కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

11 May, 2015 05:13 IST|Sakshi
కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

డిపోల్లో ధర్నాలు, వంటా వార్పు
రొడ్డెక్కిన 421 బస్సులు
ప్రమాదం అంచున ప్రయాణం
పట్టించుకోని జిల్లా యంత్రాంగం

 
 నెల్లూరు (రవాణా) : ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకు 43 శాతం ఫిట్‌మెంట్ పెంచాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఆదివారానికి ఐదో రోజుకు చేరుకుంది. జిల్లాలోని పలు డిపోల్లో ధర్నాలు, రాస్తారోకోలు, వంటా వార్పు నిర్వహించారు. నెల్లూరు ఆర్టీసీ బస్‌స్డాండ్  సెంటర్లో యూనియన్లు జేఏసీ ఆధ్వర్యంలో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఇరువైపులా వాహనాలు కిలోమీటరు పొడవునా నిలిచిపోయాయి.

అనంతరం వంటావార్పు నిర్వహించారు. సమ్మె కారణంగా ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. జిల్లాలో ఆయా డిపోల నుంచి 421 బస్సులు రోడ్డెక్కాయి. పొలీసు పహారాతో డిపోల నుంచి బస్సులను తీసి ఆయా రూట్లకు ఆర్టీసీ అధికారులు పంపించారు. అయితే బస్సులకు తాత్కాలిక డ్రైవర్లు కావడంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగించారు.
 
 ప్రయాణికుల ఆందోళన

 ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు సమ్మెలో ఉండటంతో అధికారులు తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను తిప్పుతున్నారు. వీరికి రూట్లపై అవగాహన లేదు. స్పీడు బ్రేకర్లు, గుంతలు ఉన్న ప్రాంతాల్లో వేగాన్ని తగ్గించకపోవడంతో బస్సులు కుదుపులకు గురవుతున్నాయి. ప్రయాణికలు భయాందోళన చెందుతున్నారు. శనివారం రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. పామూరు నుంచి నెల్లూరు వస్తున్న రెండో డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సంగం - కలిగిరి మధ్య ఆటోను ఢీకొంది. ఆటోలో ఉన్న ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

ఆ సమయంలో బస్సు డ్రైవర్ సెల్‌ఫోన్ మాట్లాడుతున్నాడని ప్రయాణికులు చెబుతున్నారు. అదేవిధంగా బుచ్చిరెడ్డిపాళెం దామరమడుగు వద్ద రాత్రి సమయంలో కడప నుంచి నెల్లూరు వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు. తాత్కాలిక డ్రైవర్ల పనితీరుపై అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కొరవడింది. కేవలం అధికారులు డిపోలకే పరిమితమవుతున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలంటేనే ప్రయాణికులు హడలెత్తి పోతున్నారు.

అధిక చార్జీలతో జేబులు గుల్ల
 తాత్కాలిక డ్రైవర్లు కావడంతో అధికారులు ఆర్టీసీ బస్సులను కేవలం జిల్లా పరిధిలోనే తిప్పుతున్నారు. దూర ప్రాంతాలకు బస్సులను పంపించకపోవడంతో ప్రైవేటు వాహన యజమానులు ప్రయాణికుల జేబులను గుల్ల చేస్తున్నారు. సాధారణ చార్జీకంటే రెండు రెట్లు అధికంగా పెంచి వసూలు చేస్తున్నారు. ఆదివారం కావడంతో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్టణం తదితర ప్రాంతాలకు చార్జీలను అమాంతంగా పెంచేశారు.

బెంగళూరు, హైదరాబాద్‌కు ఏసీ బస్సులో రూ.800 టికెట్‌ను రూ.2400కు, ఆర్డినరీ బస్సులో రూ.500 టికెట్‌ను రూ.1300కు పెంచారు. ఈ రీతిలో ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకుని ప్రయాణికుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నారు. అధిక చార్జీలను నియంత్రించాల్సిన ఆర్టీసీ, రవాణా, పోలీసు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.  ఆదివారం జిల్లాలోని ఆయా డిపోల నుంచి మొత్తం 421 బస్సులు తిరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వాటిలో 313 ఆర్టీసీ, 108 అద్దె బస్సులు ఉన్నాయి.

ఈ బస్సులకు తాత్కాలికంగా 421 మంది డ్రైవర్లు, 108 కండక్టర్లును తీసుకున్నారు. అయితే తాత్కాలిక కండక్టర్లు టెకెట్ కొట్టడం లేదు. సాధారణ చార్జీ కంటే అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి.

సమ్మె కొనసాగిస్తాం
 హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వచ్చినా, మంగళవారం ఎలాంటి తీర్పు ఇచ్చినా సమ్మెను ఆపేది లేదని ఆర్టీసీ యూనియన్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఆదివారం డిపోల ముందు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీలో ఈడీ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల రక్షణతో కార్మికులను అణిచి వేయాలని అధికారులు చూస్తున్నారని ఆరోపించారు. కోర్టు తీర్పు అనంతరం సమ్మెను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు