ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ హవా

19 Feb, 2016 07:47 IST|Sakshi

జిల్లాలో భారీ ఆధిక్యం
14 స్థానాల్లో 11 కైవసం 99 శాతం పోలింగ్
డిపోల వారీగా ఫలితాల వెల్లడి
బోణీ కొట్టని ‘టీడీపీ’ యూనియన్

 
విజయవాడ : ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ సత్తా చాటింది. కృష్ణా రీజియన్ పరిధిలో 14 డిపోలకు 11 స్థానాల్లో జయభేరి మోగించింది. రాష్ట్ర స్థాయి ఓట్లలోనూ ఆధిక్యంలో కొనసాగింది. నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు నూజివీడు, తిరువూరు, ఇబ్రహీంపట్నం డిపోల్లోనే విజయం దక్కింది. నెలరోజుల పాటు హోరాహోరీగా ప్రచారం నిర్వహించి, అనేక హామీలను గుప్పించి, బరిలో ఏడు ప్రధాన యూనియన్లు తలపడటంతో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు సంఘం ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు కావటంతో అన్ని యూనియన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

ప్రశాంతంగా పోలింగ్
 జిల్లాలో ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. కృష్ణా రీజియన్ పరిధిలోని 14 డిపోల్లో 15 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నడుమ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు నిర్వహించారు. కార్మిక శాఖ అధికారులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించారు. జిల్లాలో ప్రధానంగా ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ మధ్య తీవ్రస్థాయిలో పోటీ కొనసాగింది. దీనికి తగ్గట్టుగానే రెండు యూనియన్లు హోరాహోరీగా ప్రచారం సాగించాయి. రెండు ప్రధాన యూనియన్లతో పాటు అధికార పార్టీకి చెందిన కార్మిక పరిషత్, మరో నాలుగు ప్రధాన యూనియన్లు బరిలో నిలిచాయి. జిల్లాలో మొత్తం 6,420 ఓట్లు ఉండగా, గురువారం నాటి పోలింగ్‌లో 6,197 పోలయ్యాయి. వీటిలో 178 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. దీంతో 99 శాతం పోలింగ్ నమోదైంది. కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో అధికారులు ఎన్నికల ప్రకియ నిర్వహించారు.

బోణీ కొట్టని అధికార పార్టీ
అధికార తెలుగుదేశం పార్టీ అనుబంధ యూనియన్‌గా ఉన్న కార్మికపరిషత్ జిల్లాలో బోణీ కొట్టలేదు. గుడివాడ మినహా అన్నిచోట్లా నామమాత్రంగానే ఓట్లు దక్కించుకుంది. ఆర్టీసీ ఎన్నికల్ని కూడా సాధారణ ఎన్నికల మాదిరిగా భావించిన టీడీపీ జిల్లాలో మంత్రులు మొదలుకొని ఎమ్మెల్యేల వరకు అందరితో డిపోల్లో సమావేశాలు నిర్వహించింది. కార్మిక పరిషత్‌ను గెలిపిస్తే ఇంటి స్థలం ఇస్తామని నేతలు ప్రకటించారు. గుడివాడలో మాత్రమే 100 ఓట్లు రాబట్టగలిగారు. అయినా మూడో స్థానంలో నిలిచారు.
 
 

మరిన్ని వార్తలు