బస్సు ఎలా దగ్ధమైంది..

12 Feb, 2020 13:04 IST|Sakshi
ప్రమాదంలో కాలిపోయిన బస్సు

శెట్టిగుంట ప్రమాదంపై వెంటాడుతున్న ప్రశ్న

ఇద్దరు మృతులలో ఒకరు గుర్తింపు

ఆర్టీసీ అధికారుల విచారణ

ప్రాణాంతకంగా మారిన రహదారి

రైల్వేకోడూరు రూరల్‌: రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపాన సోమవారం రాత్రి జరిగిన బస్సు దగ్ధం ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న సంఘటనలో బస్సు పూర్తిగా కాలిపోవడం..ఇరువురు ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. మున్నెన్నడూ లేని విధంగా ఏకంగా బస్సు పూర్తిగా దగ్ధమవ్వడం ఆర్టీసీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. దీనిపై ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్నారు. ద్విచక్ర వాహన చోదకుడు వెలుగు మాంక్‌(24)గా గుర్తించారు.

మృతునిది అనంతరాజుపేట పంచాయతీ నారాయణరాజు పోడు ఎస్టీ కాలనీ. ఇతనికి భార్య ఈశ్వరమ్మ, కుమార్తె దీప(4) ఉన్నారు. బస్‌ చివరి సీట్లో గుర్తు పట్టలేని విధంగా కాలిపోయిన మరో వ్యక్తి ఎవరో ఇప్పటికీ తేలలేదు. హాహాకారాలు చేస్తూ ప్రయాణికులంతా దిగుతుంటే ఒక్కరే ఎందుకు బస్సులో మిగిలిపోయారో అర్థం కావడం లేదు. ఆ సమయంలో çస్పృహలో లేరా.. లేక గుండెపోటు వచ్చి మృతి చెందారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  మృత దేహం ఎడమ కాలి లోపల రాడ్‌ ఉన్న విషయం గుర్తించారు. గతంలో కాలు విరిగి ఉంటే ఆపరేషన్‌ చేసి ఉంటారని భావిస్తున్నారు.  ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన ద్విచక్ర వాహన చోదకుడు మాంక్‌(24)భార్య  ఈశ్వరమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కూలి పనికి వెళ్లొచ్చి జ్వరంతో ఉన్న తనను సోమవారం రైల్వేకోడూరులోని ఆసుపత్రిలో చూపించారంటూ ఆమె రోదిస్తోంది. ఆస్పత్రి నుంచి తిరిగి ఇంటికి వచ్చి మళ్లీ బట్టలు మార్చుకుని ఏదో పనిమీద రైల్వేకోడూరు వస్తూ ప్రమాదంలో చిక్కుకున్నట్లు తెలిసింది. 

బస్సు కింద ఇరుక్కుపోయిన ద్విచక్రవానాన్ని పరిశీలిస్తున్న ఆర్‌ఎం జితేంద్రనాథ్‌ రెడ్డి, ఎస్‌ఐ నరసింహం
డ్రైవరు సమయస్ఫూర్తి
ద్విచక్ర వాహనం ఢీకొనగానే మంటలు వ్యాపిస్తున్నాయని తెలుసుకున్న డ్రైవరు శ్రీనివాసులు చాకచక్యంగా వ్యవహరించాడు. వెంటనే బస్సును రోడ్డు పక్కగా ఆపేశాడు. 22 మంది ప్రయాణికులను వెంటనే దింపేశాడు. కడప అర్‌టీసీ ఆర్‌ఎం జితేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ డ్రైవరు శ్రీనివాసులు ముఫ్పైసంవత్సరాలుగా వి««ధులు నిర్వహిస్తున్నాడన్నారు. ద్విచక్రవాహనం ఎదురుగా వచ్చి ఢీ కొనడంతో ప్రమాదం జరిగిందని అభిప్రాయపడ్డారు. మాంక్‌ ఎగిరి పడి మృతి చెందాడన్నారు. . ద్విచక్ర వాహం నుంచి వెలువడిన మంటల వల్లనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నామన్నారు. అప్రమత్తతతో వ్యవహరించి డ్రైవరు ప్రయాణికులను కాపాడారని ప్రశంసించారు. ప్రమాద సమయంలో బస్సులో 23మంది ప్రయాణికులున్నారు. అ«ధికారులు విచారణ జరుపుతున్నారు.  

నెత్తు్తరోడుతున్న జాతీయ రహదారి

రైల్వేకోడూరు మీదుగా వెళ్లే జాతీయ రహదారి తరచూ నెత్తురోడుతోంది. కుక్కలదొడ్డి నుంచి అనంతరాజుపేట వరకు ప్రతి నిత్యం ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల శెట్టిగుంటకు సమీపంలో కొత్తపల్లె క్రాస్‌ వద్ద  గుండాలపల్లెకు చెందిన వ్యాపారవేత్త ఒకరు మృత్యువాత పడ్డారు. మ్యాంగో యార్డు వద్ద వెంకటరెడ్డి పల్లెకు చెందిన ఒకరు, గతంలో మాధవారంపోడు క్రాస్‌ వద్ద ఆర్‌టీసీ బస్‌ లారీ ఢీ కొన్న సంఘటనలో ఇద్దరు మృతి చెందారు.  జ్యోతినగర్‌ సమీపంలో గాజులవ్యాపారి మృత్యువాత పడ్డారు. అనంతరాజుపేట వద్ద ఇద్దరు మృతి చెందారు. ఇలా తరచూ ప్రమాదాలు జరగడం కలవరపరుస్తోంది.

మరిన్ని వార్తలు