రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభం

20 Jan, 2014 23:57 IST|Sakshi

సాక్షి, గుంటూరు: జిల్లా అంతటా సోమవారం నుంచి 25వ రహదారి భద్రతా వారోత్సవాలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లా పరిషత్‌లో ఉదయం 9.15 గంటలకు రవాణా శాఖ అధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ సురేశ్‌కుమార్ పాల్గొని భద్రతా వారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారం రోజుల పాటు జిల్లా అంతటా నిర్వహించే వారోత్సవ కార్యక్రమాలు, అవగాహన సదస్సుల గురించి రవాణా శాఖ ఉప కమిషనర్ డాక్టర్ వడ్డి సుందర్ కలెక్టర్‌కు వివరించారు.

అనంతరం స్థానిక హిందూ కళాశాల చౌరస్తాలో రవాణాశాఖ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఏర్పాటు చే సిన ఆటో డ్రైవర్ల అవగాహన సదస్సులో అర్బన్, రూరల్ ఎస్పీలు గోపీనాథ్ జెట్టి, సత్యనారాయణలు పాల్గొని జెండా ఊపి వారోత్సవాలను ప్రారంభించారు.

    {sాఫిక్ డీఎస్పీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో అర్బన్ ఎస్పీ గోపీనాథ్ ప్రసంగించారు. వాహనాలను నడిపే డ్రైవర్లకు ఏకాగ్రత ప్రధానమన్నారు. పెరుగుతోన్న జనాభాకు సమాంతరంగా పెరిగే వాహనాల రాకపోకలకు అనుకూలంగా రోడ్ల విస్తరణ జరగాలన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన డ్రైవర్ల పిల్లలకు ఉపకారవేతనాలు అందించే సంప్రదాయాన్ని కొనసాగిస్తామన్నారు.

     గుంటూరు నగరంలో చేపట్టిన విజన్ జీరో, ఆపరేషన్ స్పీడ్ బైక్, ఆపరేషన్ నంబర్ ప్లేట్స్ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. మద్యం తాగి వాహనాలను నడపడం నేరమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలన్నారు.

     నేరాల సంఖ్య తగ్గుతుండగా, రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని రూరల్ ఎస్పీ సత్యనారాయణ అన్నారు. ఇంటి యజమాని మరణిస్తే ఆయా కుటుంబాలు ఎంతగా విలపిస్తాయో గుర్తించాలన్నారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు.

 పోలీస్, ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులు సంయుక్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలను విజయవంతం చేయాలని రవాణాశాఖ ఉపకమిషనర్ డాక్టర్ వడ్డి సుందర్ సూచించారు. వారోత్సవాలను వారం రోజులకే పరిమితం చేయకుండా ఏడాది మొత్తం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

 ఈ సందర్భంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు, స్టిక్కర్లను రూరల్ ఎస్పీ సత్యనారాయణ ఆవిష్కరించారు. ఆటో డ్రైవర్లు వీటిని వాహనానికి వెనుక అతికించి విస్తృత ప్రచారం కల్పించాలని ట్రాఫిక్ డీఎస్పీ సుబ్బారెడ్డి కోరారు.

 ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ జానకి, డీఎస్పీలు మధుసూదనరావు, నర్సింహ, రవీంద్రబాబు, లావణ్యలక్ష్మి, ఆర్టీవో చందర్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు శివనాగేశ్వరరావు, సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ జోషి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు