దగ్గరవుతున్న పెథాయ్‌ ముప్పు ..

17 Dec, 2018 08:18 IST|Sakshi

సాక్షి, అమరావతి : పెథాయ్‌ తుఫాను వేగంగా కాకినాడ వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) పలు హెచ్చరికలు జారీ చేసింది. తీవ్ర తుపాను కాకినాడ‌కు 200 కిలోమీట‌ర్ల దూరంలో కేంద్రీకృత‌మై ఉందని తెలిపింది. తుపాను తూర్పుగోదావ‌రి జిల్లావైపు వేగంగా క‌దులుతోందని, గంట‌కు 19 కిలోమీట‌ర్ల వేగంతో క‌దులుతున్న తుపాను ఈరోపు మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోపు తుని-యానాంల మ‌ధ్య తీరం దాట‌నుందని వెల్లడించింది. గంట‌కు 100 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన బ‌ల‌మైన గాలుల‌తో పెథాయ్‌ తీరం దాట‌నుందని తెలిపింది. తూర్పుగోదారి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురుస్తాయని.. తూర్పుగోదావ‌రి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయని వెల్లడించింది. తూర్పు గోదావ‌రి జిల్లాల్లో గంట‌కు 110 నుంచి 110 కిలోమీట‌ర్ల వేగంతో బ‌ల‌మైన ఈదురు గాలులు  వీస్తాయని పేర్కొంది.

విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లో గంట‌కు 80 నుంచి 90 కిలోమీట‌ర్ల వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే స‌మ‌యంలో పెనుగాలుల‌తో కూడిన వ‌ర్షం విరుచుకుపడుతుందని తెలిపింది. ప్ర‌జ‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌గా ఉండాలని, అర‌టి రైతులు, ఉద్యానవ‌న రైతులు తగు జాగ్ర‌త్త‌ల్లో ఉండాలని హెచ్చరించింది. వ‌రి, జొన్న‌ త‌దిత‌ర ధాన్యాల‌ను కోసిన‌వారు వాటిని త‌క్ష‌ణం గోదాముల్లో భ‌ద్ర‌ప‌రచాలని సూచించింది. పొలాల్లోనే ఇంకా ధాన్యం ఉంటే దానిపైన టార్పాలిన్ ప‌ట్ట‌లు క‌ప్పి భ‌ద్రప‌ర‌చాలని, వ్య‌వ‌సాయ శాఖ  అధికారుల నుంచి రైతులు టార్పాలిన్‌ పట్టలను పొంద‌వ‌చ్చునని తెలిపింది. గుడిసెల్లో, రేకుల షెడ్డుల్లో నివాస‌ముంటున్న వారిని పున‌రావాస కేంద్రాల‌కు, లోత‌ట్టు ప్రాంత ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు తక్షణమే త‌ర‌లించాలని సూచించింది. తుపాను తీరం దాటే వ‌ర‌కు ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకూడ‌దని, రోడ్ల‌పై వాహ‌నాల్లో తిర‌గ‌రాదు.. చెట్ల కింద త‌ల‌దాచుకోరాదని.. తూర్పు గోదావ‌రి, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, శ్రీకాకుళం ప్ర‌జ‌లు త‌స్మాత్ జాగ్ర‌త్త‌గా ఉండాలని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు