సరుగుడు తోట దగ్ధం

18 Jul, 2014 00:41 IST|Sakshi
మంటల్లో సరుగుడు తోటలు (అంతరచిత్రం) దిగబడిన అగ్నిమాపక వాహనం

* 50 ఎకరాల్లోని చెట్లు అగ్నికి ఆహుతి
* 40 లక్షల ఆస్తి నష్టం
మలికిపురం : మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామంలోని సముద్ర తీరంలో గురువారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీరంలోని సీసీఎఫ్‌కు చెందిన సుమారు 50 ఎకరాల్లోని సరుగుడు తోట దగ్ధమై రూ.40 లక్షల ఆస్తి నష్టం వాటెల్లింది. బీచ్‌కు వచ్చే ఆకతాయిలు సిగరెట్‌లు పడేయడం వల్ల మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికు లు భావిస్తున్నారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకూ అనగా గంట వ్యవధిలో 50 ఎకరాల్లోని పంట కాలిబూడిదైంది. ప్రమాద స్థలాన్ని తహశీల్దారు బత్తుల ఝాన్సీ పరిశీలించి నష్టాన్ని అంచనా వేశారు.
 
దిగబడిపోయిన అగ్నిమాపక వాహనం

రైతులు తమ భూముల్లోని సరుగుడు పంటను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. కళ్లెదుటే కాలిపోతున్న పంటను చూసి విలవిలలాడిపోయారు. ప్రమాదంపై స్థానిక అగ్నిమాపకశాఖ కేంద్రానికి సమాచారం అందించగా సిబ్బంది సకాలంలో వచ్చారు. అయితే ప్రమాదం స్థలం సమీపంలోనే కొత్తగా వేసిన రోడ్డుపై వాహనం దిగబడిపోయింది. అప్పటికే ఆందోళనలో ఉన్న  రైతులు, సర్పంచ్ ఉల్లూరి గోపాలరావు, మండల  ఉపాధ్యక్షురాలు రాపాక  అరుణ ఆనందకుమార్, ఎంపీటీసీ సభ్యులు ఆచంట నరసింహమూర్తి, సీసీఎఫ్ అధ్యక్షుడు కొంబత్తుల చంద్ర శేఖర్,  డెరైక్టర్లు పారలతో ఇసుక వేసి మంటలను కొంత అదుపు చేశారు.

అగ్ని మాపక వాహనం ఆగిపోవడంతో ఏం చేయాలో తెలియక అయోమయ స్థితిలో పడ్డారు. అయితే అంతకు ముందు సముద్రం నుంచి భారీ కెరటం వచ్చి సమీపంలోని సేలయేరులోకి నీరు చేరడంతో ఆ విషయాన్ని రైతులు అగ్నిమాపక సిబ్బందికి చెప్పారు. దాంతో వారు వాహనంలోని పైపులను సుమారు 200 మీటర్ల మేర వేసి సెలయేరులోని నీటిని మోటార్లుతో తోడి మంటలను ఆర్పారు. అప్పటికే సుమారు 50 ఎకరాల్లోని తోట దగ్ధమైయింది. అరుదుగా తప్ప సాధారణ సమయాల్లో సెలయేరులో నీరు ఉండదని స్థానికులు చెబుతున్నారు.
 
ఆదుకోవాలి
దగ్ధమైన సరుగుడు తోటల రైతులంతా పేదలని..వారిని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ ఉల్లూరి గోపాలరావు, మండల ఉపాధ్యక్షురాలు రాపాక అరుణకుమారి, ఎంపీటీసీలు కోరారు. మూడేళ్లుగా వ్యయప్రయాసలతో సాగుచేస్తున్న సరుగుడు తోటలు కాలిపోవడంతో రైతులకు తీవ్ర నష్టం జరిగిందని, నాలుగేళ్లకోసారి కోతకు వచ్చే సరుగుడు తోట పెంచేందుకు ఎకరానికి రూ.2 లక్షల ఖర్చు అవుతోందని రైతు నాయకులు చెప్పారు. తోటలు మరో ఏడాదిలో చేతి కొచ్చేవని, పంట కోల్పోయిన రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాద రైతులను పరామర్శించారు.

మరిన్ని వార్తలు