రైతు భరోసా పెట్టుబడి సాయం పెంపు

14 Oct, 2019 14:58 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రైతన్నలకు మరో వరం ప్రకటించారు. మంగళవారం రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌.. రైతుల పట్ల తనకు ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతున్నట్టు సీఎం వైఎస్‌ జగన్ తెలిపారు. రైతు భరోసా అమలును నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. దీంతో ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ. 67,500 పెట్టుబడి సాయం రైతులకు అందనుంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు అదనంగా రూ. 17,500 పెట్టుబడి సాయం లభించనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి రూ. 5,510 కోట్ల నిధుల విడుదల చేసింది.

ప్రతి ఏడాది మూడు విడతల్లో రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని అందజేయనున్నారు. మే నెల ఖరీఫ్‌లో రూ. 7,500, రబీ అవసరాల కోసం రూ. 4,000, సంక్రాంతి సమయంలో రూ. 2,000ను పెట్టుబడి సాయం రైతు భరోసా పథకం కింద పంపిణీ చేస్తారు. కాగా, రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15వ తేదీన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. అ తర్వాత కౌలు రైతులకు  కార్డులు పంపిణీ చేస్తారు. అనంతరం రైతులకు రైతు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. ఈ పథకానికి వైఎస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజనగా నామకరణం చేశారు. 

>
మరిన్ని వార్తలు