బస్సెక్కితే బహుమతి

10 Mar, 2020 06:04 IST|Sakshi

ఆక్యుపెన్సీ రేషియో పెంచేందుకు ఆర్టీసీ వినూత్న ఆలోచన

లక్కీ డ్రా తీసి ప్రయాణికులకు బహుమానాలు

పల్లెవెలుగు బస్సుల్లో ప్రయోగాత్మకంగా అమలు 

సాక్షి, అమరావతి: ప్రజారవాణారంగంలోని పోటీని ఎదుర్కొనేందుకు ఆర్టీసీ వినూత్న ఆలోచనలు చేస్తోంది. పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణిస్తే లక్కీడిప్‌ ద్వారా రూ. 200 నుంచి రూ. 500 వరకు విలువైన బహుమతులు ఇవ్వనుంది. నెలలో రెండు సార్లు డ్రా తీసి ఎంపికైన ప్రయాణికులకు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించనున్నారు. తొలుత ప్రయోగాత్మకంగా గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఈ విధానం అమలు చేయనున్నారు. వరుసగా మూడు నెలల పాటు లక్కీడిప్‌ ద్వారా ఎంపిక చేసిన ప్రయాణికులకు బహుమతులు అందిస్తారు.

ఈ విధానం ద్వారా సత్ఫలితాలు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన రూట్లలో ప్రయాణించేవారికి ఈ బహుమానాలు అందజేస్తారు. పల్లెవెలుగు బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 60 శాతానికి మించడం లేదు. ఈ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 80 శాతానికి పెంచేందుకు ఈ వినూత్న ఆలోచన ఆర్టీసీ అధికారులు అమలు చేస్తున్నారు. పల్లెవెలుగు ద్వారా నష్టాల్ని అధిగమించేందుకు ఆర్టీసీ ఈ ప్రయోగం చేస్తోంది. సత్ఫలితాలు వస్తే అన్ని సర్వీసుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందించింది. 

ప్రయాణికులు ఏం చేయాలి?
- పల్లెవెలుగు బస్సులో ప్రయాణించి టికెట్‌ వెనుక ఫోన్‌ నంబర్, అడ్రస్‌ రాసి బస్సులో ఉంచిన బాక్సులో వేయాలి. నెలలో రెండుసార్లు లాటరీ తీసి ప్రయాణికుల్ని ఎంపిక చేస్తారు. 
- ప్రతి జిల్లాలో 150 బస్సుల్లో ఈ లక్కీడిప్‌ ద్వారా ప్రయాణికులకు బహుమతులు అందించనున్నారు. 
- రాష్ట్రంలో నిత్యం రెండున్నర కోట్ల మంది వివిధ మార్గాల్లో ప్రయాణిస్తున్నట్లు రవాణా శాఖ అంచనా. 
- ప్రయాణికుల తరలింపులో ఆర్టీసీది 25 శాతం వాటా. రైల్వే, సొంత వాహనాల ద్వారా 30 శాతం, 45 శాతం ప్రైవేటు వాహనాల ద్వారా ప్రయాణిస్తున్నారు. 
- గత ప్రభుత్వ హయాంలో దూర ప్రాంత రూట్లపైనే కాకుండా.. గ్రామీణ రూట్లలోనూ ప్రైవేటు ఆపరేటర్లు ఆధిపత్యం చెలాయించారు. ఫలితంగా పల్లెవెలుగు సర్వీస్‌ ద్వారా ఆర్టీసీ నష్టాలు మూటకట్టుకుంది. ప్రస్తుతమున్న పోటీని తట్టుకుని ప్రయాణికుల్ని ఆకట్టుకునేందుకు ఆర్టీసీ వినూత్న ఆలోచనలు చేస్తోంది.  

మరిన్ని వార్తలు