‘వాటిది’ ఒకటే తీరు..!

26 Jun, 2018 13:25 IST|Sakshi
అగనంపూడి టోల్‌గేట్‌

టోల్‌ ఫీజు వసూళ్లు, చెల్లించిన పన్ను ఎంతో చెప్పడానికి ఆర్టీసీ నిరాకరణ

అప్పు, ఈఎంఐ, రుణం చెల్లించిన వాయిదాల వివరాల బహిర్గతానికి ఎన్‌హెచ్‌ఏఐ,

ఆర్‌ అండ్‌ బీ సంస్థలూ ససేమిరా ఆర్టీఐని అపహాస్యం చేస్తున్న సంస్థలపై నిరసన

అగనంపూడి(గాజువాక): సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయి. ఆర్టీఐ ద్వారా అడిగిన వివరాలను చెప్పాల్సిన బాధ్యత సంస్థలు, అధికారులపై ఉన్నా.. అందుకు నిరాకరిస్తున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీఐ కమిషనర్‌ను నాలుగేళ్ల  నుంచి నియమించకపోవడంతో వివరాలు నిరాకరించిన సంస్థలు, వ్యక్తులపై చర్యలు తీసుకొనే హక్కు ఎవరికీ లేకపోవడంతో సంస్థలు, సంబంధిత అధికారులు పెడచెవిన పెడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ, వాటికి మద్దతు తెలిపే సమాచార వ్యవస్థలు విశేషమై ప్రచారాన్ని చేపట్టాయి. 2జీ స్కామ్, బొగ్గు స్కామ్‌లు వంటివి ఈ చట్టం ద్వారానే బయటపడ్డాయి. అలాంటి చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రకు రాష్ట్ర ప్రభుత్వం తెరదీసిందని సమాచార హక్కు చట్టం ఉద్యమకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజాసంఘాల ఆందోళన..
మహా విశాఖ పరిధిలో టోల్‌ గేట్‌ కొనసాగించడం చట్ట విరుద్ధమని, వ్యయం కంటే నాలుగు రెట్లు అధికంగా ప్రజల జేబుల నుంచి ఫీజు రూపంలో లాక్కున్న నేపథ్యంలో టోల్‌గేటును తొలగించాలని ప్రజా సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. తరచూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ఏఐ సంస్థకు చేరిందెంత, ఆర్‌ అండ్‌ బీ వసూలు చేసిందెంత.. ఆర్టీసీ ప్రయాణికుల నుంచి గుంజిందెంత తదితర మొత్తం వివరాలను ఆర్టీఐ ద్వారా రాబట్టే ప్రయత్నం చేసిన ఆర్టీఐ ఉద్యమకర్త పట్టా రామ అప్పారావుకు ఆ వివరాలు తమ పరిధిలో లేవంటూ ఆ సంస్థల నుంచి సమాధానాలే అందాయి.

వివరాల్లోకి వెళ్తే..
వెంకోజీపాలెం నుంచి అనకాపల్లి రహదారి విస్తరణకు 1996లో జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) రూ.63.54 కోట్ల ఐడీబీఐ నుంచి రుణం తీసుకుంది. రోడ్డు విస్తరణకైన వ్యయాన్ని రాబట్టడానికి అగనంపూడిలో టోల్‌ప్లాజా ఏర్పాటు చేసి వసూళ్లకు దిగింది. 2012 నాటికి రూ.202 కోట్లు టోల్‌ఫీజు రూపంలో ఆదాయం రాబట్టినా నేటికీ అది కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు ఎంత ఆదాయం వచ్చింది.. బ్యాంక్‌కు చెల్లించిన ఈఎంఐలు, అప్పు ఎప్పటితో తీరిపోయింది వంటి వివరాల కోసం పట్టా రామ అప్పారావు ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌ అండ్‌ బీ సంస్థలను ఆర్టీఐ ద్వారా రాబట్టాలని చూసినా వాటిని ఇచ్చేందుకు రకరకాల సాకులతో సంస్థలు తప్పించుకుంటున్నాయి. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

ప్రయాణికుల నెత్తిన టోల్‌ పిడుగు..
టోల్‌ఫీజును బూచీగా చూపించి ఆర్టీసీ బస్‌ టికెట్లపై టోల్‌భారం ప్రయాణికుల నెత్తిన బాదుతోంది. ఇది 16 ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది. సిటీ బస్సు మొదలు కొని అన్ని రకాల ఆర్టీసీ బస్సులపై ఈ భారం పడుతోంది. బస్పులో అన్ని సీట్లు నిండితే కనీసం రూ.240 వరకూ వసూలవుతుంటుంది. రెండు వైపులా రూ.560 వరకూ ఉంటుంది. సొంత వాహనదారుల కంటే రోజూ ప్రయాణించే డైలీ పాసింజర్‌ ఎక్కువ మొత్తంలో ఆర్టీసీకి చెల్లిస్తున్నారు. సంస్థ టోల్‌ఫీజు రూపంలో వసూలు చేసిన మొత్తం ఎంత, టోల్‌ప్లాజాకు చెల్లించిన మొత్తం ఎంతో వివరాలు కావాలని ఆర్టీఐ ద్వారా ప్రశ్నించగా ఆర్టీసీ అధికారులదీ కూడా అదే తీరు. ఇలా సంస్థలు వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నా చట్టం చేతులు ముడుసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కల్పించిందని రామ అప్పారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు ప్రయాణించే ఆర్టీసీ బస్సులకు అతి సామాన్యులు చెల్లించే డబ్బులే అధికంగా ఉన్నాయని, టోల్‌ బాదుడు వీరిపైనే అధికంగా ఉంది.

ఆర్టీఐ కమిషనర్‌నునియమించడానికి భయం
రాష్ట్ర ప్రభుత్వంలో పారదర్శకత లోపిస్తోంది. లొసుగులు బయట పడతాయనే భయంతోనే ప్రభుత్వం నేటికీ కూడా ఆర్టీఐ కమిషన్‌ర్‌ను నియమించలేదు. దీంతో ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగులు కూడా సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. రాష్ట్ర కమిషనర్‌ను నియమించకపోవడం వల్లే అధికారులు, సంస్థలు వివరాలు అందుబాటులో లేవని తప్పించుకుంటున్నారు.  – పట్టా రామ అప్పారావు,ఆర్టీఐ ఉద్యమకర్త, అగనంపూడి

>
మరిన్ని వార్తలు