ఆర్టీసీ విభజనకు ఆమోదం

16 May, 2014 00:07 IST|Sakshi
ఆర్టీసీ విభజనకు ఆమోదం

- హైదరాబాద్‌లోని ఆస్తుల పంపిణీపై పాలకమండలి చర్చ
- కార్మిక సంఘాల అభిప్రాయాలను
- ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం
- అక్కడి నుంచి వచ్చే సూచనల ఆధారంగా చర్యలు
- కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు పచ్చజెండా

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్  రాష్ర్ట రోడ్డు రవాణా సంస్థ(ఎపీఎస్‌ఆర్టీసీ)ను రెండుగా విభిజించేందుకు ఆర్టీసీ పాలకమండలి ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉమ్మడిగా ఉన్న ఈ సంస్థను ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ(ఏపీఎస్ ఆర్టీసీ), తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ ఆర్టీసీ)గా విభజిస్తూ ఆర్టీసీ విభజన కమిటీ చేసిన ప్రతిపాదనకు గురువారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఆమోదముద్ర పడింది. ఈ మేరకు విభజన నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అధికారులు పంపారు. అక్కడి నుంచి అది గవర్నర్ కార్యాలయానికి చేరుతుంది. విభజన నేపథ్యంలో ఏ ప్రాంతంలోని ఆస్తులను ఆ ప్రాంతానికే కేటాయించే విషయంలో ఎలాంటి అభ్యంతరాలు రాకున్నా, ఉమ్మడి రాజధానిగా ఉంటున్న హైదరాబాద్, దాని శివారులోని ఆర్టీసీ ఆస్తుల పంపకం విషయంలో వ్యక్తమైన భిన్నాభిప్రాయాలపై పాలక మండలి చర్చించింది.

ఉమ్మడి రాష్ట్రంలోని ఆదాయం ద్వారా ఏర్పాటైన ఆస్తుల్లో జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తి ప్రకారం రెండు రాష్ట్రాలకు వాటా కల్పించే అంశంపై తెలంగాణ ప్రాంత కార్మిక సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు తమకు వాటా ఉండాల్సిందేనని సీమాంధ్ర ప్రాంత కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బోర్డు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని తీర్మానించింది.

ప్రభుత్వం సూచనల మేరకు నడుచుకోవాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ప్రధాన పరిపాలనా భవనం, ఆర్టీసీ ఆసుపత్రి, కల్యాణమండపం, ప్రింటింగ్ ప్రెస్, బస్ బాడీ కేంద్రం తదితరాలను సీమాంధ్ర ప్రభుత్వం తన సొంత ఖర్చుతో నిర్మించి ఆర్టీసీకి అందజేసిన పక్షంలో హైదరాబాద్‌లోని ఆస్తుల్లో వాటా అవసరం లేదంటూ సీమాంధ్ర సిబ్బంది పేర్కొన్న విషయాన్ని ప్రభుత్వం ముందుంచాలని బోర్డు నిర్ణయించింది. కాగా, తెలంగాణ రాష్ర్ట ఆర్టీసీకి ప్రత్యేక పాలకమండలి ఏర్పాటుకానుంది. ఉమ్మడి రాష్ట్రంలో కార్మికులకు అందాల్సిన బకాయిలన్నింటినీ ఈ నెలాఖరులోపు చెల్లించాలని కార్మిక సంఘాల పక్షాన గుర్తింపు యూనియన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ పాలకమండలి సభ్యుడు పద్మాకర్ పేర్కొన్నారు. దీనికి బోర్డు సానుకూలంగా స్పందించింది.

గత ఏడాది ఆర్టీసీ కార్మిక సంఘాలతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంలో భాగంగా మిగిలిన 1792 మంది కండక్టర్లు, 1655 మంది కాంట్రాక్టు డ్రైవర్ల సర్వీసుల క్రమబద్ధీకరణకు కూడా పాలకమండలి పచ్చజెండా ఊపింది. ఈ ప్రక్రియ వచ్చే సెప్టెంబరులో పూర్తికానుంది. తొలి విడతలో క్రమబద్ధీకరణ పొందిన వారికి చెల్లించాల్సిన దాదాపు రూ. 13 కోట్ల వేతన బకాయిల చెల్లింపునకూ బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి, ఆర్టీసీ చైర్మన్ లేనందున ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పాలక మండలి భేటీ జరిగింది.

మరిన్ని వార్తలు