కుళాయి ద్వారా ప్రతి ఇంటికీ సురక్షిత నీరు

23 Oct, 2019 04:27 IST|Sakshi

కొత్త వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం 

సాక్షి, అమరావతి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కుళాయిల ద్వారా ప్రతి ఇంటికీ సురక్షితమైన నీటిని సరఫరా చేసేలా రూపొందించిన సరికొత్త వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు..రానున్న 30 ఏళ్ల కాలంలో అంటే 2051 సంవత్సరం నాటికి రాష్ట్రంలో పెరిగే జనాభా, పశు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ స్లప్లయి కార్పొరేషన్‌ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తుంది. ఏడాది మొత్తం సరఫరాకు అవసరమయ్యే నీరు ఏ ఏ సాగునీటి ప్రాజెక్టులలో అందుబాటులో ఉంటుందన్నది అంచనా వేసి.. ఆయా ప్రాజెక్టుల నుంచి వాటికి సమీపంలో ఉండే ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా నీటి తరలించడానికి వీలుగా ప్రాజెక్టు రూపకల్పన ఉంటుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. 
- ఈ ప్రాజెక్టు ద్వారా రోజూ గ్రామీణ ప్రాంతంలో ప్రతి వ్యక్తికి 105 లీటర్లు, పట్టణ, మున్సిపల్‌ ప్రాంతంలో135 లీటర్లు, నగరాల్లో ఉండే వారికి 150 లీటర్ల చొప్పన నీటి సరఫరా చేస్తారు.
ప్రాజెక్టు రిజర్వాయర్‌ నుంచి ఇంటికి మధ్య నీటి సరఫరా సమయంలో 10 శాతానికి మించి నీరు వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
నిర్ణీత ప్రామాణిక ప్రమాణల మేరకు ఉండే నీటినే సరఫరా చేస్తారు. 
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే నిధులను ప్రభుత్వ కేటాయింపులకు తోడు ప్రభుత్వ రంగ బ్యాంకులు, నాబార్డు, ఇతర విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకునేందుకు ఏపీ డ్రింకింగ్‌ వాటర్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  ప్రాజెక్టును ప్లబిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ), హైబ్రీడ్‌ యానిటీ విధానంలో కాంట్రాక్టుకు అప్పగించేందుకు అనుమతి తెలిపింది.  

మరిన్ని వార్తలు