రాష్ట్ర ప్రజలపై రూ.682 కోట్ల భారం

1 Sep, 2013 03:13 IST|Sakshi
రాష్ట్ర ప్రజలపై రూ.682 కోట్ల భారం

సాక్షి, హైదరాబాద్: ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరోసారి పెట్రోబాంబ్ పేల్చాయి. శనివారం అర్ధరాత్రి నుంచి లీటరు పెట్రోలుపై రూ. 2.35, లీటరు డీజిల్‌పై 50పైసలు చొప్పున ధర పెంచాయి. దీనివల్ల రాష్ట్రంలోని వాహన యజమానులపై ఏడాదికి సగటున రూ.682.52 కోట్ల అదనపు భారం పడనుంది.  రాష్ట్రంలో ఏడాదికి సగటున 150 కోట్ల లీటర్ల పెట్రోలును వాహనదారులు వినియోగిస్తున్నారు.
 
లీటరు పెట్రోలు ధర రూ. 2.35 లెక్కన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచడంవల్ల రాష్ట్ర ప్రజలపై ఏటా రూ. 352.52 కోట్ల అదనపు భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన ధరలతో అల్లాడిపోతున్న అల్పాదాయ వర్గాలు, వేతన జీవులకు ఇది పెనుభారమని చెప్పక తప్పదు. రాష్ట్రంలో ద్విచక్ర వాహనాలు వినియోగిస్తున్న 90 లక్షల మందితోపాటు పెట్రోలు వినియోగించే నాలుగు చక్రాల వాహనాల వారిపై కూడా ఈ భారం పడుతుంది. అలాగే రాష్ట్రంలో ఏడాదికి సగటున 660 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగమవుతోంది. లీటరుకు అర్ధరూపాయి పెరిగినందున వాహనదారులపై ఏటా రూ.330 కోట్ల అదనపు భారం పడనుంది. రాష్ట్రంలో పెట్రోలుపై 31 శాతం, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్ ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వానికి కాసుల పంట పండుతోంది. పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా వ్యాట్ రూపేణా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ. 8,000 కోట్ల వరకూ రాబడి వస్తోంది. తాజా పెంపుతో ఏడాదికి సగటున పెట్రోలు ద్వారా రూ.109.27 కోట్లు, డీజిల్ ద్వారా రూ. 73.42 కోట్ల అదనపు రాబడి ప్రభుత్వానికి రానుంది.
 
 అన్ని వర్గాలపై భారం: డీజిల్ ధరల పెంపు ప్రభావం రైతులతోపాటు అన్ని వర్గాలపై పడుతుంది. ఇప్పటికే వరి దుక్కి దున్నేందుకు (దమ్ముకు) ట్రాక్టరు యజమానులు గంటకు రూ.800 చొప్పున బాడుగ తీసుకుంటున్నారు. ప్రతి 15 రోజులకూ డీజిల్ ధర పెరుగుతున్నందున గిట్టుబాటు కావడంలేదంటూ రేట్లు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ఇది అసలే వరి సాగు గిట్టుబాటుకాని రైతులకు మరింత భారమని చెప్పక తప్పదు. డీజిల్ ధర పెరగడంవల్ల సరుకుల రవాణా కూడా భారం కానుంది. దీనివల్ల నిత్యావసర సరుకులతోపాటు అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది.
 
  డీజిల్ ధర పెంపు ఆర్టీసీ, రైల్వేలకు కూడా భారమే. దీనివల్ల ఆర్టీసీ, రైలు ఛార్జీలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. ‘రూపాయి విలువ పడిపోయి డాలర్ బలపడటంవల్ల అంతర్జాతీయ విపణిలో క్రూడ్‌కు మన దేశం ఎక్కువ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రజల ప్రమేయం లేకపోయినా ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు తరచూ పెంచుతూ అల్పాదాయ వర్గాలపై మోయలేని భారం మోపడం ఏమాత్రం సమంజసం కాద’ని ఆర్థిక వేత్తలు అంటున్నారు. పెట్రో ధరల పెంపుపై వాహనచోదకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు