అదును దొరికితే బాదుడే...

21 Mar, 2019 10:18 IST|Sakshi

వైఎస్‌ హయాంలోనే భారం లేని ‘ప్రయాణం’

రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో నాలుగుసార్లు ఆర్టీసీ చార్జీల పెంపు

 టీడీపీ పాలనలో పల్లెవెలుగులు రద్దు, కనీస చార్జీ పెంపు 

విజయనగరం అర్బన్‌: ప్రజల కష్ట,సుఖాలనెరిగి పరిపాలన చేసేవారిని ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. అలాంటి నాయక వారసత్వాన్నే కోరుకోవడం సహజం. దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అందించిన పాలనను కూడా మరలా ప్రజలు కోరుకుంటున్నారు. తన హయాంలో పేదల సంక్షేమానికి పెద్దపీట చేశారు. తన ఐదేళ్ల పదవీకాలంటే ఆర్టీసీ వ్యవస్థను పరిరక్షిస్తూ ఏనాడూ బస్సు చార్జీలు పెంచకపోడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మహానేత మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు ఎడాపెడా చార్జీలను పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు. దీంతో బస్సు ఎక్కాలంటే పేదోడు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి తొమ్మిదేళ్ల పాలనలో ఇలాగే విద్యుత్, బస్సు చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు. 


రవాణా సౌకర్యం..
పేద, ధనిక అనే తేడాలేకుండా  ప్రభుత్వం అందరికీ రవాణా సౌకర్యం కల్పించాలి. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి మినహా మిగతా ముఖ్యమంత్రులెవ్వరూ దీనిని అంతగా పట్టించుకున్న దాఖలాలు లేవు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన తొమ్మిదేళ్లపాలనా కాలంలో ఇష్టానుసారంగా బస్సుచార్జీలు పెంచి  ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అదే టీడీపీ తాజాగా గడచిన ఐదేళ్లలో బసు చార్జీలు పెంచకపోయినా.. ఖరీదైన లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, సూపర్‌లగ్జరీ, గరుడా వంటి సర్వీసులను ప్రవేశపెట్టింది.

అలాగే నష్టం వస్తుందనే సాకుతో చాలా గ్రామాలకు పల్లె వెలుగు సర్వీసులను రద్దు చేశారు. కొన్ని చోట్ల ఆర్డినరీ బస్సులన్నా ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు వసూలు చేయడం విశేషం. పైగా సంస్థ నష్టాల్లో ఉంటే ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా ఆర్థిక సాయం చేయలేదు. కానీ వైఎస్సార్‌ తన హయాంలో ఏడాదికి రూ. 300 కోట్ల ఆర్థిక సాయం చేయడంతో పాటు కార్మికులు కోరిన వేతన ఒప్పందం అందజేశారు.  


నాలుగేళ్లలో నాలుగుసార్లు..
నష్టాల్లో ఉన్న రోడ్డు రవాణా సంస్థను ఆదుకునేందుకు అనేక మార్గాలు ఉన్నా పట్టించుకోకుండా చార్జీలు పెంచడమే లక్ష్యంగా రోశయ్య, కిరణ్‌ ప్రభుత్వాలు పనిచేశాయి. ఆ తర్వాత వచ్చిన టీడీపీ ఖరీదైన లగ్జరీ సర్వీసులను ప్రవేశ పెట్టి సామాన్యులకు ఆర్టీసీ ప్రయాణం భారంగా మార్చారు.  విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని నెక్‌ రీజయన్‌లో 920 బస్సులకు పైగా ఉన్నాయి. ఇవి రోజుకు మూడు లక్షలకు పైగా కిలోమీటర్లు తిరుగుతున్నాయి. 2010 జనవరి 6న రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చార్జీల పెంచి రూ. 30 కోట్ల భారం మోపారు.

ఆ తర్వాత 2011 జూలై 16న కిరణ్‌కుమార్‌ రెడ్డి సర్కారు పెంచిన చార్జీలతో ఏటా రూ. 26 కోట్ల భారం పడగా.. 2012 సెప్టెంబర్‌ 24న పెంచిన చార్జీలతో ఏటా రూ. 35 కోట్లు.. 2013 నవంబర్‌ 6వ తేదీన చార్జీలు పెంచడంతో రూ. 35.50 కోట్ల మేరకు భారం పడింది. దీంతో  చార్జీల భారం సుమారు రూ.130 కోట్లకు చేరింది. టీడీపీ హయాంలో అభివృద్ధి సెస్‌ పేరుతో టిక్కెట్‌కి రూపాయలు వసూలు చేయడంతో ప్రయాణికులపై రూ. 3.50 కోట్ల భారం పడింది. టోల్‌ప్లాజా చార్జీని ఆర్డినరీ మినహా ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌ లగ్జరీ సర్వీసులకు రూ.3 నుంచి ఐదు రూపాయలకు... ఇంద్ర, వెన్నెల, గరుడా, వెన్నెలా ప్లస్, తదితర సర్వీసుల టోల్‌ ప్లాజా చార్జీని మూడు రూపాయల నుంచి రూ.6కు పెంచారు. పల్లె వెలుగు కనీసం చార్జీ రూ. 3 నుంచి ఐదు రూపాయలకు పెంచి గ్రామీణ ప్రాంత ప్రయాణికుల నడ్డి విరిచారు. రాజన్న రాజ్యం రావాలంటే ఆయన ఆశయ సాధనకు కృషి చేసే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు