అద్దె బండి అనుభవం ఇవ్వమండి

5 Feb, 2020 12:00 IST|Sakshi

త్రిశంకు స్వర్గంలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు

అనుభవ సర్టిఫికెట్‌కు పడరానిపాట్లు

మొండికేస్తున్న యజమానులు

ఔట్‌ సోర్సింగ్‌కు తప్పని అగచాట్లు

పట్టించుకోని అధికారులు

ఆర్టీసీ అద్దె డ్రైవర్లు త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. చాలీచాలని వేతనాలతో జీవితాలు వెళ్లదీస్తున్నారు. నమ్ముకున్న వృత్తినివదల్లేక.. ప్రభుత్వం కల్పించే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగంలో చేరలేక
పడరానిపాట్లు పడుతున్నారు.అనుభవ ధ్రువపత్రాల కోసం అద్దె బస్సు యజమానుల చుట్టూ తిరుగుతున్నారు. వారు కరుణించకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచకఅధికారుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఏళ్ల తరబడి పనిచేశామని, తమను ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకోవాలని బతిమలాడుతున్నారు. నిబంధనలకు నీళ్లొదలలేమని అధికారులు సున్నితంగా తిప్పిపంపుతున్నారు. కొందరు ఓనర్లు తమ డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవద్దంటూ అధికారులకు హుకుం జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది.   

 తిరుపతి అర్బన్‌: ఆర్టీసీ ఔట్‌ సోర్సింగ్‌ డ్రైవర్ల భర్తీలో అద్దె బస్సుల యజమానుల (ఆర్టీసీ అద్దెబస్సుల ఓనర్స్‌) పెత్తనం కొనసాగడంపై పలువురు డ్రైవర్లు మండిపడుతున్నారు. దీంతో ఔట్‌సోర్సింగ్‌పై తీసుకోవాలంటే వారు పనిచేసిన బస్సు యజమానుల నుంచి అనుభవ ధ్రువపత్రం తీసుకు రమ్మంటున్నారు. యజమానులు సర్టిఫికెట్‌ ఇవ్వమంటున్నారు.ప్రభుత్వం ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో డ్రైవర్లను భర్తీ చేసి.. 8గంటల పాటు పనిచేస్తే గౌరవ వేతనంగా రూ.800 చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్లను వారి యజమానులు 18 గంటల పాటు పనిచేయించుకుని కేవలం రూ.600 మాత్రమే ఇచ్చేవారు. అందువల్ల  ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో డ్రైవర్లుగా పనిచేయడానికిఅవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు. అయితే ఆర్టీసీ పెద్దలు మాత్రం వారి ఓనర్ల వద్ద నుంచి అనుభవ సర్టిఫికెట్‌ తీసుకురావాలంటూ మెలిక పెట్టేస్తున్నారు. వాళ్లు సర్టిఫికెట్‌ ఎందుకు ఇస్తారయ్యా 

జిల్లాలో ఆర్టీసీ వ్యవహారం ఇలా..
జిల్లాలో 1,390 ఆర్టీసీ బస్సుల్లో ప్రతిరోజు 7లక్షల మందికిపైగా ప్రయాణికులను తరలిస్తున్నారు. ఆమేరకు 2,900మంది కండక్టర్లు, 3,150మంది డ్రైవర్లు పనిచేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ కిలోమీటర్‌కు రూ.20 చొప్పన అద్దె చెల్లించి.. 225 అద్దె బస్సుల్ని నడిపిస్తోంది. ఆ బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు జీతభత్యాలను వాటి యజమానులే చూసుకుంటారు. ఆర్టీసీలో పలు సర్వీసులు వన్‌మ్యాన్‌ సర్వీసులు ఉండడంతో కండక్టర్ల అవసరం లేకున్నా.. డ్రైవర్ల కొరత మాత్రం తప్పడం లేదు. అంటూ డ్రైవర్లు తలలుపట్టుకుంటున్నారు. 

విద్యార్థులకు, పల్లెలకు ఆర్టీసీ సర్వీసులు
కొత్త ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల పిల్లలకు సౌకర్యంగా ఉదయం, సాయంత్రం బస్సులు నడిపాలని యోచిస్తోంది. మరో వైపు పల్లె ప్రాంతాలకు కూడా ఆర్టీసీ సర్వీసులను నడపాలని భావించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మంగళం, అలిపిరి, ఏడుకొండల బస్టాండ్లు మినహా మిగిలిన అన్ని డిపోల పరిధిలో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో అవసరం అయిన మేరకు డ్రైవర్లను తీసుకోవాలని నిర్ణయించింది. పలువురు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఎంపికైన కొందరు శిక్షణ కూడా పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఆర్టీసీకి అద్దె బస్సులు నడిపిన వారికి మాత్రం ఓట్‌సోర్సింగ్‌లో అవకాశం ఇవ్వడం లేదు.  

అద్దె బస్సుల యజమానులు సర్టిఫికెట్‌ ఇవ్వాలి
ఆర్టీసీకి చెందిన అద్దె బస్సులు యజమానులు తమ వద్ద పనిచేస్తున్న డ్రైవర్లు తమకు ఏమీ బాకీలేరని.. వారి సర్టిఫికెట్లు వారికే ఇచ్చేశామని, వారిని తీసుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని సర్టిఫికెట్‌ రూపంలో ఓ లెటర్‌ ద్వారా అందజేస్తే హైర్‌ బస్సుల డ్రైవర్లను ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో తీసుకోవడానికి అభ్యంతరంలేదు.               – మధుసూదన్, డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌‡, తిరుపతి

ఆర్టీసీలో ఏళ్ల తరబడి పనిచేస్తున్నాం
ఆర్టీసీ అద్దెకి చెందిన హైర్‌ బస్సుల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్నాం. మాకు ఆర్టీసీ డ్రైవర్ల వలే ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయడానికి బస్సు పాస్‌ ఇచ్చారు. హేవీ లైసె న్స్‌ ఉంది. ఆర్టీసీ అద్దె బస్సుల్లో డ్రైవర్లగా తీసుకునే సమయంలో అన్ని అర్హతలను చూసి ఎంపిక చేశారు. అయితే హైర్‌ బస్సులో పని ఎక్కువగా ఉంది. జీతం తక్కువ. ప్రభుత్వం ప్రకటించిన ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్ల విషయంలో పనికి తగ్గిన వేతనం ఉంది. దాంతో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఆర్టీసీ డ్రైవర్లగా పనిచేయాలని నిర్ణయించుకున్నాం. మాకు న్యాయం చేయండి.  – కే. బాలచంద్రయ్య, ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌

గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నాం
ఆర్టీసీ అద్దె బస్సుల్లో 18గంటల పాటు పనిచేస్తే కేవలం రూ.600 ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్లుగా కేవలం 8గంటలు పనిచేస్తేనే రూ.800 వస్తుంది. నేను మా ఓనర్‌కు ఒక్క పైసా బాకీలేను. నా సర్టిఫికెట్లు నావద్దే ఉన్నాయి. ఏడేళ్లుగా ఆర్టీసీ అద్దె బస్సులో పనిచేసిన అనుభవం ఉంది. హేవీ లైసెన్స్‌ పొందాను. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని అర్హాతలు ఉన్నాయి. అయితే మా ఓనరు ఒత్తిడితో మాకు ఆర్టీసీ పెద్దలు అన్యాయం చేస్తున్నారు. ఇది న్యాయమేనా?  – పి.మునిరామయ్య, ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌

ప్రభుత్వ పద్ధతిలో అద్దె బస్సుల్లో జీతాలు ఇవ్వాలి
ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో 8గంటలు పనిచేస్తే రూ.800 ఇస్తామని చెబుతోంది. అదే తరహాలో అద్దె బస్సుల యజమానులు మాకు జీతాలు ఇస్తే.. అలానే అద్దె బస్సుల్లో పనిచేస్తాం. మీరు పనికి తగ్గిన జీతం ఇవ్వకుండా.. ప్రభుత్వం ఇస్తుంటే అందులో చాన్స్‌ లేకుండా చేయడం దారుణం.  – ఎన్‌. సురేష్, అద్దె బస్సు డ్రైవర్‌

డ్రైవర్లుగా అవకాశం ఇవ్వండి
మాకు భార్యాబిడ్డలున్నారు. పనికి తగిన వేతనం కోరుకోవడంలో తప్పు ఏమైనా ఉందా? ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఔట్‌సోర్సింగ్‌లో డ్రైవర్లుగా పనిచేయాలని భావిస్తున్నాం. దయచేసి మాకు ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్లుగా పనిచేయడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి. అనుభవం లేని స్కూల్‌ బస్సు డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు అవకాశం ఇస్తున్నారు. ఎవరో ఒత్తిడితో మాకు ఇవ్వకపోవడం సరికాదు.  –సి.నరసింహులు, ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌

మరిన్ని వార్తలు