సదరంగం

5 Aug, 2015 01:26 IST|Sakshi

 ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో బతుకు వెళ్లదీద్దామనుకున్న వికలాంగులతో బ్రోకర్లు ఆటలాడుతున్నారు. ధ్రువీకరణ పత్రం కోసం వికలాంగులు ఆశ్రయిస్తుంటే వారు దండిగా సొమ్ము వసూలు చేస్తూ ఫోర్జరీ సంతకాలు చేస్తూ నకిలీ ధ్రువీకరణ పత్రాలు అందజేస్తున్నారు. వికలాంగులు వాటిని తీసుకుని సదరం సర్టిఫికెట్ కోసం వెళ్లేసరికి అవి నకిలీవని వైద్యులు గుర్తిస్తున్నారు. సదరం సర్టిఫికెట్ మంజూరుకు తిరస్కరిస్తున్నారు.
 
 విజయనగరం ఆరోగ్యం:  కేంద్రాస్పత్రిలో మరోసారి నకిలీ వికలాంగుల ధ్రువీకరణ పత్రాలు వెలుగు చూశా యి. గతంలో ఇచ్చిన మాన్యువల్ వికలాంగ ధ్రువీకరణపత్రాన్ని పట్టుకుని ఓ మహిళ సదరం సర్టిఫికెట్ కోసం మంగళవారం  కేంద్రాస్పత్రిలోని కంటి విభా గానికి వచ్చింది.ఆ ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించిన కంటి వైద్యుడు డాక్టర్ త్రినాథ్‌రావు ఆ సర్టిఫికెట్‌ను నకిలీదిగా గుర్తించారు. ధ్రువీకరణ పత్రంపై సంబంధిత విభాగానికి చెందిన వైద్యుడుతో పాటు మరో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంతకం చేయాలి. వీరిద్దరి సంతకాలు అయిన తర్వాత సూపరింటెండెంట్‌సంతకం పెడతారు. అప్పుడు వికలాంగులకు అందజేస్తారు.అయితే కంటి వైద్యుని వద్దకు మహిళ తెచ్చిన ధ్రువీకరణ పత్రంలో  సివిల్ అసిస్టెంట్ సర్జన్ సంతకం లేదు. మిగతా రెండు సంతకాలు కూడా అనుమానా స్పదంగా ఉన్నాయని కంటి వైద్యుడు తెలిపారు. ధ్రువీకరణ పత్రం నకిలీదని తేలడంతో  సదరం సర్టిఫికెట్‌ను నిలిపివేసినట్టు కంటి వైద్యుడు త్రినాథ్‌రావు తెలిపారు.
 
 ఇది రెండోసంఘటన
 కేంద్రాస్పత్రిలో గతంలో కూడా వికలాంగుల  నకిలీ సర్టిఫికెట్స్ వెలుగుచూశాయి. ఏడాదిక్రితం నలుగురు వికలాంగులు సదరం సర్టిఫికెట్స్ కోసం కేంద్రాస్పత్రి ఎముకల విభాగానికి ధ్రువీకరణ పత్రాలు తీసుకుని వచ్చారు. అయితే  వాటిని పరిశీలించిన ఎముకల వైద్యుడు  సంతకాలు ఫోర్జరీ చేసినట్టు గుర్తించి ఆ పత్రాలను తీసుకుని కేంద్రాస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు.
 
 వైద్యుల సంతకాలు  ఫోర్జరీ చేస్తున్న బ్రోకర్లు
 కేంద్రాస్పత్రికి సమీపంలో ఉన్న ఓ దుకాణాన్ని అడ్డాగా చేసుకుని బ్రోకర్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసే ధ్రువీకరణ పత్రాలను కలర్ జిరాక్సు తీసి దందాకు పాల్పడుతున్నారు. ఒక్కో ధ్రువీకరణ పత్రానికి రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైద్యుల సంతకాల  దగ్గర నుంచి స్టాంపుల వరకు అన్నీ  బ్రోకర్ల వద్ద ఉన్నాయి. దీంతో వైద్యుని వద్దకు వెళ్లకుండానే బ్రోకర్లే దందాను కొనసాగిస్తున్నారు.  అయితే ప్రభుత్వం పింఛను వస్తుందనే ఆశతో  బ్రోకర్ ఇచ్చింది  ఒరిజనల్ సర్టిఫికెటో, నకిలీదో తెలియక వికలాంగులు  మోసపోతున్నారు. సదరం సర్టిఫికెట్ కోసం వచ్చినప్పుడు బ్రోకర్ ఇచ్చింది నకిలీ సర్టిఫికెట్ అని తెలిసి లబోదిబోమంటున్నారు. బ్రో కర్ల దందాకు అడ్డుకట్ట వేయకపోతే మరింత మంది వికలాంగులు నష్టపోయే  ఆస్కారం ఉంది.
 

మరిన్ని వార్తలు