కార్మిక సంఘాలతో ఆర్టీసీ మరోసారి చర్చలు

4 Jul, 2013 10:47 IST|Sakshi

హైదరాబాద్: సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలు ఈయూ,టీఎంయూలను ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ యాజమాన్యం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఆర్టీసీ యాజమాన్యం గురువారం ఉదయం 11:30 నిమిషాలకు కార్మిక సంఘాల నేతలతో మరోమారు చర్చలు జరపనుంది. ఆర్టీసీలోని పలు కార్మిక సంఘాలు శుక్రవారం నుంచి  బంద్కు పిలుపునిచ్చాయి. ఇప్పటికే మంగళవారం ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌తో కార్మిక సంఘాల చర్చలు విఫలం కాగా... బుధవారం రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణతో జరిగిన చర్చలూ అసంపూర్తిగా ముగిశాయి.

మంత్రి చేసిన ప్రతిపాదనలపై ఆర్టీసీ యాజమాన్యం లిఖితపూర్వకంగా హామీ ఇస్తే సమ్మె విషయంలో తమ స్పందన వెల్లడిస్తామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. అప్పటివరకూ చర్చలు అసంపూర్తిగానే ఉన్నట్లు భావిస్తామని... సమ్మె చేయాలనే విషయంలో ఎలాంటి మార్పు లేదని ఈయూ, టీఎంయూ నేతలు పేర్కొన్నారు.  తాజాగా మరోసారి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ చర్చలు విఫలం అయితే ఆర్టీసీ శుక్రవారం తలపెట్టిన సమ్మె యథాతథంగా జరిగే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు