ఉపాధి సిబ్బందితో సెల్‌గాటం

8 Nov, 2017 11:11 IST|Sakshi

శాంసంగ్‌ డీలర్‌గా మారిన గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌!

‘ఉపాధి’ సిబ్బందికి శాంసంగ్‌ జే2ప్రో కట్టబెడుతున్న వైనం  

ప్రతిఒక్కరూ కచ్చితంగా కొనాలంటూ ఆదేశాలు

వేతనం నుంచి నెలకు రూ.900 కోత

గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌ శాంసంగ్‌ మొబైల్‌ ఫోన్ల వ్యాపారం ప్రారంభించిందా? ఉపాధి హామీ పథకం సిబ్బంది వద్దంటున్నా బలవంతంగా పాత స్మార్ట్‌ఫోన్లను అంటగట్టే ప్రయత్నాలు ప్రారంభిం చిందా? స్మార్టు ఫోన్లు ఉన్నా మళ్లీ కొనాల్సి వస్తోందని ఉపాధి హామీ పథకం సిబ్బంది వాపోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఉపాధి పథకం సిబ్బంది వద్ద ఇప్పటికే స్మార్టు ఫోన్లు ఉన్నా అంతగా ఫీచర్లు లేని ఫోన్లను బలవంతంగా అంటగట్టడం ఇందుకు నిదర్శనం.

సాక్షి, మచిలీప్నటం: రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తయింది. పథకంలో పారదర్శకత కోసం 8 ఏళ్లుగా కూలీల హాజరు, పని కొలతల నమోదు, కూలి చెల్లింపును ఆన్‌లైన్‌లో చేపడుతున్నారు. ఇందు కోసం క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలు కార్యాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ అధునాతన టెక్నాలజీతో కూడిన ఆండ్రాయిడ్‌ స్మార్టు ఫోన్లను వినియోగిస్తున్నారు. 2006లో పథకం ప్రారంభం సమయంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పథకం సిబ్బందికి సాధారణ ఫోన్లు ఉచితంగా అందజేసింది. ఆన్‌లైన్‌ చెల్లింపులు ప్రారంభమవడంతో నాలుగేళ్ల క్రితం రూ.6,700 విలువైన శాంసంగ్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్లు అందజేసింది. ఫోన్‌ ధరలో 50 శాతం సిబ్బంది చెల్లిస్తే, మిగిలిన మొత్తం గ్రామీణాభివృద్ధి భరిస్తుందని మొదట్లో చెప్పినా ఆ మొత్తాన్ని కూడా సిబ్బంది వేతనం నుంచే వసూలు చేశారు.

వద్దన్నా ఫోన్లు
సెల్‌ఫోన్‌ కంపెనీల మధ్య పోటీ నేపథ్యంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సరికొత్త ఫీచర్లతో మొబైల్‌ ఫోన్లు చౌకధరలకే లభిస్తున్నాయి. ఉపాధి సిబ్బంది కూడా రూ.10 వేలకు పైగా విలువైన లేటెస్ట్‌ మోడల్‌ స్మార్ట్‌ఫోన్లతో రోజువారీగా కూలీల హాజరు, కొలతలు, జీపీఎస్‌ ద్వారా క్షేత్రస్థాయి నుంచే ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ వెబ్‌సైట్‌కు అప్‌లోడ్‌ చేస్తున్నారు. క్షేత్రస్థాయి ఫీల్డ్‌ అసిస్టెంట్లతో పాటు మేట్లు కూడా వీటినే వినియోగిస్తున్నారు. ఈ నేథ్యంలో ఇటీవల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సరఫరా చేసే స్మార్ట్‌ ఫోన్లు ఎవరికి కావాలంటూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్‌ నుంచి ఉపాధి సిబ్బందిని అడిగారు. 80 శాతం మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది తమకు అవసరం లేదని స్పష్టం చేశారు.

అయితే రాష్ట్రంలోని అన్ని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్‌ కార్యాలయాలకు పాతబడిన శాంసంగ్‌ జే2 ప్రో మొబైల్‌ పార్శిళ్లు వచ్చిచేరాయి. జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖలో ఏపీడీ, పీఓ, టెక్నిలక్‌ అసిస్టెంట్స్, సీనియర్‌ మేట్లు కలిపి 1035 మంది ఉన్నారు. వారందరికీ రూ.93 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇప్పటికే 80 శాతం ఫోన్లను ఎంపీడీఓ కార్యాలయాలకు సరఫరా చేశారు. కొంత మంది సిబ్బందికి సైతం పంపిణీ చేశారు. మిగిలిన వారికి రెండు మూడు రోజుల్లో అందజేయనున్నారు. సిబ్బంది అప్పుగా ఫోన్లు ఇచ్చి, నెలకు రూ.900 చొప్పున జీతంలో కోత విధించనున్నారు.

పాత ఫోన్లకు అధిక ధర
శ్యాంసంగ్‌ జే2 ప్రో మోడల్‌ పాతబడింది. ప్రస్తుతం సరికొత్త జే7 మోడల్‌ మార్కెల్లో లభిస్తోంది. ఈ ఫోన్ల కంటే ఎక్కువ ఫీచర్స్‌ ఉన్న వీవో, అప్పో ఫోన్లు చౌకగా లభిస్తున్నాయి. ఆ కంపెనీలతో పోల్చితే శాంసంగ్‌ బ్యాటరీ లైఫ్, ఫీచర్స్‌ కూడా తక్కువే. అమెజాన్‌ వంటి ఆన్‌లైన్‌ సంస్థ రూ.8,470 రూపాయలకే విక్రయిస్తున్న జే2 ప్రో ఫోన్‌ను రూ.9080కు అంటగడుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26,786 మందికి అంటగట్టేందుకు రూ.24.32 కోట్లు వెచ్చించి ఫోన్లుకొన్నారు. ఇన్ని ఫోన్లు కొంటే ఆన్‌లైన్‌ ధరకంటే తక్కువకే రావాలి. అయితే ధర అంతకు విరుద్ధంగా ఉంది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల పాత్ర దాగుందని, ఇందులో భాగంగానే తమ కమీషన్ల కోసం సిబ్బందిని పావులుగా వాడుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు