ఆర్టీసీలో సమ్మె సైరన్

6 May, 2015 04:23 IST|Sakshi

ఒంగోలు: ఆర్టీసీలో బుధవారం ఉదయం తొలి సర్వీసు నుంచే సమ్మె సైరన్ మోగనుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 డిపోల్లో కార్మికులు సమ్మె సన్నాహక కార్యకలాపాల్లో మునిగిపోయారు. మరో వైపు గుర్తింపు సంఘంగా ఉన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు జరిపింది. తప్పనిసరి పరిస్థితుల్లో తాము సమ్మెకు వెళుతున్నట్లు ప్రకటించింది. ఆర్టీసీ అధికారులు వారికి నచ్చజెప్పేందుకు చేసిన యత్నాలు విఫలం కావడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మునిగిపోయారు.
 
జిల్లాలో పరిస్థితి ఇదీ: ఆర్టీసీ ప్రకాశం రీజియన్ పరిధిలో 701 ఆర్టీసీ బస్సులు, 99 అద్దె బస్సులు కలిపి 3.25 లక్షల కిలోమీటర్లు నడుపుతున్నారు. ఇందు కోసం మొత్తం 4250 మంది కార్మికులు, ఉద్యోగులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. అందులో 1900 మంది డ్రైవర్లు, 1600 మంది కండక్టర్లు ఉన్నారు. అయితే ఇప్పటికే గుర్తింపు సంఘమైన ఎంప్లాయీస్ యూనియన్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతన సవరణ చేయాలంటూ డిమాండ్ చేస్తూ వచ్చింది. అయితే తాజాగా గత వేతన సవరణల కాలంలో నష్టపోయిన ఫిట్‌మెంట్ 19 శాతాన్ని వదులుకొని ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ఇచ్చిన 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి.

మరో వైపు నేషనల్ మజ్దూర్ యూనియన్ కూడా కార్మికుల పక్షానే నిలవాలని నిర్ణయించింది. ఎంప్లాయీస్ యూనియన్ చేపట్టిన సమ్మెకు సంఘీభావాన్ని ప్రకటించి తమ కార్మికులను, ఉద్యోగులను కూడా బుధవారం నుంచి విధులకు దూరంగా ఉండాలని ఆదేశించింది.  మంగళవారం సాయంత్రం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్‌తో కలిసి స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు కూడా సంయుక్తంగా ధర్నా నిర్వహించి కార్మికుల న్యాయమైన కోర్కెలు ఫలించేవరకు తాము విధులకు హాజరుకామంటూ స్పష్టం చేశారు. అయితే ఆర్టీసీలో తెలుగుదేశం పార్టీ అనుబంధ యూనియన్ అయిన ఆర్టీసీ కార్మిక పరిషత్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇంకా తెలియాల్సి ఉంది.
 
సమ్మె వల్ల రోజుకు కోటి నష్టం:
ఆర్టీసీలో సాదారణ రోజుల్లో రోజుకు రూ.80 లక్షల వరకు ఆదాయం వస్తుంది. అయితే ప్రస్తుతం వేసవి సెలవుల కారణంగా రద్దీ పెరిగింది. మరో వైపు వివాహాలు, శుభముహూర్తాలు పెరిగిపోయాయి. దీంతో ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయిదు రోజుల నుంచి రోజుకు రూ.20 లక్షల అదనపు ఆదాయం లభిస్తోంది. ఈ దశలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మెకు దిగడంతో ఆర్టీసీ యాజమాన్యానికి శరాఘాతంగా మారింది.  ఆర్టీసీ అధికారులు యాజమాన్య ఆదేశాల మేరకు ఇటు రవాణాశాఖ అధికారులతోను, మరో వైపు పోలీసుశాఖ ఉన్నతాధికారులకు తమకు సహకరించాలంటూ విజ్ఞప్తులు పంపారు. ప్రధానంగా ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా అన్ని బస్సులను నడిపేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఆర్టీసీ కోరింది.  
 
2001 నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయంటున్న కార్మిక సంఘాలు:
ఈ విషయంపై కార్మిక సంఘాలు మాత్రం తీవ్రంగానే స్పందిస్తున్నాయి. ఎట్టి పరిస్థితులలో  43 శాతం ఫిట్‌మెంట్‌కు ఒక్క శాతం తగ్గినా అంగీకరించేది లేదని స్పష్టం చేస్తున్నాయి. దానికి తోడు 2013 ఏప్రిల్ ఒకటి నుంచి ఫిట్‌మెంట్‌ను వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సమ్మె చేయాలనేది తమ అభిమతం కాదని, రెండేళ్లకు పైగా వేచి చూసినా యాజమాన్యం, ప్రభుత్వం స్పందించకపోవడం వల్లే  తాము తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళుతున్నట్లు కార్మిక సంఘ నేతలు ప్రకటించారు.
 
సంప్రదింపుల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి: ఆర్టీసీ ఆర్‌ఎం వి.నాగశివుడు
సంప్రదింపుల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆర్టీసీకి కలిసివచ్చే కాలంలో కార్మికులు సమ్మెలోకి వెళితే సంస్థ మరింత సంక్షోభంలోకి వెళుతుంది. పునరాలోచించుకోవాలి. ఒక వేళ కార్మికులు సమ్మెకు సిద్ధపడితే యాజమాన్యం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టేందుకు దృష్టి సారించాం.

మరిన్ని వార్తలు