బ్లూఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ రేసులో రుషికొండ బీచ్‌

10 Mar, 2020 11:51 IST|Sakshi
గడ్డితో చేసిన గొడుగు కింద సేదతీరేలా ఏర్పాటు

 పర్యావరణహితంగా విశాఖ సాగరతీరం

 రూ.7.35 కోట్లతో ముమ్మరంగా పనులు

 600 చదరపు మీటర్ల మేర అభివృద్ధి

 దేశవ్యాప్తంగా 13 బీచ్‌లను ఎంపిక చేసిన కేంద్రం

సాక్షి, విశాఖపట్నం: అందాల విశాఖ సాగరతీరం పర్యావరణహిత బీచ్‌గా సందర్శకులను అలరించేందుకు ముస్తాబవుతోంది. మూడు దశాబ్దాల తర్వాత దేశంలో బ్లూఫ్లాగ్‌ ప్రాజెక్టుకు ఎంపికైన 13 బీచ్‌ల్లో రుషికొండ తీరం చోటు సాధించింది.  (చదవండి: త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్)

బ్లూఫ్లాగ్‌ బీచ్‌ అంటే...?
బ్లూఫ్లాగ్‌ బీచ్‌లు అంటే కాలుష్యం దరిచేరని పూర్తిగా పర్యావరణ అనుకూల సాగర తీరాలు. డెన్మార్క్‌కి చెందిన ఫౌండేషన్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఈఈ) 1987 నుంచి బ్లూఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ అందిస్తోంది. ఇప్పటివరకు 46 దేశాల్లో 4,500 బీచ్‌లు ఈ సర్టిఫికెట్‌ పొందాయి. తొలిసారిగా భారత్‌కు చెందిన 13 బీచ్‌లు ఇందుకు అర్హత సాధించాయి. బ్లూఫ్లాగ్‌ గుర్తింపు ఉన్న బీచ్‌లకు విశేష ఆదరణతోపాటు విదేశీ పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సర్టిఫికెట్‌ దక్కాలంటే బీచ్‌ పరిసరాలు పరిశుభ్రంగా, నీరు కలుషితం కాకుండా, రసాయనాలు దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

సర్టిఫికెట్‌  ఇస్తారిలా..
బ్లూఫ్లాగ్‌ ధ్రువపత్రం పొందాలంటే నాలుగు విభాగాల్లోని 33 అంశాల్లో బీచ్‌ని అభివృద్ధి చేయాలి.  మలినాలు, వ్యర్థాలు ఉండకూడదు. ప్రాజెక్టు పనులు పూర్తయిన అనంతరం ఎఫ్‌ఈఈ ప్రతినిధులు ఎక్కడైనా ఒకచోట ఒక చదరపు అడుగులో ఇసుకని తవ్వి నాణ్యత పరిశీలిస్తారు. నీటి నాణ్యతని కూడా పరిశీలించి సంతృప్తి చెందితే సర్టిఫికెట్‌ ఇస్తారు. బీచ్‌లో బ్లూఫ్లాగ్‌ (నీలం రంగు జెండా) ఎగురవేస్తారు.

80% పనులు పూర్తి
బ్లూఫ్లాగ్‌ ప్రాజెక్టు కింద రుషికొండ బీచ్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.7.35 కోట్లు కేటాయించింది. వీటితో పనులు ప్రారంభించారు.ఇటీవల విశాఖలో బ్లూఫ్లాగ్‌ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఇక్కడ జరుగుతున్న పనుల్ని నిపుణుల బృందం పరిశీలించింది. 80 శాతం పనులు పూర్తైనట్లు ధృవీకరించారు. 600 చదరపు మీటర్ల మేర బ్లూ ఫ్లాగ్‌ బీచ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. (బాబాయ్‌ ఇలా మాట్లాడతారా; సంచయిత భావోద్వేగం..)

బ్లూఫ్లాగ్‌ ఎగరేస్తాం..
‘రుషికొండ బీచ్‌ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నాం. బ్లూఫ్లాగ్‌ బీచ్‌ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించాం. పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుతూ సముద్ర జలాల్లో ఎలాంటి రసాయనాలు కలవకుండా చర్యలు తీసుకుంటున్నాం. తీరంలో ఇసుకని ఎప్పటికప్పుడు శుభ్రం చేయిస్తున్నాం. రెండు ఆధునిక యంత్రాల ద్వారా పనులు నిర్వహిస్తున్నాం. జూన్‌లో బ్లూఫ్లాగ్‌ బృందం బీచ్‌ను పరిశీలించే అవకాశం ఉంది. రుషికొండ బీచ్‌లో కచ్చితంగా బ్లూఫ్లాగ్‌ ఎగరేసేందుకు యంత్రాంగమంతా కలిసికట్టుగా పని చేస్తున్నాం’
– పూర్ణిమాదేవి, బ్లూఫ్లాగ్‌ నోడల్‌ అధికారి

పర్యావరణహితంగా నిర్మితమైన టాయిలెట్లు

సదుపాయాలివీ..
► బీచ్‌లో మౌలిక సదుపాయాలన్నీ పర్యావరణ హితంగా వెదురుతో నిర్మిస్తున్నారు. త్రిపుర నుంచి తెచ్చిన వెదురు 10 ఏళ్ల పాటు పాడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఖపర్యాటకులు ఇసుక తిన్నెల్లో కూర్చొని సేదతీరేలా బెంచ్‌లతో పాటు గడ్డి, వెదురు పుల్లలతో గొడుగులు ఏర్పాటు చేశారు. వీటి కింద కూర్చోవడం వల్ల చల్లటి వాతావరణంలో పర్యాటకులు ఆహ్లాదంగా గడుపుతారు.
► ఎక్కడా మలినాలు, చెత్త లేకుండా 25 మంది సిబ్బందితో బీచ్‌ మొత్తం ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు.

► విద్యుత్‌ కోసం సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. 40 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్‌ నుంచి 35 కేవీ విద్యుత్‌ని ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్నారు. బీచ్‌లో ఏర్పాటు చేసిన 70 ఎల్‌ఈడీ విద్యుత్‌ బల్బులకు సోలార్‌ పవర్‌నే వాడుతున్నారు.
► బీచ్‌ పరిరక్షణ కోసం 10 మంది రక్షణ సిబ్బందిని నియమించారు. బీచ్‌లో ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ముగ్గురు పర్యవేక్షకుల్ని ఏర్పాటు చేశారు. 55 సీసీ కెమేరాలతో నిరంతరం నిఘా పెట్టారు.
► బీచ్‌లో చెత్త నుంచి ఎరువు తయారు చేసేందుకు సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ యూనిట్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉత్పత్తి చేసే ఎరువుల్ని మొక్కల పెంపకానికి వినియోగించనున్నారు.
► మరుగుదొడ్లకి వినియోగించే నీటిని పునర్వినియోగించేలా గ్రేవాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు.

రుషికొండ బీచ్‌లో ఏర్పాటయ్యేవి
⇒ రెండు వైపులా పార్కింగ్‌
⇒ 2 చోట్ల లైఫ్‌గార్డులు, వాచ్‌టవర్‌
⇒ 8 ఓపెన్‌ షవర్లు, 6 దుస్తులు మార్చుకునే గదులు
⇒ పిల్లల పార్క్‌
⇒ వ్యాయామ పరికరాలు
⇒ కూర్చునేందుకు 11 బెంచీలు
⇒ జాగింగ్‌ ట్రాక్‌
⇒ బీచ్‌ సమగ్ర సమాచారం తెలిపే బోర్డు
⇒ 8 మరుగుదొడ్లు
⇒ మురుగు నీటి నిర్వహణ, గ్రేవాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లు
⇒ సౌర విద్యుత్తు ప్లాంట్‌
⇒ సేఫ్‌ స్విమ్మింగ్‌ జోన్‌
⇒ రాకీ ప్యాచ్‌
⇒ 16 చోట్ల సిట్‌అవుట్‌ అంబ్రెల్లా విత్‌ రిక్‌లైనర్‌
⇒ వాటర్‌ శాంప్లింగ్‌ పాయింట్‌
⇒ ఏపీటీడీసీ ఫుడ్‌ కోర్టులు
⇒ ఏపీటీడీసీ బోటింగ్‌ కార్యాలయం
⇒ యాంఫిబియాస్‌ వీల్‌ చెయిర్లు
⇒ దేవాలయం
⇒ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు