కాంట్రాక్టుల పేరుతో ఘరానా మోసం

30 Apr, 2019 05:41 IST|Sakshi

తప్పుడు డాక్యుమెంట్లతో కోట్లాది రూపాయల వసూలు

ఉద్యోగాలిప్పిస్తానంటూ మోసం

అంతర్‌జిల్లా నిందితుడిని అరెస్ట్‌ చేసిన పోలీసులు

వివరాలు వెల్లడించినడీసీపీ అప్పలనాయుడు

భవానీపురం(విజయవాడ పశ్చిమ): తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లు ఇప్పిసానంటూ పెద్ద మొత్తంలో నగదు వసూలుచేసిన మోసగాడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. లా అండ్‌ ఆర్డర్‌ డీసీపీ–2 అప్పలనాయుడు సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. భవానీపురం నూరి మసీదు వీధికి చెందిన సలాది రామ్‌గోపాల్‌ కొంతకాలంగా నెట్‌ సెంటర్‌ నడుపుతున్నాడు.

తరచూ అక్కడికి వెళ్లే భవానీపురం హెచ్‌బీ కాలనీవాసి బూసా సత్యసూర్యకిరణ్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. తాను గవర్న్‌Ðమెంట్‌ ఆఫ్‌ ఇండియా మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ (న్యూఢిల్లీ) విభాగంలో సెక్షన్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు చెప్పుకొన్నాడు. తాను పనిచేస్తున్న ఆఫీస్‌లో స్వచ్ఛ భారత్‌ కింద జిల్లాలవారీగా మ్యాన్‌పవర్‌ సప్‌లై కాంట్రాక్ట్, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగావకాశాలు ఉన్నట్లు చెప్పి సత్యసూర్యకిరణ్‌ని కాంట్రాక్ట్‌ కోసం టెండర్‌ వేయాలని సూచించాడు.

లక్షల్లో వసూలు
అతని మాయమాటలు నమ్మిన సత్యసూర్యకిరణ్‌ తన స్నేహితులు 15 మందితో కలిసి మొత్తం రూ.52,50,000ను, అతనికి తెలిసిన చిన్న వెంకటేశ్వరరావు వద్ద రూ.29 లక్షలు (స్టేట్‌ వైడ్‌ మెడికల్‌ సప్లై కాంట్రాక్ట్‌ కోసం), చిన వెంకటేశ్వరరావుకు తెలిసిన కండెపు లక్ష్మీపెరుమాళ్లు వద్ద నుంచి రూ.17లక్షలు (జిల్లావారీగా మ్యాన్‌పవర్‌ సప్‌లై కాంట్రాక్ట్‌ కోసం), సంపతి రాజగోపాల్‌ వద్ద రూ.28 లక్షలు (స్టేట్‌ వైడ్‌ మ్యాన్‌పవర్‌ సప్‌లై కాంటాక్ట్‌ కోసం), శ్రీకాంత్‌ దగ్గర రూ.2.50 లక్షలు (అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగం కోసం) మొత్తం సుమారు కోటి రూపాయల వరకు వసూలు చేశాడు. తప్పుడు ధ్రువపత్రాలు, నకిలీ స్టాంప్‌లు చూపించడంతో వారందరూ నమ్మి మోసపోయారు. ఈ నగదు వసూళ్లలో నిందితుడి భార్య సలాది రేవతి, బావమరిది దొడ్డి కిరణ్, డ్రైవర్‌ యాళ్ల రాము సహకరించారు. బాధితులందరూ కలిసి నిందితుడ్ని నిలదీయడంతో న్యూ ఢిల్లీలోని నిర్మల్‌ భవన్‌లో ఇంటర్వ్యూలు ఉన్నాయని చెప్పి గతేడాది అక్టోబర్‌ 24వ తేదీన తీసుకెళ్లాడు.

తర్వాత ఇంటర్వ్యూలు రద్దయ్యాయని, ఆర్డర్స్‌ మీ వద్దకే వస్తాయని నమ్మబలికాడు. ఈ క్రమంలో నవంబర్‌ 29వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో నిందితుడు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన బాధితులను చూసి రామ్‌గోపాల్‌ పరారయ్యాడు. ఈ మేరకు బాధితులు భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేసి నిందితుడికి సహకరించిన సలాది రేవతి, దొడ్డి కిరణ్, యాళ్ల రాములను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి కొంత బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రధాన నిందితుడు రామ్‌గోపాల్‌ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్న నేపథ్యంలో సోమవారం వన్‌టౌన్‌ శివాలయం వీధిలో తిరుగుతుండగా అరెస్ట్‌చేశారు.

విచారణలో తేలిందేంటంటే..
2006లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వెంకటనారాయణ అనే వ్యక్తిని నమ్మి మోసపోయిన రామ్‌గోపాల్‌.. తాను కూడా అలాగే ప్రజలను మోసం చేశాడు. విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలు, విజయనగరం జిల్లాల్లో మకాంలు మారుస్తూ కోట్లాది రూపాయలు వసూలు చేశాడు. అతనిపై ఆయా ప్రాంతాల్లో 22 కేసులు నమోదయ్యాయి.

విజయవాడ భవానీపురం, సత్యనారాయణపురం, పెనమలూరు, పటమట, కృష్ణలంక, తదితర పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. నిందితుని వద్ద నుంచి 272 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు, కారు, బైక్, ల్యాప్‌టాప్, నాలుగు సెల్‌ఫోన్లు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకాలు, నకిలీ స్టాంపులు, ధ్రువపత్రాలు, అగ్రిమెంట్‌ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో వెస్ట్‌ ఏసీపీ సుధాకర్, భవానీపురం సీఐ డీకెఎన్‌ మోహన్‌రెడ్డి, ఎస్‌ఐ చినస్వామి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు