సాక్షర భారత్ నిధులు స్వాహా

26 Aug, 2014 02:56 IST|Sakshi

 ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మండలంలో సాక్షర భారత్ నిధులు స్వాహా అయ్యాయి.  సాక్షర భారత్ మండల కో-ఆర్డినేటరు శంకర్‌నారయణ దొంగ సంతకాలు చేసి సుమారు రూ.19,35,480లను స్వాహా చేసినట్లు  తెలుస్తోంది.  ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, గ్రామ కార్యదర్శులకు సంబంధం లేకుండానే  నేరు చెక్కులను బ్యాంకులలో డ్రా చేసుకుని   నిధులను స్వాహా చేసినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం  సాక్షర భారత్ కో  ఆర్డినేటర్‌గా శంకర్‌నారాయణ నియమితులయ్యారు.

మొదట్లో ఇతని ప్రవర్తనపై అనుమానం రావడంతో జిల్లా స్థాయి అధికారులు విచారణ చేపట్టారు. ఆ సమయంలో రూ. 1.45 లక్షలు  స్వాహా చేసినట్లు బయటపడింది. ఆ డబ్బును అతని నుంచి రికవరీ చేశారు. మళ్లీ విచారణ చేయడంతో  పెద్ద మొత్తంలో నిధులను స్వాహా చేసినట్లు తెలుస్తోంది.  గత ఏడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్య కాలంలో  శంకర్ నారాయణ సుమారు రూ.19,35,480లను డ్రా  చేశారు.
 
 ఈ విషయం బయటకు పొక్కకుండా రిక వరీ చేయాలని అధికారులు భావించారు. అంత డబ్బు తన వద్ద లేదని శంకర్‌నారాయణ చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. ఆడిట్ ఉందని చెప్పి మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శుల  నుంచి చెక్కు బుక్‌లు తీసుకున్నట్లు తెలుస్తోంది.  గత ఏడాది ఆగస్టు నుంచి చెక్కులను  డ్రా చేస్తూ  వచ్చాడు. ప్రభుత్వ చెక్కుల ద్వారా పది వేలు లోపు మాత్రమే డ్రా చేయాల్సి ఉంది.  ఇతను మాత్రం ఒక్కొక్క చెక్కు నుంచి రూ.35వేలు కూడా డ్రా చేసినట్లు  సమాచారం. ఎస్‌బీఐ అధికారులకు కూడా ఇందులో భాగం ఉన్నట్లు గ్రామ కార్యదర్శులు ఆరోపిస్తున్నారు.     
 
 సాధారణంగా  సాక్షర భారత్ నుంచి చెక్కులు డ్రా చేయాలంటే ఈఓపీఆర్డీ, గ్రామ కార్యదర్శి, ఎంపీడీఓ సంతకాలు ఉండాలి.  వీరి సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై  కలెక్టర్‌కు ఫిర్యాదు  చేస్తామని గ్రామకార్యదర్శులు పేర్కొంటున్నారు.  ఈ విషయంపై ఎంపీడీఓ జయసింహను వివరణ కోరగా ఈ  విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.  దీనిపై విచారణ  చేస్తున్నామన్నారు.  ఎన్నికల సమయంలో తాను ఇక్కడ లేనని ఆ సమయంలో  ఇది జరిగిందన్నారు.

మరిన్ని వార్తలు