కౌలు రైతుకు రుణార్హత హుళక్కేనా?

7 Jun, 2014 02:39 IST|Sakshi
  • కార్డులున్నా ఫలితం లేదన్నా...
  •  ముందుకురాని బ్యాంకర్లు
  •  సహకరించని భూయజమానులు
  •  రానున్న ప్రభుత్వమైనా కరుణించేనా?
  •  ముదినేపల్లి రూరల్, న్యూస్‌లై న్ : కౌలు రైతుల సంక్షేమమే ధ్యేయమన్న ప్రభుత్వాల ఆర్భాటపు ప్రకటనలు ఆచరణలో అడ్రస్ లేకుండాపోతున్నాయి. వీరికి  గుర్తింపు కార్డులతో వ్యవసాయాన్ని  మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసింపజేస్తామన్న గత ప్రభుత్వ హామీలు నీటి మీద రాత లుగానే మిగిలాయి. త్వరలో అధికారం చేపట్టబోతున్న టీడీపీ ప్రభుత్వం కౌలు రైతుల తలరాతను ఏవిధంగా మారుస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

    కౌలురైతులకు అటు ప్రభుత్వ పరంగా ఇటు భూయజమానుల పరంగా ఎలాంటి సహకామంద డంలేదు. దీంతో అనేక మంది సాగుకు దూరమవుతున్నారు. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు గత ప్రభుత్వం కౌలు రైతులకు గుర్తింపు, రుణార్హత కార్డులు మంజూరు చేసింది. ఈ కార్డులతో సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, బ్యాంకు రుణాలు పొం దవచ్చని ఆశపెట్టింది. ఆచరణలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతోంది.  
     
    బ్యాంకర్ల విముఖత...
     
    ఎలాంటి హామీలేకుండా కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు తీవ్ర విముఖత వ్యక్తం చేస్తున్నారు. లాభార్జనే ధ్యేయంగా పనిచేసే బ్యాంకులు హామీ లేకుండా అప్పు లిచ్చి చేతులుకాల్చుకోవు. ఇది తెలిసినప్పటికీ కౌలు రైతులను వంచించేందుకు రుణార్హత కార్డులను గతప్రభుత్వం జారీ చేసింది. ఈ కార్డులతో బ్యాంకులుచుట్టూ  కాళ్లరిగేలా తిరిగినా అధికారుల ఈసడింపులే తప్ప వీసమెత్తు ప్రయోజనం కలగలేదు.
     
    బీమా ధీమా లేదు...
     
    బ్యాంకులు మంజూరుచేసే పంట రుణాలపై రైతుల నుంచి విధిగా బీమా ప్రీమియం వసూలుచేస్తాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోతే బీమా కంపెనీ పరిహారం చెల్లిస్తుంది. దీని వల్ల బ్యాంకుల రుణాలు సులభంగా వసూలవుతాయి. కౌలురైతులకు మొక్కుబడిగా రుణాలిచ్చినా వీటికి బీమా ప్రీమియం వసూలు చేయడంలేదు. కౌలు రైతులు సాగు చేసే భూమినే యజమాని బ్యాంకులో తనఖా పెట్టి పంట రుణం పొందుతున్నాడు. ఈ సమయంలో బీమా ప్రీమియం చెల్లిస్తున్నాడు. ఈ కారణం వల్ల ఒకే భూమిపై రెండు సార్లు ప్రీమియం ఎలా వసూలు చేస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. అదే విధంగా వడ్డీ రాయితీలు సైతం కౌలు రైతులకు రావడం లేదు.
     
    కార్డులొద్దు బాబోయ్!

     
    కౌలు రైతులకు మూడేళ్ల నుంచి రుణార్హత కార్డులు మంజూరు చేస్తున్నారు. ఒకసారి కార్డు పొందిన రైతు రెండో ఏడాది కార్డు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. కార్డుల వల్ల ప్రయాస తప్ప ప్రయోజనం లేదనే అభిప్రాయానికి కౌలు రైతులు వచ్చినందున కార్డులు తీసుకునేందుకు ముందుకు రావడంలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. నూతన ప్రభుత్వం రుణార్హత కార్డులను మంజూరు చేసి చేతులు దులిపేసుకుంటుందా? లేక వినూత్న మార్పులేమైనా చేపడుతుందో వేచి చూడాల్సి ఉంది.  కౌలు రైతులకు రక్షణ కల్పించాలనే చిత్తశుద్ధి ఉంటే  అదను దాటకముందే సరైన చర్యలు తీసుకోవాలని కౌలు రైతులు కోరుతున్నారు.
     

మరిన్ని వార్తలు