పల్లెటూరొద్దు!

8 Feb, 2019 07:47 IST|Sakshi
బస్సులు లేకపోవడంతో ఆటో కిరాయి మాట్లాడుకుని కిక్కిరిసి ప్రయాణిస్తున్న మహిళలు

ఆర్టీసీ సర్వీసులు రద్దు ఆదాయం రావట్లేదంట!

గ్రామీణులకు తప్పని అవస్థలు

ఆటోలూ లేక ఇబ్బందులు  

పశ్చిమగోదావరి, టి.నరసాపురం: పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు అనే నానుడి నాయకుల ఉపన్యాసాలకే పరి మితమవుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా పల్లెల అవసరాలు తీరడంలేదు. కనీస సౌకర్యాల కల్పనలోనూ వెనకబడే ఉన్నాయి. పల్లె వెలుగు పేరుతో తిప్పుతున్న బస్సు సర్వీసులు పేరుకే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజా అవసరాలను గాలికి వదిలి ఆదాయానికే పెద్ద పీట వేయడంతో గ్రామసీమలు అభివృద్దికి నోచుకోవడంలేదు. ఆదాయం రావడంలేదనే సాకుతో జిల్లాలో పలు ఆర్టీసీ సర్వీసులను రద్దుచేయడంతో గ్రామీణులు నిత్యం అవస్థలు పడుతున్నారు. గ్రామం దాటి బయటకు రావాలంటే ఆటోవాలాల మీద ఆధారపడాల్సి వస్తోంది. లేకపోతే కాళ్లకు పని చెప్పాల్సి వస్తోంది.

సర్వీసులేవీ?
ఏలూరు, జంగారెడ్డిగూడెం డిపోలకు చెందిన ఆర్టీసీ సర్వీసులు కొన్ని పదేళ్లక్రితం రద్దు చేయగా, మరికొన్నింటిని ఐదేళ్ల క్రితం రద్దు చేశారు. జంగారెడ్డిగూడెం నుంచి మండలంలోని అల్లంచర్లరాజుపాలెం, కొత్తగూడెం గ్రామాలమీదుగా టి.నరసాపురం, చింతలపూడి గ్రామాలకు ఉద యం, సాయంత్రం గతంలో బస్సు సర్వీసులను నడిపేవారు. ఈ దారి గోతుల మయంగా అధ్వానంగా మారడంతో   ఆక్వుపెన్సీ లేదనే సాకుతో పదేళ్ల క్రితం ఈ సర్వీసులను రద్దు చేశారు. నేటికీ పునరుద్ధరించలేదు. ఈ రెండుగ్రామాల ప్రజలు ఇటు టి.నరసాపురం రావాలన్నా అటు కామవరపుకోట వెళ్లాలన్నా ఐదు నుంచి ఏడు కిలోమీటర్లు ఇటు కె.జగ్గవరానికి, అటు చింతలపూడి కామవరపుకోట ఆర్‌అండ్‌బీ రహదారి వరకు వెళ్లాల్సి ఉంది.

అలాగే మండలంలోని గిరిజన గ్రామాలైన లంకాలపల్లి, గట్టుగూడెం, సున్నపురాళ్లపల్లి, మర్రిగూడెం గ్రామాలకు గతంలో ఏలూరు డిపో నుంచి మక్కినవారిగూడెం మీదుగా  లంకాలపల్లికి ఉదయం సాయంత్రం బస్సు సర్వీసులను నడిపేవారు. ఐదేళ్ల క్రితం ఈ సర్వీసులను రద్దు చేశారు. ఆయా గ్రామాల ప్రజలు ప్రతి చిన్న అవసరానికి ఆరు కిలో మీటర్ల దూరంలోని మక్కినవారిగూడేనికి రావాల్సిందే.  అలాగే జంగారెడ్డిగూడెం నుంచి సింగరాయపాలానికి మల్లుకుంట సిం గరాయపాలెం బొర్రంపాలెం మీదుగా టి.నరసాపురం చింతలపూడికి ఉదయం, సాయంత్రం బస్సు సర్వీసులను నడిపేవారు. ఈ సర్వీసులను ఐదేళ్ల క్రితం రద్దు చేశారు. ఈ గ్రామస్తులు ప్రతి చిన్న అవసరానికి మూడు కిలోమీటర్ల దూరంలోని బొర్రంపాలెం రావాల్సిందే. ఈ ప్రాంతంలో బస్సులు నడవక అవస్థలు తప్పడం లేదు.

సర్వీసు ఆటోలూ ఉండట్లే
ఈ గ్రామాల నుంచి ప్రజలు బయటకు రావడానికి సర్వీసు ఆటోలు కూడా ఉండట్లేదు. ఫలితంగా అవసరాన్ని బట్టి ప్రయాణికులు ఆటోలను కిరాయికి మాట్లాడుకుని వెళ్లాల్సి వస్తోంది. ఆటోవాలాలు కిరాయి ఎక్కువ డిమాండ్‌ చేసినా ఇవ్వక తప్పని దుస్థితి. రూ.10లోపు వెళ్లే ప్రయాణ ఖ ర్చుకు బదులుగా కిరాయి రూపంలో రూ.100 నుంచి రూ.200 చెల్లించాల్సి వస్తోంది. ఆ విధంగా కిరాయి చెల్లించలేని వారు కాళ్లకు పని చెప్పి నడిచి వెళ్ళి వస్తున్నారు.

చిన్నపాటి పనులూ వాయిదా
ఈ గ్రామాల ప్రజలు తప్పనిసరి అయితేనే గ్రామాలు కదులుతున్నారు. చిన్నపాటి అవసరాలను వా యిదా వేసుకుని వారానికోసారి బయటకు వచ్చి వెళ్తున్నారు. బయటకు వచ్చినప్పుడే వారానికి సరిపడా నిత్యావసర సరుకులు కొనుక్కువెళ్తున్నారు.  వైద్య అవసరాలకూ స్థానిక పీఎంపీలపైనా ఆధారపడుతున్నారు. 

నష్టాన్ని ప్రభుత్వం భరించాలి
రద్దు చేసిన ఆర్టీసీ సర్వీసులను వెంటనే పునరుద్ధరించాలని, ఆర్టీసీకి ఈ సర్వీసుల వల్ల తగ్గిన ఆదాయాన్ని ప్రభుత్వం భరించైనా సర్వీసులు నడపాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

పదేళ్లుగా బస్సు లేదు
పదేళ్లుగా ఆర్టీసీ బస్సు సర్వీసులు లేక ఇబ్బందులు పడుతున్నాం. నిత్యం ప్రతిచిన్న అవసరానికీ టి.నరసాపురం, కామవరపుకోట వెళ్లాల్సి ఉంది. ఎటు వెళ్లాలన్నా ఐదు కిలోమీటర్లు నడుచుకుని వెళ్లి, ఆటోలో ప్రయాణించాల్సి ఉంది. ఆర్థిక భారమవుతోంది. బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలి.– కత్తి సత్యనారాయణ, కొత్తగూడెం

నిత్యం అవస్థలు
మండలంలోని గిరిజన గ్రామాలకు బస్సు సర్వీసులు నిలిపివేయడంతో గిరిజనులు నిత్యం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రితోపాటు ప్రతి చిన్న అవసరానికీ గిరిజనులు రోజూ మక్కినవారిగూడెం వచ్చి చింతలపూడి, జంగారెడ్డిగూడెం వెళ్లాల్సి వస్తోంది. మక్కినవారిగూడానికి తరచూ నడచి రావాల్సి వస్తోంది. బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలి.   – టి.అనురాధ, మాజీ సర్పంచ్, మర్రిగూడెం

మరిన్ని వార్తలు