బీసీల సంక్షేమానికి రూ. 5వేల కోట్లు

14 Jan, 2014 01:21 IST|Sakshi

కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్ : బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.5 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి బసవరాజు సారయ్య తెలిపారు. స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ కార్పొరేషన్ ద్వారా గతంలో రూ.30 వేలు మాత్రమే సబ్సిడీ ఇచ్చేవారని, ప్రస్తుతం లక్ష రూపాయలకు పెంచామన్నారు. బీసీ కులాల్లో చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారిలో ప్రతి నియోజకవర్గంలో 2వేల మందికి బ్యాంకు లింకేజీ కింద రుణాల కోసం బడ్జెట్ విడుదల చేసినట్లు చెప్పారు.

 రాష్ట్ర వ్యాప్తంగా 2013-14లో 6 లక్షల మంది బీసీలకు ఆర్థిక చేయూతనందిస్తామన్నారు. మండలాల్లో ఎంపీడీఓ, మున్సిపాలిటీల్లో కమిషనర్లు కన్వీనర్లుగా ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. జీవో నెం.101 ప్రకారం ఈ నెల 21వ తేదీ నాటికి రుణాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తయ్యేలా ఆదేశాలు జారీ చేశామని, అయితే గడువు పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 40 వసతి గృహాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. 38 మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న బీసీ సంక్షేమ, సహాయ సంక్షేమాధికారులు, హెచ్‌డబ్ల్యూఓలు, ఇతర మినిస్టీరియల్ ఉద్యోగుల భర్తీ ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తెలిపారు.  

 మంత్రికి బీసీ నేతల స్వాగతం..  మంత్రి బసవరాజు సారయ్య కర్నూలుకు వచ్చిన నేపథ్యంలో పలు బీసీ సంఘాల నాయకులు స్థానిక ప్రభుత్వ అతిథిగృహం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.రాంబాబు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జె.లక్ష్మీనరసింహ, బీసీ కులాల ఐక్యవేదిక కన్వీనర్ టి.శేషఫణి, బీసీ హెచ్‌డబ్ల్యూఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగస్వామి, పాలెగార్ సత్యనారాయణరాజు, విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కె.జోషి తదితరులు స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు