ఇన్నాళ్లూ ఏం చేశారో?

19 Feb, 2014 23:20 IST|Sakshi

 చేతినిండా నిధులున్నా.. మురికి కూపాలుగా మారిన రోడ్లు కళ్లముందున్నా ఇన్నాళ్లూ వారికి పట్టలేదు.. ఏ అభివృద్ధి పనీ చేపట్టాలన్న ఆలోచనా రాలేదు.. నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ వస్తుందనగా కళ్లు తెరిచారు. మంత్రిగారి సూచనో, నిధులు వెనక్కి పోతాయన్న భయమో కానీ పనులు ప్రారంభించేయాలని నిర్ణయించారు. అవి పూర్తయినా, కాకపోయినా తర్వాత సంగతి.. ముందు అమాత్యుడితో కొబ్బరికాయ కొట్టించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదీ తాండూరు మున్సిపాలిటీ అధికారుల తీరు.

 త్వరలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు ప్రారంభింపజేసేందుకు తాండూరు మున్సిపల్ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. నిధులున్నా ఇన్నాళ్లూ మిన్నకున్న అధికారులు తీరా నెల రోజుల గడువే ఉండడంతో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. వివిధ పథకాల కింద మంజూరైన నిధులతో మున్సిపాలిటీ పరిధిలోని 31 వార్డుల్లో సీసీ రోడ్లు, మురుగు కాల్వలు తదితర పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తిచేసిన అధికారులు పనుల శంకుస్థాపనల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పనులకు కొబ్బరికాయలు కొట్టించేస్తే.. పనులు ఎప్పటికైనా పూర్తి చేయవచ్చనే ధోరణి వారిలో కన్పిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే జిల్లా మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా పనులకు శంకుస్థాపనలు చేయించాలని అధికారులు యోచిస్తున్నారు.


 ఇందులో భాగంగా రెండు రోజుల్లో మంత్రిని కలిసి అభివృద్ధి పనుల శంకుస్థాపనల తేదీలను ఖరారు చేయనున్నారు. బీఆర్‌జీఎఫ్, స్టేట్‌ఫైనాన్స్ కమీషన్(ఎస్‌ఎఫ్‌సీ), నాన్‌ప్లాన్‌గ్రాంట్ కింద గత ఏడాది నవంబర్‌లోనే సుమారు రూ.రెండు కోట్లు మంజూరయ్యాయి. బీఆర్‌జీఎఫ్ కింద సుమారు రూ.36.6లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో తొమ్మిది పనులకుగాను మూడే మొదలయ్యాయి. ఇంకా ఆరు పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.1.74కోట్ల ఎస్‌ఎఫ్‌సీ నిధులతో 70 పనులు చేయాలి. ఇందులో రూ.34లక్షలతో 26 పనులు జరిగాయి. ఇంకా రూ.1.40కోట్లతో 40 పనులు చేయాల్సి ఉంది. రూ.30లక్షల నాన్‌ప్లాన్‌గ్రాంట్ కింద చేపట్టాల్సిన ఐదు పనులు మిగిలి ఉన్నాయి. ఆయా పనులకు మంత్రి ప్రసాద్‌కుమార్ చేతుల మీదుగా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే శంకుస్థాపనలు చేయించాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. షెడ్యూల్ విడుదలైన తర్వాత నిధులు వెనక్కి వెళ్లే అవకాశం ఉన్నందున  అధికారులు అప్రమత్తమయ్యారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా