ఆర్నెల్లకే రూ. 6,600 కోట్ల రెవెన్యూ లోటు

8 Oct, 2016 04:58 IST|Sakshi
ఆర్నెల్లకే రూ. 6,600 కోట్ల రెవెన్యూ లోటు

తొలి అర్ధసంవత్సర ఫలితాలపై మంత్రి యనమల సమీక్ష

 సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వానికి గడచిన ఆరు నెలల్లో రూ. 58,912 కోట్ల ఆదాయం రాగా ఖర్చుమాత్రం రూ. 65,315 కోట్లు అయిందని ఆర్థిక మంత్రి యనమల అన్నారు. వార్షిక రెవెన్యూ లోటు రూ.4,868 కోట్లు ఉంటుందని అంచనా వేశామని, అయితే అది ఆర్నెల్లకే రూ.6,641 కోట్లకు చేరుకుందన్నారు. శుక్రవారం సచివాలయంలో రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో తొలి అర్ధ సంవత్సర ఫలితాలను మంత్రి యనమల సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ  ఈ ఏడాది మొత్తం రూ.20,097 కోట్లు అప్పు చేయాలనుకుంటే, అర్ధ సంవత్సరంలోనే అప్పు రూ.13,673 కోట్లకు చేరిందన్నారు.

రాష్ట్రంలో డ్వాక్రా మహిళా గ్రూపులకు ఈ నెలాఖరుకు రెండో విడత పెట్టుబడి నిధి కింద రూ.3 వేల కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. డ్వాక్రా మహిళల ఖాతాల్లో ఈ నిధులు జమ చేస్తామన్నారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా.. అప్పులు చేసి బండి లాగుతున్నామని మంత్రి యనమల అన్నారు.

మరిన్ని వార్తలు