ఆర్టీసీకి మొరాయింపు

16 Dec, 2013 04:03 IST|Sakshi
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్:‘సురక్షిత ప్రయాణమే మా లక్ష్యం’ ఈ నినాదం ఆర్టీసీది అని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఈ నినాదం ప్రయాణికుల కు భరోసా కల్పించడం లేదు. ఆర్టీసీ నడుపుతున్న బస్సులు ఎక్కడికక్కడే మొరాయిస్తూ నినాదానికి విరుద్ధంగా ప్రజల్లో అపనమ్మకం, అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు మొరాయిస్తున్న బస్సులనే  ఆర్టీసీ రోడ్లపైకి పంపిస్తూ ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఇవేమి సేవలని ప్రశ్నిస్తే..ఈ బస్సులు సంస్థవి కావు. అద్దెబస్సులు. మేమేం చేయగలం. మాకు సంబం ధం లేదంటూ ఆర్టీసీ సిబ్బంది తప్పించుకుంటున్నారు. సాక్షాత్తు రాష్ర్ట రవాణా శాఖమంత్రి బొత్స సత్యనారాయణ సొంత జిల్లాలోనే ఆర్టీసీ బస్సు పనితీరు దయనీయంగా ఉందంటే  ఇక రాష్ర్టవ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులు ఎలా ఉంటాయో  అర్థం చేసుకోవచ్చు. 
 
 కండిషన్‌లో లేని బస్సులే..
 గడిచిన రెండురోజుల సర్వీసుల్లో విజయనగ రం పట్టణ పరిధిలో ఐదు బస్సులు వివిధ కారణాలతో మధ్యలోనే ఆగిపోయి ప్రయాణికులను ఇబ్బంది పెట్టాయి. విశాఖ నుంచి పార్వతీపురం వెళ్లే బస్సు విజయనగరంలోని ఆర్‌అండ్‌బీ జంక్షన్ సమీపాన ఆగిపోయింది. అదే సమయంలో విజయనగరం నుంచి సాలూరు వెళ్లే మరో బస్సుదీ అదే పరిస్థితి. అయితే ఆగిన బస్సులన్నీ అద్దెబస్సులే కావడం విశేషం. ఆర్టీసీ బస్సులయితే ప్రతిరోజూ కండిషన్  పరీక్ష ఉంటుంది. అదే అద్దెబస్సుల కైతే నెల రోజుల కోసారి గానీ పరీక్ష చేయరు. ప్రయాణికులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా సరే కండిషన్ లో లేని బస్సులే ప్రతి రోజూ జిల్లా నలుమూలలా నడుస్తున్నాయి. 
 
 పెరుగుతున్న అద్దె బస్సుల భారం
 జిల్లాలోని నాలుగు డిపోల పరిధిలోని 418 బస్సుల్లో విజయనగరం-54, సాలూరు-42, పార్వతీపురం-34, ఎస్.కోట-5 బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. నెలలో అవి తిరిగిన 43.49 లక్షల కిలోమీటర్లకు రూ.5.79 కోట్ల లావాదేవీలు జరగాల్సి ఉంది. అయితే అద్దె బస్సు తిరిగే అన్ని సర్వీసులూ నష్టాల్లోనే ఉన్నాయి. ఎందుకంటే అవి ఎక్కడికక్కడ ఆగిపోతుండడమేనని తెలుస్తోంది. పల్లెవెలుగు సర్వీసులకు కనీసం రూ.3,600 తగ్గకుండా, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు కిలోమీటర్ ఒక్కింటికి రూ.11.50 వం తున అద్దెచెల్లించే ప్రాతిపదిక సంస్థలో నడుస్తోంది. ప్రస్తుతం జిల్లాలో తిరుగుతున్న ప్రతి అద్దెబస్సుకు చెల్లించిన అద్దె కంటే ఆ సర్వీసు నుంచి వసూలవుతున్న రెవెన్యూ తక్కువగా ఉంటోంది. ప్రతి కిలోమీటర్‌కు 81పైసల వంతున నష్టం వస్తోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అద్దెబస్సు సర్వీసులు..సంస్థ ఆదాయానికి ఉపయోగపడడం లేదు కానీ వాటిని పోషించడానికి మాత్రం సంస్థ బాగానే వినియోగపడుతోందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ డొక్కు బస్సులు  ఏం చేస్తున్నాయంటే నాణ్యత లేని సేవలందించే సంస్థగా ప్రయాణికులకు అపనమ్మకం, అభద్రత భావాలను కలిగిస్తున్నాయి.   
 
 అప్పనంగా చెల్లింపులు
 జిల్లాలో 135 అద్దెబస్సులు నెలలో సుమారు 18 లక్ష ల కిలోమీటర్లు తిరుగుతున్నాయి. కిలోమీటరుకు 81 పైసల వంతున 18 లక్షల కిలోమీటర్లకు సుమారు రూ.14లక్షలు అద్దెబస్సులకు సంస్థ అప్పనంగా చెల్లిస్తుంది. దీనికితోడు ఆదాయంలేని అద్దెబస్సుల సర్వీసుల్లో పనిచేస్తున్న కండక్టర్ జీతాలనూ సంస్థే చెల్లిస్తోంది. ప్రతి అద్దెబస్సుకు కనీసం ముగ్గురు కండక్టర్ల వంతున జీతాల రూపంలో సుమారు రూ.ఎనిమిది లక్షలు చెల్లిస్తోంది. వెరసి సంస్థ సుమారు రూ.25 లక్షల వరకు ఉత్తపుణ్యాన అద్దెబస్సులకు చెల్లిస్తోంది.
 
 ఇష్టానుసారం రద్దు
 రోడ్డు మీదకు వెళ్లే బస్సుల్లో అధికభాగం  అద్దె బస్సు లే ఉంటున్నాయి. అయితే అద్దెబస్సుల యాజమాన్యాలు తమ ట్రిప్పులను ఇష్టానుసారం రద్దు చేసుకు ని సంస్థకు ఇబ్బందులు తెస్తున్నాయి. వాస్తవానికి సంస్థతో ఒప్పందం ప్రకారం నెలకు రెండుసార్లు సర్వీసులను రద్దు చేసుకోవచ్చు. ఆ సమయంలో ప్రత్యామ్నాయ బస్సులను సంస్థ ఏర్పాటు  చేసుకోవాల్సి ఉంది.  అయినా ఈ పద్ధతి అమలు కావడం లేదు. అసలు ఆదాయంలేని అద్దెబస్సుల ప్రాతిపదిక విధానాన్ని సంస్థ రద్దు చేయాలని వివిధ కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. అయినా సంస్థకు ఇదేమీ పట్టడం లేదు. 
 
 
మరిన్ని వార్తలు