కదిలిన జనరథాలు

13 Oct, 2013 01:07 IST|Sakshi
కంబాలచెరువు (రాజమండ్రి), న్యూస్‌లైన్ :రోడ్లకు మళ్లీ మునుపటి ‘కళ’ వచ్చింది. సమైక్యాంధ్ర ఉద్యమంతో రెండు నెలలుగా కనుమరుగైన ‘జనరథాలు’ మళ్లీ కనిపించాయి. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విరమణతో శనివారం  రాజమండ్రి రీజియన్‌లోని 9 డిపోల నుంచీ బస్సులు తిరిగాయి. ఆర్టీసీ జేఏసీ సమ్మెకు నిర్ణయించడంతో ఆగస్టు 13 నుంచి 836 బస్సులు గత 60 రోజులుగా డిపోలకే పరిమితమయ్యాయి. కాగా ప్రభుత్వంతో చర్చలు ఫలించడంతో జిల్లాలోని తొమ్మిది డిపోల పరిధిలో 4,200 మంది విధులకు హాజరయ్యేందుకు సిద్ధమయ్యారు. శనివా రం మధ్యాహ్నానికి 588 కండక్టర్లకు గాను 442 మంది, 675 మంది డ్రైవర్లకు గాను 442 మంది విధులకు హాజరయ్యారు. 
 
 మిగతా సిబ్బంది దూరప్రాంత సర్వీసులకు, షిఫ్ట్‌లకు హాజరవుతున్నారు. చర్చల్లో ఆర్టీసీ కార్మికులందరికీ దసరా బోనస్ ప్రకటించి, తొలిరోజు విధులకు హాజరయ్యే వారందరికీ ఇది వర్తిస్తుందని తెలపడంతో జిల్లాలోనున్న కార్మికులంతా    విధులకు ఉత్సాహంగా హాజరయ్యారు. దసరా సందర్భంగా దూరప్రాంతాలు వెళ్లే వారు ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయనే సమాచారంతో ఉదయం నుంచే బస్టాండ్‌లకు చేరుకున్నారు. జిల్లా నుంచి ఉదయం హైదరాబాద్‌కు ఎనిమిది ప్రత్యేక బస్సులను నడపగా రాత్రికి మరికొన్ని అదనపు బస్సులను నడిపారు. విజయవాడ, విశాఖపట్నం రూట్లలో అదనంగా బస్సులు నడిపారు. కాగా ఉదయం నుంచి బస్సులు తిరుగుతున్నా ప్యాసింజర్ సర్వీసుల్లో మాత్రం మధ్యాహ్నం నుంచే రద్దీ కనిపించింది.  
 
 నష్టం రూ.50 కోట్ల పైనే..
 సమైక్యాంధ్ర ఉద్యమంతో ఆగస్టు ఒకటో తేదీ నుంచి 12 వరకు దఫదఫాలుగా బస్సులను ఉద్యమకారులు ఆపేశారు. దీంతో రీజియన్‌లో రూ.5 కోట్ల వరకు నష్టం వచ్చింది. అనంతరం ఆగస్టు 13 నుంచి 60 రోజుల పాటు సమ్మె కొనసాగడంతో రూ.45 కోట్లకు పైగా నష్టం వచ్చింది. ఇన్నిరోజులుగా ఆగిపోవడంతో బస్సుల్లో తలెత్తిన లోపాలకు మరి కొంత సొమ్ము ఖర్చు చేయాల్సి వస్తోంది. కాగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆటోవాలాలు, ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రయాణ వాహనాల వారు ఇదే అదనుగా ఇష్టారాజ్యంగా చార్జీలు దండుకుని సొమ్ము చేసుకున్నారు. సమ్మె కాలంలో రైళ్లయితే గాలి చొరబడడానికి సందు లేనంత కిక్కిరిసి కనిపించాయి. ఆర్టీసీ బస్సులు తిరిగి నడవడంతో ప్రయాణికుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.   
 
>
మరిన్ని వార్తలు