శేషాచలంలో కాల్పుల మోత

21 Jun, 2015 02:32 IST|Sakshi
శేషాచలంలో కాల్పుల మోత

* కూంబింగ్‌లో ఎదురుపడిన కూలీలు
* పోలీసులపై రాళ్లవర్షం, గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు
* అదుపులోకి ఐదుగురు

చంద్రగిరి: చిత్తూరు జిల్లా శేషాచలం అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం మరోసారి కాల్పుల మోత మోగింది. 70 మంది ఎర్రచందనం కూలీలు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. ఐదుగురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సంఘటనకు సంబంధించి వివరాలను ఎస్‌ఐ భాస్కర్ తెలిపారు. చంద్రగిరి మండలంలోని అనంత గుర్రప్పగారిపల్లి దళితవాడ సమీపంలోని అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున సుమారు 30 మంది పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో జెర్రిబండ వద్ద ఎర్రకూలీలు సుమారు 70 మంది సేదదీరుతూ వంట చేసుకోవడాన్ని పోలీసులు గమనించారు. వారిని అదుపులోకి తీసుకోవడానికి మోహరించారు.

పోలీసులను గమనించిన కూలీలు  వారిపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు రెండు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపారు. కూలీలు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో తమిళనాడు ధర్మపురి జిల్లాకు చెందిన రామరాజన్, గోవిందన్, మురుగన్, విమల్, గోవిందన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 12  దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు