ఆర్టీసీలో కేంద్రం పెట్టుబడి రూ.61 కోట్లు

15 May, 2015 02:28 IST|Sakshi
ఆర్టీసీలో కేంద్రం పెట్టుబడి రూ.61 కోట్లు

* యాభై ఐదేళ్లలో పట్టించుకున్న దాఖలాలు శూన్యం
* లాభాలొచ్చినప్పుడు వివరణ కోరిన కేంద్ర ప్రభుత్వం
* నష్టాలపై నోరు మెదపని తీరు
* ఎయిర్‌ఇండియాకు బెయిలౌట్ ప్యాకేజీ  తరహాలో ఆర్టీసీని ఆదుకోవాలని కేంద్రానికి లేఖ

 
 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీని ఆదుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరనుంది. ఈ మేరకు లేఖ రాయలని భావిస్తోంది. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా ఉంది. గతంలో లాభాల్లో వాటా కోరిన కేంద్రం.. నష్టాలొచ్చినప్పుడు మాత్రం మొహం చాటేసింది. ఈ విషయమై పాత లెక్కలు తీసే పనిలో పడింది రాష్ట్ర ప్రభుత్వం. తీవ్ర నష్టాల్లో మునిగిన ఎయిర్ ఎండియాను కేంద్రం బెయిలౌట్ ప్యాకేజీ రూ.30 వేల కోట్లు అందించి ఆదుకుంది. కానీ దాదాపు రూ.4 వేల కోట్లకుపైగా అప్పుల్లో కూరుకుపోయి దివాలా దిశగా సాగుతున్న మన రోడ్డు రవాణా సంస్థకు కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. ఎయిర్ ఇండియాకు- మన ఆర్టీసీకి పొంతన ఏంటనుకుంటున్నారా..? ఈ రెండు సంస్థలు కూడా కేంద్రప్రభుత్వ చట్టాల ప్రకారం ఏర్పడ్డవే. ఏపీఎస్ ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఉంది.
 
  కేంద్రప్రభుత్వ చట్టాల ప్రకారం ఏర్పాటు కావటంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్రప్రభుత్వం ఇందులో పెట్టుబడులు పెట్టాయి. కేంద్రం రూ.61.07 కోట్లు, రాష్ట్రప్రభుత్వం రూ.133.19 కోట్లు పెట్టుబడిగా సమర్పించాయి. వెరసి రూ.194.26 కోట్లతో సంస్థ ఆవిర్భవించింది. అంతే.. ఆ తర్వాత ఇప్పటివరకు అటు కేంద్రం గాని, ఇటు రాష్ట్రం ప్రభుత్వం గాని మళ్లీ ఆర్టీసీలో పెట్టుబడి పెట్టలేదు. లాభాలు లక్ష్యంగా కాకుండా ప్రజాసేవ ప్రధానోద్దేశంగా ఏర్పడే ప్రజారవాణా సంస్థలు నష్టాలపాలు కావటం సహజం. ఇలాంటి తరుణంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆదుకోవాలి. కానీ ఆర్టీసీ విషయంలో ఇది జరగలేదు. తాజాగా ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. కేంద్ర సాయం రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
 
 లాభాలపై దృష్టి...
 రెండు దశాబ్దాల క్రితం ఆర్టీసీకి పుష్కలంగా లాభాలొచ్చాయి. ఈ తరుణంలో కేంద్రప్రభుత్వం పెట్టుబడి సంస్థగా తనవంతు వాటాను కోరింది. ప్రయాణికులకు వసతులు కల్పించే ఉద్దేశంతో ఆ లాభాలను ఆర్టీసీ బస్‌స్టాండ్ల నిర్మాణానికి వినియోగించింది. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చింది. 2007-08, 2008-09 సంవత్సరాల్లో ఎంవీ ట్యాక్స్ తగ్గించిన ఫలితంగా మళ్లీ ఆర్టీసీ లెక్కల్లో లాభాలు నమోదయ్యాయి. మిగిలిన కాలమంతా నష్టాలే. కానీ కేంద్రప్రభుత్వం నోరు మెదపటం లేదు. సంస్థ మనుగడ కష్టంగా మారటంతో ఆర్టీసీ యాజమాన్యం బ్యాంకులు, ఎల్‌ఐసీ నుంచి రూ.4 వేల కోట్ల అప్పులు తెచ్చి నెట్టుకొస్తోంది. అడపాదడపా కొత్త బస్సులు కొనేందుకు రాష్ట్రప్రభుత్వం లోన్లు, గ్రాంట్లు ఇవ్వటం మినహా పెట్టుబడి సంస్థలుగా ఈ రెండు ప్రభుత్వాల నుంచి ఆర్టీసీకి సాయం శూన్యం.
 
  కేవలం 33 వేల మంది ఉద్యోగులున్న ఎయిర్ ఇండియాను ఆదుకునేందుకు బెయిలౌట్ ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం 1.20 ల క్షల మంది కార్మికులున్న ఆర్టీసీ విషయాన్ని పట్టించుకోలేదు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించేందుకు రూ.5 వేల కోట్ల సాయం చేస్తున్న తరహాలోనే ఆర్టీసీని కూడా ఆదుకోవాలంటూ పూర్తి వివరాలతో త్వరలో కేంద్రానికి లేఖ రాయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు పాత లెక్కలు తీస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు