ముందుకు సాగని రబీ

12 Jan, 2015 02:22 IST|Sakshi
ముందుకు సాగని రబీ
  • వర్షపాతం లోటు 42 శాతం
  • సాగుభూమి మొత్తం 25.89 లక్షల హెక్టార్లు
  • సాగయింది 14.72 లక్షల హెక్టార్లలోనే..
  • సాక్షి, హైదరాబాద్:  రాష్ట్రంలో రబీ సాగు ముందుకు సాగడం లేదు. తీవ్ర వర్షాభావం, సాగర్ కుడి కాల్వకు నీటి విడుదలపై అయోమయంతో వ్యవసాయశాఖ ఆశించిన మేరకు పంటలు పండలేదు. ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించి వంద రోజులు దాటిపోయినా రాష్ట్రంలో ఎక్కడా చెప్పుకోదగిన వర్షాలు పడలేదు. సాగర్ కుడి కాల్వ కింద సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల వివాదంతో పంటలు పూర్తయ్యేంత వరకు నీరు వస్తుందో రాదో అంతుబట్టకుండా ఉంది.

    దీంతో సంక్రాంతికి వరి కోతలు ముగించే ప్రాంతాల్లో రెండో పంట వేయడానికి రైతులు వెనకాడుతున్నారు. రబీ సీజన్‌లో 25.89 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతాయన్నది వ్యవసాయ శాఖ లెక్క. మామూలు పరిస్థితుల్లో ఇప్పటికి 90 శాతం పంటలు వేయడం పూర్తి కావాలి. కానీ 59 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికి 18.75 లక్షల హెక్టార్లలో పంటలు వేయాల్సి ఉంటే 14.72 లక్షల హెక్టార్లలో పంటలు పడ్డాయి. రాయలసీమ జిల్లాల్లో వేసిన మొక్కజొన్న, రాగి, శనగ, వేరుశనగ, పెసర, పొద్దుతిరుగుడు వంటి మెట్ట పంటలు నీళ్లు లేక వాడిపోతున్నాయి.

    ఏ జిల్లాలోనూ సాగు పరిస్థితి సంతృప్తికరంగా లేదు. 7 జిల్లాల్లో 25 శాతం, 6 జిల్లాల్లో 26 శాతం విస్తీర్ణంలో మాత్రమే పంటలు వేసినట్టు వ్యవసాయశాఖ పేర్కొంది. ఇక వర్షపాతం లోటు కూడా నానాటికీ పెరిగిపోతోంది. గత వారంలో 40 శాతంగా ఉన్న లోటు ఇప్పటికి 42 శాతానికి చేరింది. రాష్ట్రంలోని 13 జిల్లాలూ వర్షాభావాన్ని ఎదుర్కొంటున్నాయి.

    శ్రీకాకుళం జిల్లాలో 10.7 శాతం, విజయనగరంలో 4.9, విశాఖలో 19.4, తూర్పుగోదావరిలో అత్యధికంగా 49.8, పశ్చిమ గోదావరిలో 44.7, కృష్ణాలో 41.7, గుంటూరులో 39.2, ప్రకాశంలో 46.6, నెల్లూరులో 45.2, చిత్తూరులో 46.2, కడపలో 49.4, అనంతపురంలో 44.5, కర్నూలు జిల్లాలో 32.8 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జూన్ ఒకటి నుంచి ఇప్పటికి కురవాల్సిన వర్షపాతం 855.3 మిల్లీమీటర్లు కాగా 549.7 మిల్లీమీటర్లు నమోదైంది.
     
    సాగు పరిస్థితి ఇలా..

    మాగాణి భూముల్లో మొక్కజొన్న సాగుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మరికొన్ని చోట్ల ఇప్పటికే నువ్వు విత్తారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పొగాకు నాట్లు ఊపందుకున్నాయి. అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో వరి, మొక్కజొన్న, జొన్న, శనగ, వేరుశనగ, పొద్దుతిరుగుడు పంటలకు తెగుళ్లు సోకడంతో రైతులు నానా ఇక్కట్లు పడుతున్నారు. మరోవైపు నాగార్జునసాగర్ రిజర్వాయర్‌లో సైతం నానాటికీ నీటి నిల్వ తరుగుతోంది.

    గత ఏడాది ఇదేకాలానికి 565 అడుగుల నీళ్లు ఉంటే ప్రస్తుతం 555 అడుగుల మేరకే నీరుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కుడి కాల్వ కింద రబీలోనే అత్యధికంగా వరి సాగుచేస్తుంటారు. ప్రస్తుతం వేసిన పంట చేతికి రావాలంటే కనీసం మరో నెల రోజులైనా నీళ్లు ఇవ్వాల్సి ఉంది. ఇక జిల్లాల వారీగా సాగు విస్తీర్ణం చూస్తే శ్రీకాకుళంలో అత్యధికంగా సాగయింది. 69,454 హెక్టార్లకుగాను ఇప్పటికి 61,791 హెక్టార్లలో పంటలు పడ్డాయి. అతితక్కువగా తూర్పు గోదావరి జిల్లాలో 29,823 హెక్టార్లకుగాను 8,976 హెక్టార్లలో మాత్రమే పంటలు  వేసినట్టు వ్యవసాయ శాఖ తెలిపింది.
     

మరిన్ని వార్తలు