ఉజ్వల చరిత.. వీక్షించేదెలా?

17 Oct, 2019 11:58 IST|Sakshi

సాక్షి, కృష్ణా : ఇక్ష్వాకుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం శిథిలాలు ఇంకా పదిలంగా ఉన్నాయి. క్రీస్తు శకం 3వ శతాబ్దం  నాటి వైభవాన్ని ఈ శిథిలాలు చాటిచెబుతున్నాయి. నాగార్జునసాగర్‌లోని విజయపురిసౌత్‌కు 8కిలోమీటర్ల దూరంలోని అనుపులో ఈ విశ్వ విద్యాలయం ఉంది. ప్రతి రోజూ నాగార్జున సాగర్‌కు వందలమంది సందర్శకులు వస్తున్నా ఈ ఆనవాళ్ల గురించి ఎవరికీ తెలియదు.  కనీసం లాంచీ స్టేషన్‌ సమీపంలో నైనా దీనిగురించి వివరాలు తెలిపే బోర్డులు లేకపోవడం విచారకరం. సాగర్‌ నుంచి బెల్లంకొండవారిపాలెం మీదుగా మాచర్ల వైపునకు ఉన్న రహదారికి కిలోమీటరు దూరం లోపల ఈ ప్రదేశం ఉంది. ఇదే శ్రీపర్వత విహారంగా ప్రసిద్ధి పొందింది.

ఈ విద్యాపీఠంలో ఆనాడు వివిధ దేశాల విద్యార్థులు విద్యనభ్యసించారు. మహాయాన బౌద్ధమత ప్రచారంలో ఈ విశ్వవిద్యాలయం ప్రధాన భూమిక నిర్వహించింది. కృష్ణానది లోయలో కేంద్ర పురావస్తు శాఖ 3700 చదరపు హెక్టార్లలో జరిపిన తవ్వకాలలో ఈ విశ్వ విద్యాలయం శిథిలాలు బయటపడ్డాయి. తరువాత కాలంలో ఈ శిథిలాలను పాత అనుపు వద్ద పునర్నిర్మించారు. 1976కు ముందు ఈ పాత అనుపు నుంచే పర్యాటకశాఖ లాంచీ సర్వీసులు నాగార్జునకొండకు నడిపేవారు. దీంతో అనుపును పర్యాటకులు సందర్శించటానికి సౌకర్యంగా ఉండేది. ఆ తరువాత విజయపురిసౌత్‌(రైట్‌బ్యాంక్‌)కి లాంచీస్టేషన్‌ను మార్చటంతో పాత అనుపు వద్దకు పర్యాటకులు వెళ్లాల్సిన అవసరం రాలేదు. దీంతో ఆ ప్రదేశం నిరాదరణకు గురైంది. దీనిని సందర్శించాలనే ఆపేక్ష ఉన్నా తగిన ప్రయాణ  సౌకర్యం లేకపోవడంతో సాగర్‌కు వచ్చిన పర్యాటకులు దీనిని చూడకుండానే వెళ్లిపోతున్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రస్థానం
ఆచార్య నాగార్జునుడు క్రీ.శ.3వ శతాబ్దంలో ఇక్కడ కృష్ణానదీ లోయలో విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. చారిత్రక ఆధారాలను బట్టి ఈ విహారం ఐదు అంతస్తులు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని పర్వత విహారమని కూడా పిలిచేవారు. ప్రతి అంతస్తులోనూ బుద్ధుని స్వర్ణ ప్రతిమ శిథిలాలు ఆనాటి శిల్పకళకు నిదర్శనంగా నిలిచాయి. బౌద్ధమతానికి చెందిన అనేక గ్రంథాలు రెండవ అంతస్తులో ఉండేవి. చైనా, జపాన్, శ్రీలంక, భూటాన్‌ తదితర వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించేవారు.

ఇక్కడ రసాయన, వృక్ష, ఖనిజ, వైద్య విద్యలను బోధించేవారు. ఇక్కడే ఆచార్య నాగార్జునుడు అపరామృతం కనుగొన్నట్లు ఆధారాలున్నాయి. క్రీ.శ.7వ శతాబ్దంలో హ్యూయాన్‌స్సాంగ్, ఇత్సింగ్‌ ఈ విద్యాలయాన్ని సందర్శించి కొంత కాలం గడిపి మహాయాన బౌద్ధమతం గురించి అధ్యయనం చేశారని చరిత్ర పుటలు చెబుతున్నాయి. నాగార్జునుడి మరణానంతరం కూడా ఈ విశ్వ విద్యాలయం కొన్ని శతాబ్దాల పాటు వర్థిల్లినట్లు ఆదారాలున్నాయి. ఇంత ప్రసిద్ధి చెందిన విశ్వ విద్యాలయం ఆనవాళ్లను సందర్శించేందుకు రవాణా సౌకర్యం లేకపోవటం విచారకరం. కనీసం శని, ఆదివారాల్లోనైనా మాచర్ల డిపో బస్సులను అనుపు ప్రాంతానికి నడిపితే పర్యాటకులు దీనిని సందర్శించటానికి వీలవుతుందని విహార యాత్రికులు కోరుతున్నారు. కనీసం టూరిజం పరిధిలో ఉన్న మినీ బస్సులనైనా ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పర్యాటకులు కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు