రూ.9 లక్షల పట్టివేత

20 Mar, 2014 03:28 IST|Sakshi

పాచిపెంట, న్యూస్‌లైన్ :  ఎన్నికల నేపథ్యంలో పి.కోనవలస ఆంధ్ర-ఒడిశా సరిహద్దు చెక్‌పోస్టు వద్ద బుధవారం ఉదయం తనిఖీ చేస్తున్న పోలీసులకు.. భారీ మొత్తంలో నగదు లభ్యమైంది. ఒడిశా నుంచి వస్తున్న వాహనంలో రూ.9 లక్షలకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న సాలూరు సీఐ జి.దేముళ్లు పాచిపెంట పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. డబ్బు తరలిస్తున్న వ్యక్తుల నుంచి వివరాలు సేకరించారు.

అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ పాసింజర్ వాహనాన్ని తనిఖీ చేస్తుండగా నలుపు రంగు బ్యాగులో రూ.9 లక్షలకుపైగా నగదు లభ్యమైందని చెప్పారు. ఒడిశాలోని సుంకి గ్రామానికి చెందిన అభిషేక్ కుమార్, నిర్మల్ యాదవ్ ఈ మొత్తాన్ని తరలిస్తున్నారని తెలిపారు. వారిని ప్రశ్నించగా.. మద్యం బేవరేజెస్ కంపెనీకి తీసుకెళ్తున్నట్లు చెప్పారని తెలిపారు. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలను చూపలేకపోయారని చెప్పారు. సరిపడా ఆధారాలు చూపిస్తే.. ఎన్నికల తర్వాత ఆ మొత్తాన్ని వారికి అప్పగిస్తామని చెప్పారు. మూడురోజులుగా బ్యాంకు సెలవు కావడంతో రాయగడలో గల బ్రాందీ విక్రయ కేంద్రానికి నేరుగా నగదు తీసుకెళ్లాల్సి వచ్చిందని బాధితులు చెబుతున్నారు.

 ఇదిలా ఉండగా.. స్వాధీనం చేసుకున్న నగదును స్థానిక తహశీల్దార్ ఎల్లారావుకు అప్పగించినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాచిపెంట ఎస్సై రవికుమార్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు