నత్తకు నేర్పిన నడకలివీ

17 Jun, 2016 00:43 IST|Sakshi

జిల్లాలో ఉపాధి పనుల తీరిది...
నిధులు ఉన్నా ... పనులు సున్నా
ముందుకు సాగని పంట కుంటలు
అదే బాటలో ఇంకుడు గుంతల తవ్వకం

 

అమరావతి : జిల్లాలో ఉపాధి కూలీలకు పని దినాలు కల్పించడంలో అధికార యంత్రాంగం లక్ష్యానికి ఆమడ దూరంలో ఉంది. పనులు చేసిన కూలీలకు వేతనాల ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మాచర్ల నియోజకవర్గంలో ఉపాధి పనులు పూర్తిగా నత్తనడకన సాగుతున్నాయి. అక్కడ సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

 

పంట కుంటలు...ఇంకుడు గుంతలు...
జిల్లాలో పంట కుంటల పనులు ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా క్షేత్ర స్థాయిలో ముందుకు సాగడం లేదు. జిల్లాలో లక్ష పంట కుంటలు తవ్వాలని లక్ష్యంగా నిర్ణయించగా,  కేవలం 12, 328 పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటి వరకు కేవలం 3, 863 పంట కుంటలు మాత్రమే పూర్తి అయ్యాయి. 10 మండలాల్లో 10 లోపు పంట కుంటలు కూడా పూర్తికాకపోవడం గమనార్హం. ఇంకుడు గుంతల విషయానికి వస్తే పంచాయతీకి కనీసం ఒకటి, రెండు చొప్పున తవ్వాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది.  ఇప్పటివరకు 28, 907 ఇంకుడు గుంతలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది . ఇందులో 10,967 పనులు పురోగతిలో ఉండగా, పూర్తి స్థాయిలో ఎక్కడా  పూర్తి కాలేదు.

 
మొక్కలు లేక ఆగిన బండ్ ప్లాంటేషన్....

గత ఏడాది జిల్లాలో పొలాల గట్ల వెంబడి ఆరు లక్షల మొక్కలను పెంచాలని లక్ష్యం కాగా, మొక్కలు దొరకలేదనే సాకుతో గత ఏడాది నిలిపివేశారు. ఈ ఏడాది అనుకూల వాతావరణం ఉన్నప్పటికీ మొక్క ల కొరతే అడ్డంకిగా మారింది.  ఈ ఏడాది కూడా అటవీ శాఖ మొక్కలను సరఫరా చేయలేమని ఇప్పటికే డ్వామా అధికారులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఉపాధి హామీ పథకం ద్వారా 4లక్షల టేకు మొక్కల పెంపకాన్ని జిల్లాలోని ఆరు నర్సరీల్లో చేపట్టినప్పటికీ అందులో 50 శా తంకు పైగా మొక్కలు చనిపోయినట్లు సమాచారం. దీంతో ఈ ఏడాది కూడా గట్లపై టేకు మొక్కల పెంపకం ప్రశ్నార్థకంగా మారనుంది.

 
సిబ్బంది కొరత...

జిల్లాలో 602మంది రెగ్యులర్ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉండగా, ఎక్కువ శాతం అంటే 321మంది సీనియర్ మేట్‌లు విధులు నిర్వర్తిస్తున్నారు. టీటీఏ లు 25మంది, నాలుగు కంప్యూటర్ అపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. గ్రామాల్లో సిమెంట్ రోడ్డు పనులతో పాటు, ఉపాధిశాఖ ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న అన్ని పనులు మందకొడిగానే నడుస్తున్నాయి. కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రత్యేక దృష్టి సారించి, పనుల్లో వేగం పెంచే దిశగా చర్యలు తీసుకొంటున్నా  క్షేత్రస్థాయిలో ముందుకు సాగటం లేదు.

 
పనుల వేగం పెంచాం.. : జిల్లాలో పనుల వేగం పెంచాం. ఈ ఏడాది మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో జిల్లాను అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం.         - పులి శ్రీనివాసులు, డ్వామా పీడీ, గుంటూరు.

 


జిల్లాలో ఇచ్చిన జాబ్ కార్డులు            : 7,60, 930
ఇప్పటి వరకు  పని కల్పించిన కూలీల సంఖ్య : 3,60,970
100 రోజులు పని దినాలు కల్పించిన కుటుంబాలు : 1209

 

 

మరిన్ని వార్తలు