సడలని సంకల్పం...

11 May, 2015 03:03 IST|Sakshi
సడలని సంకల్పం...

అనంతపురం రూరల్ : ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజురోజుకూ ఉధృతం అవుతోంది. మరోవైపు సమ్మెను అణిచివేసేందుకు ప్రభుత్వ పోలీసు చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా కళ్యాణదుర్గంలో ఒకరు, హిందూపురంలో ముగ్గురు ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదుచేసి అరెస్టు చేశారు. ఫిట్‌మెంట్‌పై స్పష్టత వచ్చే వరకు సమ్మె ఆపేది లేదంటూ కార్మికులు భీష్మిస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మెను ఆపబోమని సీఎం చంద్రబాబు నాయుడు, ఆర్టీసీ యాజమాన్యానికి కనువిప్పు కలిగేలా కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఆదివారం రీజియన్‌లోని 12 డిపోల్లో స్వచ్చభారత్ కార్యక్రమం చేపట్టి నిరసన తెలిపారు. పలు చోట్ల వంటావార్పు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల నేతలు కొండయ్య, సీఎన్ రెడ్డి, పీఎస్ ఖాన్, ఆదాం తదితరుల నేతృత్వంలో స్వచ్చభారత్ చేపట్టి బస్టాండ్‌లోని చెత్తా చెదారాన్ని తొలగించారు. ప్రభుత్వంలోని నిర్లక్ష్యాన్ని చీపురుతో ఊడ్చిపారేయాలని నేతలు నినదించారు.    ఈ నెల 9న రాత్రి ఓ బస్సు అద్దాలు ధ్వంసం చేశారనే ఆరోపణపై కళ్యాణదుర్గంలో కండక్టర్ గణపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

ఉదయం సీఐటీయూ నేత జాఫర్, జేఏసీ నేలు రాయల్ వెంకటేశులు, వైఎస్సార్ టీఎఫ్ అశోక్, ముర్రే నారాయణ కార్మికులకు మద్దతు తెల్పి పోలీసుల వైఖరిని తప్పుబట్టారు. నేతలు డీఎం కిరణ్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. చివరకు సదరు కండక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. హిందూపురంలో శేషారెడ్డి, సంజీవప్ప, రూపేంద్ర అనే ఉద్యోగులను హైయ్యర్, ప్రభుత్వ బస్సు అద్దాలు ధ్వంసం చేశారనే ఆరోపణపై అరెస్టు చేశారు. బస్టాండ్ వద్ద కార్మికులు వంటావార్పుతో నిరసన తెలుపుతుండగా పోలీసులు అడ్డుకున్నారు.

దీనిపై పోలీసుల వైఖరిని నిరసిస్తూ బస్టాండ్, పోలీసు స్టేషన్ ఎదుట కార్మికులు రెండు గంటలపాటు నిరసన తెలిపారు. కదిరిలో నిన్నటి రోజుతో పోల్చితే బస్సులు తక్కువగా నడిపారు. కండక్టర్లు లూటీ చేస్తున్నారన్న కారణంతో యాజమాన్యం డ్రైవర్లు, కండక్టర్లను ఎక్కువ మందిని విధుల్లోకి తీసుకోలేదు. ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి, మడకశిర, పెనుకొండ, పుట్టపర్తి తదితర ప్రాంతాల్లో స్వచ్చభారత్ నిర్వహించి కార్మికులు నిరసన తెలిపారు.

 నష్టపోయిన రూ 5 కోట్ల ఆదాయం
 ఐదు రోజులుగా ఆర్టీసీ సమ్మెతో సంస్థ రీజియన్ వ్యాప్తంగా రూ 5 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ప్రతి రోజూ రూ.ఒక కోటి పది లక్షల ఆదాయం వచ్చేది. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ మరింత నష్టాల్లోకి పోయే ప్రమాదం ఉందని అధికారులంటున్నారు. ఆదివారం రోజున జిల్లా వ్యాప్తంగా 388 బస్సులను నడిపారు. రాత్రి సర్వీసులు పూర్తిగా రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులపై ఆధారపడుతున్నారు.

మరిన్ని వార్తలు