నన్ను చంపేస్తారేమో!

25 Jan, 2019 13:48 IST|Sakshi
పోలీసుల ఎదుట రోదిస్తున్న ఆర్డీఓ ఆఫీస్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ భాను

కన్నీటి పర్యంతమైన ఆర్డీఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌  

టీడీపీ కార్యకర్తలపై కర్నూలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

అది తమ పరిధి కాదని చెప్పిన పోలీసులు

కర్నూలు సీక్యాంప్‌ : ‘‘సార్‌.. నా విధులు నన్ను నిర్వర్తించుకోనీయడం లేదు. అధికార పార్టీ నేతల అనుచరులు నన్ను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. చివరికి నన్ను చంపేస్తారేమో!’’ అని కర్నూలు ఆర్డీఓ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ భాను కన్నీటి పర్యంతమయ్యారు. టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కర్నూలు తాలుకా పోలీసులకు ఆమె గురువారం ఫిర్యాదు చేశారు. చుక్కల భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులు అప్రూవల్‌ కోసం కర్నూలు ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టరేట్‌లోని ఈసెక్షన్‌కు వెళ్తాయి. అక్కడి నుంచి అవి తిరిగి ఆర్డీవో కార్యాలయానికి వస్తాయి. తప్పులు ఉండడం, సరైన ఆధారాలు లేని కారణంగా దరఖాస్తులను ఈ సెక్షన్‌ ఆఫీసర్‌ తిరిగి వెనక్కి పంపుతున్నారు. అయితే ఇవి ఆర్డీఓ కార్యాలయంలోనే ఆగిపోతున్నాయని..కొందరు టీడీపీ కార్యకర్తలు గురువారం సీనియర్‌ అసిస్టెంట్‌ భానుపై చిందులేశారు. ‘‘చాలా రోజులుగా మమ్మల్ని తిప్పుకుంటున్నావ్‌.. ఏంటి నీ బాధ’’ అంటూ   దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఆమె కన్నీటి పర్యంతమవుతూ తాలూకా పోలీసులను ఆశ్రయించారు. దాదాపు గంట సేపు తాలూకా పోలీస్‌స్టేషన్‌లో కూర్చుని తన సమస్య అంతా పోలీసులకు వివరించారు. అయితే ఆర్డీఓ కార్యాలయం తమ పరిధిలోకి రాదంటూ పోలీసులు తప్పుకున్నారు.   

డిప్యూటీ సీఎం అనుచరుల హల్‌చల్‌..
సీనియర్‌ అసిస్టెంట్‌ భాను.. తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారన్న విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అనుచరులు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ స్పెషల్‌ తహసీల్దార్‌ నిత్యానందరాజుపై మండిపడ్డారు. ‘డిప్యూటీ సీఎం చెప్పినా, మంత్రి లోకేష్‌ ఫైల్‌ అని చెప్పినా.. మా పనులు కావడంలేదు’ అని ఆగ్రహించారు. అనంతరం బాధితురాలి వద్దకు వచ్చి..  ‘ మీరేమీ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.. బేతంచెర్లలోని మా పొలం పని అయిపోతే.. మీ నుంచి మాకు సమస్య ఉండబోదు’ అని దరఖాస్తులు తీసుకెళ్లారు. 

>
మరిన్ని వార్తలు