ, నంద్యాల, శ్రీశైలం, నందికొట్కూరు, బనగానపల్లె నియోజకవర్గాల్లో ఎక్కువగా పూడికతీత పనులు చేపట్టారు. ఈ పనులన్నీ సులభతరం కావడంతో కాంట్రాక్టర్లకు అధిక ఆదాయం ఉంటోంది. దీంతో అధికారపార్టీ నేతలకు ఇచ్చే కమీషన్‌ కూడా ఎక్కువగా ఉంటోంది. అదే చెక్‌డ్యాం పనుల్లో తమకు పెద్దగా ఆదాయం ఉండదనేది కాంట్రాక్టర్ల భావన. దీంతో పూడికతీత పనులకే  మొగ్గు చూపుతున్నారు. ముఖ్యనేత సోదరుడు ఇన్‌చార్జ్‌గా ఉన్న నియోజకవర్గంలో మాత్రం చెక్‌డ్యాంల పనులను తీసుకున్న కాంట్రాక్టర్‌ ఇప్పటి వరకు వాటిని ప్రారంభించలేదు. మరోవైపు నియోజకవర్గంలో ఎక్కడైనా చిన్న చిన్న చెరువులు ఉన్నాయేమోనంటూ వెతికే పనిలో పడినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఏవైనా చెరువులు కనిపిస్తే చెక్‌డ్యాంల నిర్మాణం కాకుండా ఈ పనులను చేసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.   

>
మరిన్ని వార్తలు