తుపాకీతో బెదిరించి రూ.82 లక్షల దోపిడీ

15 May, 2015 03:44 IST|Sakshi

ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద నిందితులను పట్టుకున్న పోలీసులు
నిందితుల్లో ముగ్గురు ప్రకాశం జిల్లా ఏఆర్ కానిస్టేబుళ్లు?
బాధితులు కావలికి చెందిన బంగారు వ్యాపారులు

 
 కావలి :  నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో కావలి నుంచి నెల్లూరుకు వెళుతున్న పట్టణానికి చెందిన బంగారు వ్యాపారులను తుపాకీతో బెదిరించి గురువారం రూ.82 లక్షలు దోచుకున్న ముగ్గురు నిందితులను పోలీసులు ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పీసీపల్లి వద్ద పట్టుకున్నట్లు తెలిసింది. వారు ముగ్గురు కానిస్టేబుళ్లుగా అనుమానిస్తున్నారు. మరో వ్యక్తి పారిపోగా అతను స్టువర్ట్‌పురం వాసిగా తెలుస్తోంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని బంగారు వ్యాపారులు వేమూరి రాములు, బి.సునీల్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో కావలి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరారు.

వారి వద్ద సుమారు రూ.82 లక్షల నగదు ఉంది. వారి వద్దకు ముగ్గురు వ్యక్తులు వచ్చి తాము పోలీసులమని తుపాకిని చూపి బెదిరించారు. మీమీద అనుమానంగా ఉందని వ్యాపారులకు చెప్పి తమ వెంట కావలి డీఎస్పీ కార్యాలయానికి రావాలని చెప్పారు. పడుగుపాడు సమీపంలో నవజీవన్ రైలు నెమ్మదిగా వెళ్తుండగా వారు ఇద్దరు వ్యాపారులను దించారు. వారిని అక్కడ నుంచి ఆత్మకూరు బస్‌స్టాండ్‌కు తీసుకొచ్చి, అక్కడ నుంచి అంబాసిడర్ కారును బాడుగకు తీసుకుని  కావలి వైపుకు బయలు దేరారు.

దగదర్తి మండలం దామవరం సమీపంలో వ్యాపారులిద్దరినీ దించి వేసి, ఆ కారులో నేరుగా ప్రకాశం జిల్లా గుడ్లూరుకు వెళ్లారు. అంబాసిడర్ కారు డ్రైవర్ మల్లికార్జున తాను ఇక్కడి నుంచి రాను అనే సరికి వారు ఆ కారుని దిగారు. ఆ సమయంలో గుడ్లూరు బస్టాండువద్ద ఉన్న ఓ సుమో ఉండగా దానిపై ఉన్న నంబర్‌ను చూసి డ్రైవర్‌కు ఫోన్ చేయగా అతను ఎత్తలేదు. దీంతో గుడ్లూరు బస్‌స్టాండ్‌కు వెళ్లి బస్సులో కందుకూరుకు వెళ్లారు.

కందుకూరు నుంచి తాము సీఎం బందోబస్తుకు వెళ్లాలంటూ ఓ ఇండికా కారు డ్రైవర్ మీరావలికి చెప్పి ఆ కారులో వారు కందుకూరు నుంచి కనిగిరికి వైపుకు వెళ్లారు. ఈ క్రమంలో దోపిడీకి గురైన వ్యాపారులు కావలి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఒకటో పట్టణ సీఐ వెంకట్రావు, ఇతర పోలీసులు బలగాలు జాతీయ రహదారి వెంట గాలింపు చేపట్టాయి. ప్రకాశం జిల్లా చేవూరు పోలీస్ చెక్‌పోస్టు వద్ద నిందితులు ప్రయాణించిన అంబాసిడర్ కారు కనిపించడంతో దానిని పోలీసులు ఆపారు.

డ్రైవరు మల్లికార్జునను అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందుతుల వివరాలను తెలుసుకున్నారు. వెంటనే గుడ్లూరు, కందుకూరు, కనిగిరి మండలా ల్లో గాలింపు చర్యలు చేపట్టారు, కనిగిరి మండలం పీసీ పల్లి వద్ద వారుకారులో ప్రయాణిస్తుండగా అదుపులోకి తీసుకోవాలని ప్రయత్నించగా ఓ వ్యక్తి పరారయ్యాడు. ముగ్గురుని పోలీసులు అదుపులోకి  తీసుకున్నట్లు తెలుస్తోంది.

ముగ్గురిలో వెంకటసుబ్బయ్య, నాగరాజు ఒంగోలు కానిస్టేబుళ్లుగా, రవి అనే వ్యక్తి చీరాల కానిస్టేబుల్‌గా అనుమానిస్తున్నారు. పారిపోయిన వ్యక్తి స్టువర్ట్‌పురానికి చెందిన వాడిగా తెలుస్తోంది. రూ.82 లక్షల నగదులో సుమారు రూ.3వేల వరకు వారు ఖర్చుపెట్టినట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కందుకూరు డీఎస్పీ కార్యాలయానికి, అక్కడ నుంచి కావలికి తరలించినట్లు తెలిసింది.

 ఎస్పీ, డీఎస్పీతో మాట్లాడిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి
 బంగారు వ్యాపారులు దోపిడీకి గురయ్యానే విషయాన్ని వైఎస్సార్‌సీపీ మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ కనమర్లపూడి వెంకటనారాయణ, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు చీదెళ్ల కిషోర్‌గుప్తా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి ఫోన్‌లో తెలిపారు. ఢిల్లీలో ఉన్న ఎమ్మెల్యే విషయం తెలిసిన వెంటనే నిందితులను వెంటనే పట్టుకోవాలని ఎస్పీ, డీఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. నిందితులను పట్టుకున్నారని తెలియడంతో పోలీసులకు అభినందనలు తెలిపారు.

 ఎస్పీ ఎదుట నిందితుల హాజరు?
 నెల్లూరు(క్రైమ్): కావలికి చెందిన బంగారు వ్యాపారులు సునీల్, రామయ్యను దోపిడీ ఘటనలో నిందితులను గురువారం రాత్రి పోలీసులు ఎస్పీ  డాక్టర్ గజరావుభూపాల్ ఎదుట హాజరుపరిచిన ట్లు సమాచారం. అనంతరం నిందితులను రహస్యప్రదేశానికి తరలించి విచారణ చేపట్టినట్లు తెలిసింది.  మీడియా ప్రతినిధులకు నిందితులను చూపిం చేందుకు పోలీసు అధికారులు నిరాకరిం చారు. కేసును ఛేదించిన పోలీసులను ఎస్పీ అభినందించినట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు