విశాఖ మెట్రో రైలుకు రూ.9,750 కోట్లు

13 Feb, 2015 04:23 IST|Sakshi
విశాఖ మెట్రో రైలుకు రూ.9,750 కోట్లు

సాక్షి, హైదరాబాద్: విశాఖపట్టణంలో 39 కిలోమీటర్ల మేర, విజయవాడలో 25 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెట్రో రైలుకు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేసే బాధ్యతలను ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అప్పగించిన విషయం తెలిసిందే. మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్ తయారీ తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు గురువారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

కిలోమీటరుకు రూ.250 కోట్ల వంతున విశాఖ మెట్రోకి రూ.9,750 కోట్లు, విజయవాడ మెట్రోకి రూ.6,250 కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. విజయవాడలో తొలిదశలో 13 కిలోమీటర్లు, మలిదశలో 12 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనున్నట్లు సీఎస్ వివరించారు. మార్చి నెలాఖరులోగా డీపీఆర్‌ను సమర్పించాలని ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులను కోరారు. డీపీఆర్ రాగానే నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గిరిధర్‌ను ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వం మెట్రో రైలు నిర్మాణాలకు నిధులు ఇస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చినందున వీలైనంత త్వరగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించి కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు జరిగేలాగ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే శిల్పారామం, పర్యాటక కేంద్రాల అంశాలు, కార్మిక చట్టాలపై సీఎస్ అధికారులతో సమీక్షించారు. కార్మిక చట్టాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సవరించాలని నిర్ణయించారు.
 

మరిన్ని వార్తలు