‘కంచె’లేని భద్రత!

28 Nov, 2015 02:54 IST|Sakshi

 సబ్‌జైలు అంతర్గత భద్రతపై అనుమానాలు
 రక్షణగోడకు పూర్తిగా లేని పెన్షింగ్
 సివిల్ పోలీసుల పాత్ర ఎంతవరకు..?

 నేరాలకు అలవాటుపడి..జైలు గదులు రుచించక చాకచక్యంగా పరారైన రిమాండ్ ఖైదీ
 బొబ్బిలి :
నిత్యం ‘మత్తు’కు అలవాటు పడిన 25 ఏళ్ల యువకుడు... గంజాయి కోసం ఎటువంటి పని చేయడానికైనా వెనుకాడని నైజం.. తల్లిదండ్రులు పేదరికంలో ఉండడంతో బయట తిరుగుళ్లకు అలవాటు పడి, ఆలయాల బయట గంజాయి సేవించి రాత్రంతా మత్తులోనే జోగేవాడు. చివరికి ఓ దోపిడీ కేసులో కటకటాలపాలయ్యాడు. అలాంటి వ్యక్తికి జైలు శిక్ష రుచించలేదు.. రోజంతా బందీఖానాలో ఉండడం.. ధూమపానం, గంజాయి వంటివి అందుబాటులో లేకపోవడంతో ఎలాగైనా బయట పడాలని ప్లాన్ వేశాడు.. అనుకున్న ప్రణాళికను తు.చ. తప్పకుండా పక్కాగా అమలు చేసి, జంప్ అయ్యాడు. ప్రస్తుతం ఇటు జైలు శాఖ సిబ్బందికి, అటు పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు ఒడిషా రాష్ర్టం జైపూర్‌కు చెందిన ధనురాన అలియాస్ బడాపెట్టు (ఖైదీ నంబర్ 2576).
 
 నేరాలే అతని వృత్తి..
 2014లో రామభద్రపురం వద్ద లారీడ్రైవర్‌ను, క్లీనర్‌ను చితకబాది.. వాహనంతోపాటు ఉడాయించిన కేసులో ధనురాన ఎ2 నిందితుడిగా ఉన్నాడు. అప్పటివరకూ గంజాయికి అలవాటు పడిన అతను.. అది లేకుండా ఒక్క క్షణమైనా ఉండలేని పరిస్థితి జైలులో ఏర్పడింది. నాలుగు మాసాలుగా బొబ్బిలి సబ్‌జైలులో శిక్ష అనుభవిస్తున్న ధనురాన.. అవకాశం దొరికితే పరారవ్వడానికే నిర్ణయించుకున్నాడు.
 
 అదును చూసి.. గోడ దూకాడు!
 సహచర  ఖైదీలతో కలసి 2వ నంబరు గదిలో ధనురాన ఉండేవాడు. జైలు చుట్టూ గోడపై విద్యుత్తు కంచె ఏర్పాటు చేసిన అధికారులు ఖైదీలుండే గదుల సమీపంలోని గోడకు మాత్రం పెట్టలేదు. అదే పరారైన ధనురానకు కలిసొచ్చింది... దారి దోపిడీ కేసులో నిందితుడు జైలులో ఉన్నా ఇటు జైలుశాఖ ఉద్యోగులు, అటు సివిల్ పోలీసులు.. సాధారణ ఖైదీలలాగానే బందోబస్తులను నిర్వహించారు. ప్రతిరోజూ ైఖైదీలను రోజుకు మూడుసార్లు బయటకు తీసుకువస్తారు. ఉదయం అల్పాహారం, పది గంటలకు మధ్యాహ్న భోజనం, సాయంత్రం 5 గంటలకు రాత్రి భోజనం పెట్టి తిరిగి గదిలోనికి పంపించేస్తారు. ఈ నెల 24న సబ్‌జైలులో ఉండే 17 మంది నిందితులతోపాటు ధనురాన కూడా సాయంత్రం భోజనానికి వచ్చాడు. ఎప్పుడూ భోజనాన్ని ఆలస్యంగా చేసే నిందితుడు..
 
 ఆ రోజు తొందరగా తినేసి తన గది వైపు వచ్చాడు. ఈ విషయం ఎవరూ గమనించలేదు. గదులపై ఉండే సిమెంటును రేకు పట్టుకొని మీదకు చేరి అక్కడుండే పెన్షింగ్ జాయింట్ తొలగించి, దానిని సాగదీసి క్షణాల్లో బయటపడ్డాడు. పాత సబ్‌ట్రైజరీ కార్యాలయం వైపు దిగి జనాల్లో కలిసిపోయాడు. జైలు కట్టినప్పుడు వేసి ఇనుప పెన్షింగ్ ఎండకు ఎండటం, వానకు తడవడం వల్ల పూర్తిగా పాడైపోవడంతో దానిని సాగదీయడం అతనికి సులభతరమైంది. అక్కడ నుంచి అతను సొంత గ్రామం జైపూర్ వెళ్లిపోవడానికి  రామభద్రపురం వైపు వెళ్తున్న లారీని పట్టుకొని పరారైనట్లు సమాచారం.
 
 ఖైదీల బేరక్స్‌కు తాళాలేసుంటే!
 ఖైదీలు గదుల్లో ఉన్నప్పుడు, వారంతా బయటకు వచ్చినప్పుడు వారుండే బేరక్స్‌కు తాళాలు వేయాలి. ఆ బాధ్యతను జైలు శాఖ నిర్వహిస్తుంటుంది. అయితే సాధారణంగా సబ్ జైలులో దీనిని పాటించరు. ముద్దాయిలు పోలీసుల కళ్లుగప్పి వెళ్లిపోరనే నమ్మకంతో వారిని లోపల కొంచెం చూసీచూడనట్లు వదిలేయడమే ఖైదీ పరారవ్వడానికి ఆస్కారం కలిగిందనే వాదన వినిపిస్తోంది.
 
 సివిల్ పోలీసుల పాత్ర ఎంత?
 ఖైదీ పరారవ్వడంతో దానికి బాధ్యతగా సివిల్ పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలలని జైళ్ల శాఖ ఎస్పీకి ప్రతిపాదనలు పెట్టింది. సబ్ జైలులో ప్రతి రోజూ ఒక హెచ్‌సీ, నలుగురు కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తుంటారు. వీరిని పట్టణ, రూరల్ పోలీసులు సంయుక్తంగా స్టేషన్ల నుంచి ఒక్కొక్కరిని ఈ విధులకు వేస్తుంటారు. సెంట్రీ డ్యూటీతోపాటు రక్షణకు వీరిని వినియోగిస్తారు. సివిల్ పోలీసులు వారి విధుల్లో సక్రమంగా లేకపోతే వెంటనే హౌస్ అధికారికి జైళ్ల శాఖ ఫిర్యాదు చేయాలి. ఈ విధుల్లో ఉన్న వారిలో ఒక కానిస్టేబుల్‌కు వీక్లీ ఆఫ్ తీసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఖైదీ పరారైన రోజు విధుల్లో ఉన్న సివిల్ పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ నలుగురిని సిఫార్సు చేస్తూ జైళ్ల శాఖ జిల్లా ఎస్పీకి ప్రతిపాదనలు పంపింది. అయితే జైలు లోపల జరిగిన సంఘటనకు సివిల్ పోలీసులు ఎలా బాధ్యత వహిస్తారని ఆ శాఖాధికారులు వ్యాఖ్యానిస్తున్నా.. మరి జిల్లా అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి
 

మరిన్ని వార్తలు