ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో, మానవహారం

13 May, 2015 04:53 IST|Sakshi

పట్నంబజారు(గుంటూరు) : ఏపీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా మంగళవారం ఏడో రోజు ఆర్టీసీ కార్మికులు బస్టాండ్ ఎదుట భారీ సంఖ్యలో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంతో పాటు ఏఐటీయూసీ, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ కార్మికుల ఆందోళనకు మద్దతుగా నిలిచాయి. తొలుత ఆర్టీసీ కార్మికులు, రాజకీయ పార్టీ, కార్మిక సంఘాల నేతలు బస్టాండ్ ఎదుట రోడ్డుపై బైఠాయించారు.

సుమారు 45 నిముషాలకు పైగా మానవహారంగా ఏర్పడడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. మహిళా కార్మికులు చంటి బిడ్డలతో సైతం ఆందోళనలో పాల్గొన్నారు. అనంతరం బస్టాండ్ లోపలికి చేరుకుని భారీ ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ లోపలి నుంచి బయటకు వస్తున్న బస్సులను అడ్డుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు వారిని అడ్డుకుని, శాంతియుతంగా ఆందోళన చేయాలని కార్మిక సంఘాల నేతలకు సూచించారు.

బస్సులను నిలిపిన సమయంలో టైర్లలోని గాలి తీయడానికి యత్నించిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, అనంతరం వదిలిపెట్టారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ అధ్యక్షుడు ఎం.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి, ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఎన్‌వీకే రావు, మందపాటి శంకర్రావు, సీపీఎం, సీపీఐ నగర కార్యదర్శులు భావన్నారాయణ, కోటా మాల్యాద్రి, వెలుగూరి రాధాకృష్ణమూర్తి, నేతాజీ పాల్గొన్నారు.

 ఉధృతమైన సమ్మె
 గుంటూరు రీజయన్ పరిధిలో మంగళవారం పలు చోట్ల బస్సులను కార్మికులు అడ్డుకోవడంతో పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహిం చారు. గత రెండు రోజుల నుంచి కార్మిక సం ఘాలు ఆందోళనలు మరింత ఉధృతం చేశా యి. ఆర్టీసీ అధికారులు కాంట్రాక్ట్, తాత్కాలిక సిబ్బందితో సర్వీసులు పునరుద్ధరించే ప్రయత్నం చేసినా అంతంతమాత్రంగానే తిరిగాయి.

 నేడు నిరసన ప్రదర్శన...
  ఆర్టీసీ కార్మికులు రీజియన్ పరిధిలో నేడు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. 13 డిపోల్లోనూ కళ్ళకు గంతలు కట్టుకుని ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు ఎంప్లాయీస్ యూనియన్ రీజయన్ అధ్యక్షుడు ఎన్‌వీకే రావు తెలిపారు. కార్మిక సంఘాలకు రాజకీయపార్టీలు తోడుగా నిలవనున్నాయి.

మరిన్ని వార్తలు