రైతులకు ప్రేమతో..!

28 Aug, 2018 10:42 IST|Sakshi
పవన్‌ తయారు చేసిన సోలార్‌ స్ప్రేయర్‌ , సోలార్‌ స్ప్రేయర్‌తో బీర తోటలో మందు పిచికారీ చేస్తున్న పవన్‌

అగ్రికల్చర్‌ సోలార్‌ స్ప్రేయర్‌ను తయారు చేసిన పవన్‌

ఎలాంటి కష్టం లేకుండా క్రిమిసంహార మందుల పిచికారీ

పాత స్ప్రేయర్లకు సోలార్‌ ప్యానెల్‌ను అమర్చుకోవచ్చు

త్వరలో రైతులకు అందుబాటులోకి..

పలమనేరు  :తన ప్రయోగాల ద్వారా ఎంతోపేరుప్రఖ్యాతలు గడించిన గ్రామీణశాస్త్రవేత్త పవన్‌ మరో వినూత్నప్రయోగాన్ని చేపట్టాడు. చీడపీడలనివారణకు క్రిమి సంహారక మందులను కొట్టే స్ప్రేయర్‌ను సోలార్‌తో పనిచేసేలా తయారుచేశాడు. పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన పవన్‌ ఇప్పటికే వందకు పైగా ప్రయోగాలు చేసి ప్రజలకుఅవసరమైన కొత్త వస్తువులను తయారు చేశాడు. కేవలంఏడో తరగతి చదువుకున్న ఇతడుకొత్త ఆవిష్కరణల ద్వారాకీర్తి గడిస్తున్నాడు.

తండ్రి కష్టం చూసి..
పలమనేరుకు చెందిన పవన్‌ సోలార్‌ స్ప్రేయర్లు తయారు చేసి తన ప్రత్యేకతను చాటుకుంటు న్నాడు. ఇతని తండ్రి సుబ్బన్న టమాట, మునగ, బీర తదితర పంటలను సాగుచేస్తున్నాడు. ఈ పంటలకు క్రిమి సంహార మందులను పిచికారీ చేయాలంటే కాలుతో తొక్కే స్ప్రేయర్లను వాడేవారు. దీనికోసం ఒకరు స్పేయర్లను కాలితో తొక్కాలి, ఇంకొకరు పైపును పట్టుకోవాలి, మరొకరు స్ప్రే చేయాలి. ఒకరు నీటిని తీసుకురావాలి. సొంత కుటుంబీకులుంటే పర్వాలేదుగానీ కూలీలతో సేద్యం చేసేవారికి ఈ పని చేయాలంటే నలుగురు కూలీల అవసరం పడుతుంది. ఇందుకోసం కూలీకి రూ.300 చొప్పున రూ.1200 ఇవ్వాల్సిందే. మరికొన్నాళ్లకు చేతితో ప్రెస్‌చేస్తూ మందును పిచికారీ చేసే స్ప్రేయర్లు వచ్చాయి. ఇది వాడేవారికి ఓ వైపు చేయి విపరీతంగా నొప్పి వస్తుంది. ఆపై పెట్రోలుతో నడిచే స్ప్రేయర్లు వచ్చాయి. దీని ఇంజిన్‌ చాలా బరువుగా ఉంటుంది. వీపుపై మోయడం భారంగా ఉంటుంది. పెట్రోలు ఖర్చు అదనం. ఆ తర్వాత ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌తో నడిచే స్ప్రేయర్లు వచ్చాయి. వీటిధర ఎక్కువగా ఉండడంతో పేదరైతులకు కష్టసాధ్యమే. తన తండ్రి పడుతున్న కష్టాలను చూసిన పవన్‌ సోలార్‌తో పనిచేస్తూ ఎక్కువ బరువులేకుండా సౌకర్యవంతంగా ఉండే స్ప్రేయర్‌ను తయారు చేయాలనే తలంపుతో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేశాడు.

కేవలం రూ.1800తోనే..
20లీటర్ల స్ప్రేయర్‌కు వెనుకవైపు ఓ సోలార్‌ ప్యానెల్‌ను అమర్చాడు. దీనికి ఓ కంట్రోల్‌ యూనిట్, స్ట్రక్చర్‌బోర్డు, ఆన్,ఆఫ్‌ స్విచ్‌ విత్‌ ఇండికేటర్స్‌ పెట్టాడు. రైతు పొలంలో తిరుగుతూ మందును పిచికారీ చేస్తుంటే వెనుకనున్న సోలార్‌ ఎండకు చార్జ్‌ అవుతూ ఉంటుంది. సోలార్‌ చార్జ్‌ ఫుల్‌ అవగానే మిగిలిన శక్తిని స్టోర్‌కూడా చేసుకుంటుంది. ఇందుకోసం ఆటోకట్‌ఆఫ్‌ను అమర్చాడు. చార్జింగ్‌ ఎంతఉందో తెలుసుకునేందుకు ఎరుపు, పచ్చ ఎల్‌ఈడీలను సెట్‌ చేశాడు. దీంతో పెట్రోలు, కరెంటుతో పనిలేకుండా సున్నా పెట్టుబడితో పని జరిగినట్టే. ఇప్పటికే స్ప్రేయర్లున్న వాటికి కేవలం రూ.1800 ఖర్చుతో దీన్ని అమర్చుతున్నాడు.

రైతులకు అందుబాటులోకి తెస్తా
పంటలకు మందు కొట్టడానికి మా నాన్న పడిన కష్టాలను ప్రత్యక్ష్యంగా చేశాను. సులభంగా ఏదైనా చేయాలనే ఆలోచనతో వారం రోజుల్లో దీన్ని తయారుచేసి ప్రయోగాత్మకంగా చూశా. అన్ని సక్రమంగా పనిచేయడంతో ఓ యంత్రాన్ని మా తండ్రికిచ్చా. ఇప్పుడు ఆయన చాలా తేలిగ్గా తోటకు క్రిమిసంహాకర మందును పిచికారీ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. వీటని ప్రతిరైతుకు అందుబాటులోకి తేవాలన్నదే నా లక్ష్యం. ఇందుకు సంబంధించి ఏవైనా అనుమానాలుంటే రైతులు నా సెల్‌ నెం: 9959845143కు సంప్రదించవచ్చు.–పవన్, గ్రామీణశాస్త్రవేత్త,మొరం, పలమనేరు

మరిన్ని వార్తలు