ఎన్జీటీ తీర్పు అపహాస్యం!

24 Apr, 2019 03:10 IST|Sakshi

మే 4లోగా ఇసుక స్మగ్లర్ల నుంచి రూ.వంద కోట్లను జరిమానాగా వసూలు చేయాలని ఆదేశం

అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఇసుక స్మగ్లర్లుగా గుర్తింపు

నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైన అధికారులపై ముఖ్యనేత కన్నెర్ర

రాజధాని కోసమే ఇసుకను తరలించారంటూ వత్తాసు

ముఖ్యనేత ఆగ్రహంతో జరిమానా వసూలుకు బ్రేక్‌

కోర్టు ధిక్కరణకు వస్తుందని అధికారుల్లో ఆందోళన

సాక్షి, అమరావతి: ఇసుక స్మగర్లతో ప్రభుత్వ పెద్దలకు ఉన్న అవినాభావ సంబంధం మరోసారి బట్టబయలైంది. కృష్ణా నదిలో విధ్వంసం సృష్టించి, ఇసుకను దోచుకున్న అక్రమార్కుల నుంచి నెలలోగా రూ.వంద కోట్లను వసూలుచేసి జరిమానాగా చెల్లించాలని ఎన్జీటీ (జాతీయ హరిత న్యాయస్థానం) ఈ నెల 4న తీర్పు ఇచ్చింది. మరో 11 రోజుల్లోగా ఎన్జీటీ వద్ద ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అక్రమార్కుల నుంచి జరిమానా వసూలు చేయడానికి సిద్ధమైన గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులపై ముఖ్యనేత కన్నెర్ర చేశారు. దాంతో వారు నోటీసుల జారీని నిలుపుదల చేశారు. కానీ, మే 7లోగా రూ.వంద కోట్లు డిపాజిట్‌ చేయకపోతే ఎన్జీటీ తీర్పును ధిక్కరించినట్లు అవుతుందని.. జరిమానా వసూలుకు నోటీసులు జారీచేస్తే ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోందని అధికార వర్గాలు సతమతమవుతున్నాయి. 

టీడీపీ ఎమ్మెల్యేల గుప్పెట్లో రీచ్‌లు
ప్రభుత్వ పెద్దల దన్నుతో కృష్ణా నదిని గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ముగ్గురు టీడీపీ కీలక ఎమ్మెల్యేలు చెరబట్టారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలో కృష్ణా నదిలోని 37 ఇసుక రీచ్‌లను టీడీపీ ఎమ్మెల్యేలు తమ గుప్పెట్లో పెట్టుకుని.. నదీ పరిరక్షణ చట్టం, పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కి, భారీ యంత్రాలను దించి 20–30 మీటర్ల లోతు వరకూ తవ్వి భారీఎత్తున ఇసుకను అక్రమంగా రవాణా చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే సోదరుడు, అదే జిల్లాకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే, కృష్ణా జిల్లాకు చెందిన మరో సీనియర్‌ ఎమ్మెల్యే ఇసుక అక్రమ రవాణా ద్వారా వేలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టారు.

ఈ వ్యవహారంలో ముఖ్యనేతకూ వాటాలున్నాయి. ఈ నేపథ్యంలో.. కృష్ణా నదిని ధ్వంసం చేస్తుండటంవల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని రాజధాని ప్రాంత రైతు కూలీల హక్కుల సంఘం నేత అనుమోలు గాంధీ.. రామన్‌ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్‌మ్యాన్‌ రాజేంద్రసింగ్‌ ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణా నదీ గర్భంలో సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడానికి కూతవేటు దూరంలో అడ్డగోలుగా ఇసుక తవ్వేస్తుండటాన్ని వారు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎన్జీటీ.. తక్షణమే ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఫిబ్రవరి 23, 2017న రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీచేసింది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాలను నిలిపేయడం కాదు కదా కనీసం నోటీసులకు సమాధానం కూడా చెప్పకపోవడంతో ఎన్జీటీ ఆగ్రహించింది.

రట్టయిన ఇసుక దోపిడీ గుట్టు
ఇసుక అక్రమ రవాణాపై పలుమార్లు నోటీసులు జారీచేసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం ఎన్టీటీ ఒక కమిషన్‌ను ఏర్పాటుచేసింది. ఎన్‌జీటీ న్యాయమూర్తి, కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఈ కమిషన్‌లో సభ్యులు. ఈ కమిషన్‌ కృష్ణా నదిలో.. ప్రధానంగా సీఎం చంద్రబాబు అక్రమంగా నివాసం ఉంటున్న కట్టడానికి కూతవేటు దూరంలో ఉన్న ఇసుక రీచ్‌లను తనిఖీ చేశారు. నదీ గర్భంలోకి భారీ పొక్లెయిన్లను దించి.. 25 మీటర్ల లోతున నదిని తవ్వేసి.. రోజుకు 2,500 లారీల చొప్పున ఇసుకను తరలిస్తున్నట్లు కమిషన్‌ తేల్చింది. పది టైర్ల లారీకి 21 టన్నుల ఇసుక తరలించాల్సి ఉండగా.. 30 నుంచి 40 టన్నులను రవాణా చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన.. దిగువన అడ్డగోలుగా ఇసుక తవ్వేయడంవల్ల బ్యారేజీకి పెనుముప్పు తప్పదని కమిషన్‌ తన నివేదికలో ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నివేదికను పరిశీలించిన ఎన్‌జీటీ.. తక్షణమే ఇసుక అక్రమ తవ్వకాలను ఆపేయాలంటూ ఈనెల 4న ఉత్తర్వులు జారీచేసింది. ఇన్నాళ్లూ ఇసుక అక్రమ తవ్వకాలు సాగించి.. పర్యావరణాన్ని విధ్వంసం చేసినందుకు ప్రతిగా స్మగ్లర్ల నుంచి రూ.100కోట్లను జరిమానాగా వసూలు చేసి నెలలోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ముఖ్యనేత మోకాలడ్డు..
ఎన్జీటీ ఆదేశాల మేరకు ఇసుక స్మగ్లర్లకు నోటీసులు జారీచేసి జరిమానా వసూలుకు కాలుష్య నియంత్రణ మండలి, గనుల శాఖ అధికారులు సిద్ధమయ్యారు. రాజధాని ప్రాంత రైతు కూలీల హక్కుల పరిరక్షణ సంఘం నేతలు, విజిలెన్స్‌ విభాగం అధికారుల సహకారంతో స్మగ్లర్లను గుర్తించే ప్రక్రియను చేపట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలే.. ఇసుక స్మగ్లర్లుగా రూపాంతరం చెందడాన్ని గుర్తించారు. నేడో రేపో నోటీసులు జారీచేస్తారనే సమాచారం అందుకున్న ఇసుక స్మగ్లర్లు ముఖ్యనేత దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. రాజధానిలో రహదారులు, భవనాల నిర్మాణం కోసమే వారు ఇసుకను తీసుకెళ్లారని.. ఎక్కడా అక్రమ రవాణా చేయలేదని.. జరిమానా వసూలుకు మీరెలా నోటీసులు జారీచేస్తారంటూ అధికారులపై ముఖ్యనేత తీవ్ర స్థాయిలో విరుచుకుపడినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్జీటీ ఇచ్చిన తీర్పు గురించి వివరించినా ఆయన వెనక్కు తగ్గలేదు సరికదా మరింత రెచ్చిపోయినట్లు తెలిసింది. దీంతో నోటీసుల జారీ ప్రక్రియను ఆపేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. మే 4లోగా ఎన్టీజీ వద్ద రూ.100 కోట్ల జరిమానాను డిపాజిట్‌ చేయకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని.. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

మరిన్ని వార్తలు