గన్నవరంలో ఆర్టీసీ బస్‌భవన్!

19 Sep, 2014 04:21 IST|Sakshi
గన్నవరంలో ఆర్టీసీ బస్‌భవన్!

విద్యాధరపురం డిపో వద్ద ఆస్పత్రి

సాక్షి విజయవాడ బ్యూరో: ఆర్టీసీ విభజన తర్వాత సంస్థ ప్రధాన కార్యాలయూన్ని(బస్‌భవన్) కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్మించాలని యాజమాన్యం భావిస్తోంది. తగినంత భూమితోపాటు విజయవాడకు చేరువలో ఉండటం, జాతీయ రహదారి పక్కగా ఉన్నందున బస్ భవన్ నిర్మాణానికి ఇదే మంచి స్థలమనే ఉద్దేశంతో ఉంది. గతంలో కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో 28.5 ఎకరాల్లో  ట్రాన్స్ పోర్టు అకాడమి ఏర్పాటు చేశారు. ఇందులో ఆర్‌ఎంలు, డీవీఎంలు, డీఎంలు ఇతర అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వీరి వసతి కోసం భవనాలు కూడా నిర్మించారు.
 
అనంతరం ఆర్టీసీ వ్యవహారాలన్నీ హైదరాబాద్ నుంచే నడవడంతో అకాడమీని అక్కడికి తరలించారు. స్థలం కబ్జాదారుల బారిన పడకుండా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు జోనల్ కేంద్రాన్ని నెలకొల్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ అత్యాధునిక పరిజ్ఞానంతో డ్రైవర్లకు టెస్ట్ ట్రాక్ నిర్మించారు. ఇలాంటి ట్రాక్ ప్రస్తుతం గన్నవరంలో మాత్రమే ఉండగా కర్నూలులో మరొకటి నిర్మించాలని భావిస్తున్నారు. సిబ్బంది శిక్షణ భవనాలు, పరిపాలనా భవనాలు, వసతి సముదాయాలు పోనూ ఈ ప్రాంగణంలో 10 ఎకరాల ఖాళీ స్థలం అందుబాటులో ఉంది.
 
ఆర్టీసీ ప్రధాన కార్యాలయూన్ని ఇక్కడ నిర్మించటం మంచిదని భావిస్తున్నారు. విజయవాడకి 15 కి.మీ. లోపే ఈ స్థలం ఉండటం బస్ భవన్ నిర్మాణానికి అనుకూలించే అంశాలు కానున్నాయి. ఇటీవల ఈ స్థలాన్ని పరిశీలించిన ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు బస్ భవన్ ఏర్పాటుకు అనువుగా ఉందనే అభిప్రాయూనికి వచ్చినట్లు చెబుతున్నారు. విజయవాడలోని విద్యాధరపురం డిపో స్థలంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఆసుపత్రి నిర్మించాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.

మరిన్ని వార్తలు