ఏపీఎన్‌ఆర్‌టీకీ ఆర్‌టీజీఎస్‌ డేటా 

19 Mar, 2019 04:00 IST|Sakshi

డేటా స్కాంలో వెలుగుచూసిన మరో కోణం    

స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ తీసుకున్న యువకులతో సర్వే 

నెట్‌వర్క్‌ అంతా ఏపీఎన్‌ఆర్‌టీ ఆధ్వర్యంలోనే.. 

లోకేష్‌ ఐటీ మంత్రి అయ్యాకే పుట్టుకొచ్చిన ఏపీఎన్‌ఆర్‌టీ 

ఓటర్ల బ్యాంకు అకౌంట్‌లోకి నేరుగా నగదు బదిలీకి ఎత్తులు  

సర్వే బృందాలకు పోలీసుల అండదండలు 

మంగళగిరి (గుంటూరు) : రెండు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన డేటా స్కాం బాగోతంలో రోజుకో అంశం వెలుగుచూస్తుండగా తాజాగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆదివారం రాత్రి సర్వే చేస్తూ పట్టుబడ్డ ఘటనలో మరో కోణం వెలుగుచూసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా యువకులకు ఉపాధి కల్పిస్తున్నామనే ముసుగులో వారితోనూ అక్రమాలకు తెరలేపుతున్నారు. ఇందుకు మంగళగిరిలోని ఏపీఎన్‌ఆర్‌టీ (ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెన్షియల్‌ తెలుగు అసోసియేషన్‌) కేంద్రంగా మారింది. ఈ పేరుతో మంగళగిరితోపాటు విజయవాడ చుట్టుపక్కల ఐటీ మంత్రి లోకేష్‌ అనుచరులు బినామీ పేర్లతో పలు ఐటీ సంస్థలు ఏర్పాటుచేశారు. వీటికి భారీగా సబ్సిడీలు, భూములు ధారాదత్తం చేశారు. కాగా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఆధ్వర్యంలో కొందరు యువకులను ఏపీఎన్‌ఆర్‌టీ సంస్థల్లో చేర్చి వారికి అక్కడ ఐటీ నిపుణులతో శిక్షణ ఇప్పించినట్లు తెలిసింది. ఇలా ఏపీఎన్‌ఆర్‌టీ కేంద్రాల్లో శిక్షణ తీసుకున్న యువకుల్లో కొందరిని ఎంపికచేసి వారితో సర్వేకు నడుం బిగించారు.

వీరిలో ఎక్కువగా ప్రకాశం, రాయలసీమ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలకు చెందిన యువకులున్నారు. వీరందరికీ ట్యాబ్‌లు, ఫోన్లు, వసతి, భోజనం తదితర ఏర్పాట్లు చేసే బాధ్యతను కాంట్రాక్టు కింద లీడర్లకు అప్పగించారు.  ఇదిలా ఉంటే.. ఇప్పటికే ప్రభుత్వం ఆర్‌టీజీఎస్‌ ద్వారా సేకరించిన డేటాను ఏపీఎన్‌ఆర్‌టీకి అప్పగించగా అక్కడ నుంచి లీడర్లకు నియోజకవర్గాలు, బూత్‌ల వారీగా డేటాలున్న ట్యాబ్‌లు అందజేశారు. సర్వేలో ఓటరు ఫోన్‌ నంబర్, ఆధార్‌ కార్డు నంబర్‌ తీసుకోవడంతో పాటు ఓటరు ఏ పత్రిక చదువుతారు.. ఏ టీవీ చూస్తున్నారో సైతం సేకరిస్తున్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లను గుర్తించి వారి ఫోన్, ఆధార్‌ నంబర్లను సేకరించి తద్వారా వారి బ్యాంకు అకౌంట్‌ను గుర్తిస్తున్నారు. వీరికి ఆన్‌లైన్‌లో నగదు జమచేసి ప్రలోభపరచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కాగా, సర్వేలో సేకరించిన వివరాలను ట్యాబ్‌లో ఎంటర్‌ చేసిన వెంటనే ఆ వివరాలు మరో సర్వర్‌తో లింక్‌ అవుతాయి. లింక్‌ అయిన వివరాల ఆధారంగా గూగుల్‌ పే, ఫోన్‌పేల ద్వారా ఓటర్ల అకౌంట్లకు నగదు బదిలీకి రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇదంతా పక్కా ప్రణాళికతో ఐటీ శాఖ మంత్రిగా లోకేష్‌ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జరుగుతోంది. 

ప్రభుత్వ, పోలీసుల అండదండలు
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి మంగళగిరి నియోజకవర్గంలో సర్వే నిర్వహిస్తున్న 10 మంది యువకులను పట్టుకుని ఆధారాలతో సహా పోలీసులకు అప్పగించారు. అయితే, పోలీసులు మాత్రం.. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా పోల్‌ ఒపీనియన్‌ తెలుసుకోవచ్చని, దానిని బహిర్గతం చేయకూడదని మాత్రమే నిబంధనలు ఉన్నాయంటున్నారు. వారిపై కేసు నమోదు చేయలేమని తేల్చిచెబుతున్నారు. సర్వే చేస్తున్న యువకులు సైతం పోలీసులతో ఎలాంటి ఇబ్బంది ఉండదని ధీమాగా ఉన్నారు. అంతేకాక, వీరికి ‘మేం చూసుకుంటాం’ అంటూ నిర్వాహకుల నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. కాగా, ఒపీనియన్‌ పోల్‌ అయితే ఓటరును ఏ పార్టీకి ఓటు వేస్తావని మాత్రమే తెలుసుకోవాల్సి వుండగా ఫోన్, ఆధార్‌ నంబర్లను సేకరించాల్సిన అవసరమేమిటనే దానిపై పోలీసులు నోరు విప్పడంలేదు. దీంతో ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగంగానే జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. మరోవైపు.. వైఎస్సార్‌సీపీ నాయకులు పోలీసులకు అప్పగించిన యువకులను బైండోవర్‌ చేసి వదిలేయడం గమనార్హం. పైగా తమ ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లు తీసుకున్నారని వైఎస్సార్‌సీపీ నేతలపై ఎదురు ఫిర్యాదు చేయాలని స్వయంగా నార్త్‌జోన్‌ డీఎస్సీ ఆ యువకులకు సూచించడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి అధికారుల పర్యవేక్షణలో ఎన్నికలు పారదర్శకంగా జరిగేది అనుమానమేనని పోలీసు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు